logo

కొమ్ముకాసినందుకే ‘రాజా’..!

కళ్ల ముందే అక్రమంగా ఇసుక తవ్వకాలు.. ఊరూరా మట్టి దందాలు.. భూముల ఆక్రమణలు.. అనధికార చేపల చెరువుల ఏర్పాట్లు.. ఒకటేమిటి.. అధికార పార్టీ నాయకులు చేసే దందాలు అన్నీ ఇన్నీ కావు.

Updated : 03 Apr 2024 06:32 IST

కృష్ణా కలెక్టర్‌పై ఈసీ బదిలీ వేటు

 

ఈనాడు, అమరావతి: కళ్ల ముందే అక్రమంగా ఇసుక తవ్వకాలు.. ఊరూరా మట్టి దందాలు.. భూముల ఆక్రమణలు.. అనధికార చేపల చెరువుల ఏర్పాట్లు.. ఒకటేమిటి.. అధికార పార్టీ నాయకులు చేసే దందాలు అన్నీ ఇన్నీ కావు.

  • ఆ నియోజకవర్గంలో ఆయన ప్రజాప్రతినిధి కాదు.. కేవలం ప్రజాప్రతినిధి తనయుడు మాత్రమే. అధికార పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థి. ఎన్నికల షెడ్యూల్‌ రాక ముందు అధికార కార్యక్రమాలకు ఆయనే హాజరు. కలెక్టర్‌ ఉన్నా ప్రారంభోత్సవాలు.. కొబ్బరికాయలు కొట్టుడు అన్నీ ఆయనే. అధికారులు అంతా అలా మర్యాద చేయాల్సిందే.
  •   ఓ ఎమ్మెల్యే మేనకోడలి వివాహం ఒక ప్రైవేటు కల్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. తనకున్న పలుకుబడితో ఆ ఎమ్మెల్యే సీఎంను ఆహ్వానించారు. ఇంకేముంది జాతీయ రహదారి నుంచి కల్యాణ మండపానికి అనుసంధానించే రహదారి అప్పటికప్పుడు రెండు రోజుల్లో నిర్మాణం చేశారు. కలెక్టర్‌ ఖాతా నుంచి నిధులు విడుదలయ్యాయి. టెండర్ల మాటే లేదు. నామినేషన్‌పై అత్యవసర పనులు. గత అయిదేళ్లుగా ఆ గ్రామ వాసులు నెత్తీనోరు బాదుకున్నా ఆ రోడ్డు నిర్మాణం చేయలేదు. కారణం మర్యాద..!(ప్రోటోకాల్‌). ఆ వివాహానికి దగ్గరుండి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.

ఇలా ఒకటా రెండా ఎన్నో.. ఎన్నెన్నో..! ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసేందుకు వచ్చిన సివిల్‌ సర్వీసు అధికారి నేతల ప్రసన్నం కోసం తరించిన ఘటనలు మచ్చుకు కొన్ని మాత్రమే. కృష్ణా జిల్లా కలెక్టర్‌ పి.రాజబాబును బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లా యంత్రాంగం ఉలిక్కిపడింది. అధికార పార్టీ నేతలతో ఉన్న సంబంధం ప్రధాన కారణమని జిల్లా అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. కృష్ణా కలెక్టర్‌ పి.రాజబాబు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్లు ఎన్నికల సంఘానికి తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పలు అంశాలపై ఆయన రెండు సార్లు ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ బదిలీ జరగడం చర్చనీయాంశమైంది. 2011 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి అయిన పి.రాజబాబు తొలిసారి కృష్ణా కలెక్టర్‌గా 2023 ఏప్రిల్‌ 15న నియమితులయ్యారు. అంతకుముందు జీవీఎంసీ కమిషనర్‌గా పని చేశారు.

తవ్వింది ఒకచోట.. పరిశీలన మరోచోట..

కృష్ణా నదిలో ఇసుక తవ్వకాలు భారీగా జరుగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేవు. ఎన్‌జీటీ ఆదేశాల ప్రకారం పర్యటించాల్సిన కలెక్టర్‌ రాజబాబు రొయ్యూరులో ఒకచోట తవ్వకాలు జరుగుతుంటే మరోచోట పరిశీలించి మమ అనిపించారు.అదే నివేదిక ఇచ్చారు.

పేర్ని నాని సిఫార్సులతోనే..

సీనియర్‌ అధికారి అయిన పి.రాజబాబు కలెక్టర్‌గా పని చేయాలనే ఆసక్తితో ఉండేవారు. కానీ ఈ ప్రభుత్వంలో అవకాశం రాలేదు. కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత పలువురికి అవకాశం కల్పించినా రాజబాబుకు రాకపోవడంతో అసంతృప్తితో ఉండేవారని తెలిసింది. మంత్రిగా ఉన్నప్పుడు పేర్ని నానితో ఉన్న పరిచయంతో ఆయన సిఫార్సులతో ఎట్టకేలకు రాజబాబుకు అవకాశం కల్పించారు. 2022లో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. జిల్లాల విభజన తర్వాత రంజిత్‌ బాషాను కలెక్టర్‌గా నియమించారు. ఆయన ఏడాది పనిచేసిన తర్వాత బదిలీ చేశారు. ఆయన స్థానంలో రాజబాబును నియమించారు. ఆ తర్వాత కలెక్టరేట్‌ వైకాపా నాయకుల అడ్డాగా మారిందన్న విమర్శలు ఉన్నాయి.

బోగస్‌ ఓట్లు.. నకిలీపట్టాలు..

ప్రధానంగా మచిలీపట్నం నియోజకవర్గంలో ఓటర్ల జాబితా అస్తవ్యస్తంగా తయారైంది. తెదేపా నాయకుడు, సామాజిక కార్యకర్త దిలీప్‌కుమార్‌ దీన్ని పలుమార్లు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. బందరు నియోజకవర్గంలో దాదాపు 16వేల బోగస్‌ ఓట్లు, జంబ్లింగ్‌ ఉన్నట్లు ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీన్ని పరిశీలించి అధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్‌ వీటిని అమలు చేయలేదు.
చర్యలు నిలిపేసి..: ఒక డిప్యూటీ తహసీల్దార్‌ సస్పెన్షన్‌కు ఉత్తర్వులు సిద్ధం చేసి రాజకీయ ఒత్తిడితో వాటిని జారీ చేయలేదు. రిటర్నింగ్‌ అధికారిగా ఉన్న ఆర్డీవో బదిలీ అయ్యారు. ఆయన తిరిగి కాకినాడ వెళ్లారు. ఓటర్ల జాబితాలో తప్పులు సరిదిద్దినా కారణమైన అధికారులపై చర్యలు తీసుకోలేదు. దీని వెనుక అధికార పార్టీ రాజకీయ కారణాలు ఉన్నాయనే విమర్శలు వచ్చాయి.

నకిలీ పట్టాల వ్యవహారం..

ఇటీవల నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారం సంచలనం సృష్టించింది. బందరులో రోడ్డు మార్జిన్‌లు, నీటి వనరులను ఆక్రమించిన వారికి క్రమబద్ధీకరణ పేరుతో ఇళ్ల పట్టాలు ఇస్తామని ఎమ్మెల్యే నాని హామీ ఇచ్చారు. ఇవి సుప్రీంకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకం. దీనిపై సీసీఎల్‌ఏ నుంచి స్పష్టత కోసం లేఖ రాశారు. అక్కడి నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. కానీ లబ్ధిదారుల పేరుతో ముందుగానే సీఎం చిత్రం వేసి పట్టాలు ముద్రించారు. బదిలీ అయిన తహసీల్దారు పేరుతో సంతకాలు చేసి పంపిణీకి శ్రీకారం చుట్టారు. దీన్ని తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర వెలుగులోకి తెచ్చారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. పట్టాలన్నీ సక్రమమే అంటూ మీడియాకు ఒక వివరణ విడుదల చేసి మౌనంగా ఉన్నారు. దీనిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది.

స్మారక భవనానికీ సహకరించక...

  •  ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవనం అనుమతులు రాకుండా తొక్కి పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ముడా నిధులు ఇష్టానుసారం ఖర్చు చేశారు. దాదాపు రూ.2 కోట్లు వెచ్చించి కలెక్టరేట్‌ క్యాంపు కార్యాలయం ఆధునికీకరణ చేశారు.
  •  గన్నవరంలో మట్టి తవ్వకాలు, పెడన, గుడివాడలో చేపల చెరువులు ఇష్టానుసారం తవ్వకాలు జరుపుతున్నా చర్యలు లేవు.
  •  పామర్రు నియోజకవర్గంలో కొన్ని వక్ఫ్‌భూముల ఆక్రమణలు పట్టించుకోలేదని తెలిసింది. వీటిపై ఫిర్యాదులు వెళ్లాయి.  గోపవారిపాలెంలో డీపట్టాల క్రమబద్ధీకరణలోనూ వివక్ష చూపినట్లు ఫిర్యాదులు ఉన్నాయి.
  •  ఆయన హయాంలో ఇద్దరు జేసీలు బదిలీ కావడం విశేషం. ధాన్యం సేకరణలో మంచి పట్టున్న ఓ అధికారిని ఇతర కారణాల వల్ల మాతృశాఖకు సరెండర్‌ చేశారు. ఆయన స్థానంలో ఉయ్యూరు ఆర్డీఓను నియమించారు. మొత్తానికి అధికార పార్టీ నేతలు చెప్పినట్లు బదిలీల్లోనూ వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి.
  • మంత్రి జోగి రమేష్‌, పామర్రు ఎమ్మెల్యే అనుచరులు ఇష్టానుసారం తవ్వకాలు జరుపుతున్నట్లు తెదేపా ఫిర్యాదులు చేసింది. కృష్ణా నదిలో బోడే ప్రసాద్‌, వర్లకుమారరాజా అడ్డుకున్నా ఎలాంటి కేసులు నమోదు కాలేదు. చర్యలూ తీసుకోలేదు. బందరు నియోజకవర్గంలో మట్టి తవ్వకాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని