logo

పింఛన్లు ఇంటి వద్దే పంపిణీ చేయాలి

సచివాలయ ఉద్యోగుల ద్వారా సామాజిక పింఛన్లు ఇంటి వద్దే అందించేలా చర్యలు తీసుకోవాలని తెదేపా నాయకులు కలెక్టర్‌ పి.రాజబాబుకు వినతిపత్రం అందజేశారు.

Published : 03 Apr 2024 05:14 IST

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: సచివాలయ ఉద్యోగుల ద్వారా సామాజిక పింఛన్లు ఇంటి వద్దే అందించేలా చర్యలు తీసుకోవాలని తెదేపా నాయకులు కలెక్టర్‌ పి.రాజబాబుకు వినతిపత్రం అందజేశారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆయనను కలిసిన పార్టీ నాయకులు బాబాప్రసాద్‌, ఇలియాస్‌పాషా, కుంచె నాని మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం పింఛనుదారులకు అసత్య ప్రచారాలతో పాలకుల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రతిపక్ష పార్టీలు పింఛను ఇవ్వనీయకుండా అడ్డుకుంటున్నాయని ప్రచారం చేస్తూ వారిని ఇబ్బందులకు గురిచేయాలనే ప్రయత్నం చేస్తోందన్నారు. వాలంటీర్లతో బలవంతంగా రాజీనామాలు చేయిస్తూ వారిని అధికార పార్టీ కార్యకర్తల్లా వాడుకుంటున్నారని తెలిపారు. ప్రతిపక్షాలు అడ్డుకున్నాయనే నమ్మకం కల్పించేందుకు పింఛనుదారులను పింఛను కోసం సచివాలయాలకు రప్పించి ఇబ్బందులకు గురిచేయాలనేది ప్రభుత్వ అభిమతంగా ఉందన్నారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఇంటి వద్దే పింఛను నగదు అందిచేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీసీ సాధికార రాష్ట్ర కన్వీనర్‌ అక్కుమహంతి రాజా, జడ్పీటీసీ మాజీ సభ్యులు నారాయణప్రసాద్‌, కార్పొరేటర్లు సమతాకీర్తి, దేవరపల్లి అనిత, దింటకుర్తి సుధాకర్‌, తదితరులు కలెక్టర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని