logo

రసీదు చూపినా ఎందుకు ఆపాల?

ఏలూరు జిల్లాకు పాలు, పాల పదార్థాలను సరఫరా చేసిన వ్యాను తిరుగు ప్రయాణంలో తమ ఏజెంట్ల వద్ద సొమ్ములు (కలెక్షన్లు) తీసుకుని సూపర్‌వైజర్లు వస్తున్నారు.

Published : 03 Apr 2024 05:08 IST

నగదు స్వాధీనం.. ఇదెక్కడి న్యాయం? '

జూ ‘విజయ’ డెయిరీ వ్యాన్లకు తనిఖీల దెబ్బ

 ఈనాడు, అమరావతి : ఏలూరు జిల్లాకు పాలు, పాల పదార్థాలను సరఫరా చేసిన వ్యాను తిరుగు ప్రయాణంలో తమ ఏజెంట్ల వద్ద సొమ్ములు (కలెక్షన్లు) తీసుకుని సూపర్‌వైజర్లు వస్తున్నారు. నూజివీడు సమీపంలో ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అంటూ తనిఖీ చేయగా మొత్తం రూ.5.3లక్షలు నగదు లభ్యమైంది. దీనికి తమ పాలు, పాల పదార్థాలకు సంబంధించిన సొమ్ములు అంటూ లెక్కలు చెప్పారు. అయినా బిల్లులు కావాలని అడిగారు. వాటికి ఉండవని, ప్రతి రోజూ ఇలాగే వసూలైన సొమ్ము తీసుకొస్తామని సమాధానం ఇచ్చారు. దీంతో మొత్తం సొమ్ము స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.వీటిలో అంతా రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లు మాత్రమే ఉంటాయి. ఇది అక్రమ సొమ్ము ఎలా అవుతుందంటూ ప్రశ్నించినా సమాధానం ఇవ్వలేదు. రేపు మాపు అంటూ కలెక్టరేట్‌ చుట్టూ తిప్పుతున్నారు.

 వేధింపులపై ఫిర్యాదుకు యోచన..

ఇదీ కృష్ణా జిల్లా మిల్క్‌ యూనియన్‌ పాల సరఫరాదారులకు (విజయ డెయిరీ) ఎదురైన ఘటన. గత 40 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా విజయ డెయిరీ పాల వ్యాన్లను తనిఖీల పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారు. పాల డబ్బులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) ప్రకారం రూ.50వేలకు మించి నగదు తీసుకెళ్లకూడదు. అంతకు మించి తీసుకెళ్లినా తగిన రసీదులు చూపించాల్సి ఉంటుంది. ధాన్యం విక్రయించిన, ఇతర వ్యవసాయోత్పత్తులు విక్రయించగా వచ్చిన నగదు తీసుకెళ్తుంటే తగిన పట్టీలు చూపిస్తే సరిపోతుందని జిల్లా ఎన్నికల అధికారులు చెబుతున్నారు. కానీ దానికి విరుద్ధంగా విజయ డెయిరీ పాల వ్యాన్లలో నగదు స్వాధీనం చేసుకుంటున్నారు. దీనిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేయాలని విజయ డెయిరీ ఛైర్మన్‌ చలసాని ఆంజనేయులు నిర్ణయించారు. కమిషనర్‌ అపాయింట్‌మెంట్‌ కోసం నిరీక్షిస్తున్నట్లు చెబుతున్నారు.

కంప్యూటరైజ్డ్‌ కావాలని పట్టు..

విజయవాడలో, బాపులపాడు మండలం వీరవల్లిలో విజయకు పాల ఫ్యాక్టరీలు ఉన్నాయి. రోజూ ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాలకు, గుంటూరు, ప్రకాశం, తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు పాలు సరఫరా చేస్తారు. ఆయా ప్రాంతాల్లో వీరి ఏజెంట్లు ఉన్నారు. రాత్రి పూట 110 రూట్‌లలో, పగలు 16 రూట్‌లలో వ్యాన్లు తిరుగుతాయి. రోజుకు 5లక్షల లీటర్ల పాలను రవాణా చేస్తుంటాయి. మొత్తం రూ.3కోట్ల టర్నోవర్‌ ఉంటుంది. అన్ని ప్రాంతాల్లో కలిపి దాదాపు 600 మంది అమ్మకందార్లు (ఏజెంట్లు) ఉంటారు. వీరిలో చాలా వరకు ఈ రోజు అమ్మకానికి సంబంధించిన సొమ్ములు వ్యాన్‌ డ్రైవర్లు, సూపర్‌వైజర్లుకు ఇస్తారు. కొంతమంది బ్యాంకుల ద్వారా, యూపీఐ(గూగుల్‌పే) ద్వారా చెల్లింపులు చేస్తారు. ఒక్కో వ్యానులో గరిష్ఠంగా రూ.3లక్షల నుంచి రూ.5లక్షల వరకు సొమ్ము తీసుకొస్తుంటారు. వీటికి ఆధారాలు ఉంటాయి. కానీ కంప్యూటరైజ్డ్‌ కావాల్సిందేనని అధికారులు పట్టుబడుతున్నారని విజయ డెయిరీ అధికారులు వాపోతున్నారు. ఈనెల 29న నూజివీడులో ఆగిరిపల్లి వద్ద స్వాధీనం చేసుకున్న సొమ్ము ఇంతవరకు విడుదల చేయలేదు.

నిబంధనలు ఏం చెబుతున్నాయ్‌..!

అక్రమంగా రవాణా చేసే సొమ్ము నల్లడబ్బు అయితేనే స్వాధీనం చేసుకోవాలి. న్యాయపరంగా రైతుల సొమ్ము అయితే పరిశీలించి లెక్కలు అడిగి అధికారుల విచక్షణతో వదిలివేయాలని చెబుతున్నారు. ప్రధానంగా రైతులను వేధింపులకు గురి చేయకూడదనే గ్రీవెన్స్‌ కమిటీ ఏర్పాటు చేశారు. పాల వ్యాన్లలో వచ్చే నగదు అంతా చిల్లర ఉంటుంది. రూ.500 కరెన్సీ నోట్లు ఉండడం లేదు. కేవలం రూ.100 నోటు లోపు డినామినేషన్‌ ఉంటుంది. దీన్ని నల్లడబ్బుగా అధికారులు ఎలా పరిగణిస్తారని సంస్థ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో రైతులకు చెల్లించాల్సిన సొమ్ములు స్వాధీనం చేసుకొని ఇబ్బందులు పెట్టడమేమిటని ఛైర్మన్‌ చలసాని ఆంజనేయులు ప్రశ్నించారు. గతంలో ఈ పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకవర్గంలో తెదేపా సానుభూతిపరులు ఉండడంతో వేధింపులకు గురి చేస్తున్నారనే విమర్శ ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని