logo

రాజీనామాల ముసుగు తొలగిపోయింది..!

Published : 03 Apr 2024 05:12 IST

వైకాపాకు ప్రచారం చేయడమే రహస్య ఎజెండా

మచిలీపట్నంలో పేర్ని కోసమేనని తేలిపోయింది

ఎన్నికల సంఘం ఆదేశాలు సైతం బేఖాతరు

 

బందరు 25వ డివిజన్‌లో ప్రచారం చేస్తున్న వాలంటీర్లు

మచిలీపట్నంలో మొన్న మూకుమ్మడిగా రాజీనామాలు చేసిన వాలంటీర్ల ముసుగు తొలగిపోయింది. వీళ్లలో చాలా మంది  వైకాపా తరఫున ప్రచారంలోకి సోమవారమే దూకేశారు. రాజీనామాలను ఇంకా ఆమోదించకముందే వైకాపా సేవలో తరించేందుకు సిద్ధమైపోయారు. సామాజిక పింఛన్లను వాలంటీర్ల ద్వారా ఇవ్వొద్దంటూ ఎన్నికల సంఘం ఆదేశాలను సైతం బేఖాతరు చేశారు.

 ఆడియో సందేశంతో..

పింఛన్ల పంపిణీలో రాజీనామా చేసిన వాలంటీర్లంతా పాల్గొనాలని, వృద్ధులను ఆటోలు పెట్టి మరీ దగ్గరుండి తీసుకెళ్లాలంటూ పేర్ని నాని ఓ ఆడియో సందేశం విడుదల చేశారు. దీంతో వీళ్లంతా ఈసీ ఆదేశాలను సైతం పట్టించుకోకుండా పింఛన్లకు తామే వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తామంటూ మచిలీపట్నంలోని పలు డివిజన్లలోకి వెళ్లి మంగళవారం ప్రచారం మొదలుపెట్టారు. మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని సూచన మేరకే వీళ్లు రాజీనామా చేసినట్లు దీంతో తేలిపోయింది. పేర్ని నాని కుమారుడు, మచిలీపట్నం వైకాపా అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి(కిట్టు)ని గెలిపించేందుకు తమ సేవలు అందించాలనే రహస్య అజెండాతోనే వీళ్లంతా ఈ ఉత్తుత్తి రాజీనామా అస్త్రాలను ప్రయోగించినట్లు బయటపడింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు అందిస్తూ గత 50 నెలలుగా నిస్వార్థ సేవలందిస్తున్న తమకు రాజకీయాలు ఆపాదించడంతో మనస్తాపం చెంది రాజీనామా చేస్తున్నట్లు వీళ్లు చెప్పిన మాటలు అబద్ధమని తేలిపోయింది.’

ఆసక్తిచూపని 90 శాతం..

ఉమ్మడి కృష్ణాలో 22,400 మంది వాలంటీర్లు ఉన్నారు. వీరందరినీ దర్జాగా తమ ప్రచారానికి వాడుకోవాలని వైకాపా నేతలు భావించారు. కానీ ఒక్కసారిగా వారి ఆశలపై ఎన్నికల సంఘం నీళ్లు చల్లింది. దీంతో వాలంటీర్లతో రాజీనామాలు చేయించి తమ ప్రచారంలో పావులుగా వాడుకోవాలని పథక రచన చేశారు. రెండు జిల్లాల్లో కలిపినా ఓ 1100 మంది మాత్రమే రాజీనామా చేశారు. వీరిలో వెయ్యి మంది వరకూ మచిలీపట్నంలో పేర్ని నాని సూచనలతోనే రాజీనామా చేశారు. అది కూడా మళ్లీ వారి వాలంటీరు కొలువును వైకాపా ప్రభుత్వం రాగానే రెండు నెలల్లో ఇప్పిస్తామని, అప్పటివరకూ గౌరవవేతనాన్ని ముందే ఇచ్చేస్తామనే హామీలను వైకాపా నేతలు ఇస్తున్నారు. అయినా రాజీనామా చేసేందుకు 90 శాతం మందికి పైగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో ఏం చేయాలో తెలియక వాలంటీర్లపైనే ఆశలన్నీ పెట్టుకున్న వైకాపా అభ్యర్థులు ప్రస్తుతం గిలగిలా కొట్టుకుంటున్నారు.

తాయిలాలన్నీ వారికే పంచారు..

ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు నెల రోజుల ముందు నుంచే కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లోని వైకాపా నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, వాలంటీర్లను ప్రచారంలో వాడుకునేందుకు చేసిన హడావుడి అంతాఇంతా కాదు. ప్రధానంగా పెనమలూరు, విజయవాడ మధ్య నియోజకవర్గం, మైలవరం, గన్నవరం, గుడివాడలో వాలంటీర్లతో వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తూ.. వారిని సత్కరిస్తూ.. విందు భోజనాలు పెడుతూ.. చేతిలో తాయిలాల సంచులు ఉంచుతూ.. వారి ద్వారా ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశారు. పెనమలూరు, మైలవరం నియోజకవర్గాల్లో వైకాపా ఆధ్వర్యంలో బహిరంగంగానే తాయిలాలు అందజేస్తూ అడ్డంగా దొరికారు. కానీ ఎన్నికల షెడ్యూల్‌ తర్వాత కోడ్‌ అమల్లోకి రావడంతో వాలంటీర్లపై కొరఢా ఝుళిపించడంతో పరిస్థితి మారిపోయింది. అందుకే ప్రస్తుతం వారితో రాజీనామాలు చేయించి ప్రచారంలో విచ్చలవిడిగా వాడుకోవాలని వైకాపా అభ్యర్థులు భావిస్తున్నారు. కానీ వారి ఉచ్చులో కనీసం ఐదారు శాతం మంది కూడా పడలేదు. గౌరవ వేతనం పేరుతో తమతో అయిదేళ్లు చాకిరీ చేయించుకున్నది చాలక, ప్రస్తుతం ఆ కొలువును కూడా వాళ్ల ప్రచారం కోసం వదిలేయమంటున్నారంటూ చాలా మంది వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వాయిస్‌ మెసేజ్‌లతో తప్పుడు ప్రచారం..

ప్రస్తుతం వాలంటీర్లతో ప్రచారం చేసే అవకాశం లేకపోయేసరికి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులపై విషం చల్లే ప్రక్రియను వైకాపా మొదలెట్టింది. వాలంటీర్లు లేకపోవడంతో పింఛన్లు ఇంక ఎవరికీ అందే పరిస్థితి లేదని, దీనికి కారణం తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి నేతలే కారణమంటూ’ వాయిస్‌ మెసేజ్‌లతో సామాజిక మాధ్యమాల ద్వారా వైకాపా అభ్యర్థులు ప్రచారం మొదలుపెట్టారు.

ఇది కాదా.. వైకాపా సేవ.. ?

‘తాతగారు, బామ్మగారు ఎలా ఉన్నారండి, నేను మీ వాలంటీరును, గత అయిదేళ్లుగా ప్రతి నెలా ఒకటో తారీకున మీ ఇంటికి వచ్చి పింఛను ఇవ్వగలిగాను. కానీ ప్రతిపక్షాలు ఉమ్మడిగా చేసిన చర్య వల్ల ఈ నెల, వచ్చే నెల మీ ఇంటికి వచ్చి పింఛన్‌ ఇవ్వలేకపోతున్నాను. మళ్లీ మన ఫ్యాను గుర్తుకే ఓటు వేసి వైకాపా అభ్యర్థులను గెలిపిస్తే మళ్లీ రెండు నెలల తర్వాత నేను మీ ఇంటికి వచ్చి పింఛన్లను అందిస్తాను.’ అంటూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి ఆసిఫ్‌ పేరుతో ఈ వాయిస్‌ మెసేజ్‌ను సామాజిక మాధ్యమాల్లో అందరికీ పంపిస్తున్నారు.

మూకుమ్మడిగా మరికొందరు..

గూడూరు, మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: గూడూరు మండలం మల్లవోలు పంచాయతీ పరిధిలో వివిధ గ్రామాలకు చెందిన 34 మంది వాలంటీర్లు మంగళవారం రాజీనామా చేశారు. పత్రాలను పంచాయతీ కార్యదర్శి తోట సుబ్రహ్మణ్యానికి అందజేశారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతోనే రాజీనామాలు చేసినట్లు తెలుస్తోంది. బందరు నగరపాలక సంస్థ పరిధిలో మరో 112 మంది, బందరు మండల పరిధిలో 34 మంది రాజీనామా పత్రాలు సమర్పించినట్లు అధికారులు తెలిపారు.

- ఈనాడు, ఈనాడు, డిజిటల్‌, - అమరావతి - న్యూస్‌టుడే, మచిలీపట్నం కార్పొరేషన్‌,

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని