logo

ఎటు చూసినా వైకాపా రంగులే

ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా కూడా నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేయడంలో అధికార యంత్రాగం వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడుతోంది

Published : 03 Apr 2024 05:01 IST

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే: ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా కూడా నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేయడంలో అధికార యంత్రాగం వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. ప్రధానంగా అధికార పార్టీకి  చెందిన రంగులను ప్రభుత్వ భవనాలు, పాఠశాలలపై అలాగే ఉంచేసినా కూడా ఎవరూ పట్టించుకోవడంలేదు. బాపులపాడు మండలంలోని పలు గ్రామాల్లో వివిధ భవనాలకు వైకాపా రంగులు బహిరంగంగా కన్పించకుండా ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కానుమోలులో అయితే మండల పరిషత్తు పాఠశాల భవనంలో తొలుత రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేశారు. వెంటనే పాఠశాలని చూడకుండా వైకాపా రంగులతో నింపేశారు. పాఠశాలల్లో ప్రభుత్వ కార్యకలాపాలు వద్దని వెంటనే గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు తీసివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో పక్కనే ఉన్న సహకార సంఘ భవనంలోకి మార్చారు. కానీ రంగుల్ని మాత్రం అలాగే వదిలేశారు. ప్రస్తుతం అక్కడ పాఠశాల కొనసాగుతున్నా, ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా కూడా రంగులు ఉండకూడదన్న స్పృహే లేకుండా వ్యవహరిస్తున్నారు. దంటగుంట్ల గ్రామ పంచాయతీ కార్యాలయానికి, కానుమోలు ఆరోగ్య ఉపకేంద్రానికి నిండుగా వైకాపా రంగులు వేసి అలాగే కొనసాగిస్తున్నారు. కాకులపాడులో రక్షిత పథకం ట్యాంకుకు గతంలోనే నిండుగా అధికార పార్టీ రంగులు పులిమేశారు. కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత రంగులు మార్చే ప్రయత్నం చేస్తున్నామంటూ పనులు చేపట్టి మధ్యలోనే అలాగే వదిలేశారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని