logo

భయం భయం.. సమస్యలతో జీవనం

పెడనలోని రెండు ప్రాంతాల్లో పేదలకు ఏర్పాటు చేసిన నివాస కాలనీలు కష్టాలకు నిలయంగా మారాయి.

Published : 13 Apr 2024 04:17 IST

కనీస వసతులకునోచుకోని పేదల కాలనీలు

బల్లిపర్రు కాలనీలో నిరుపయోగంగా నివాసాలు

పెడన, న్యూస్‌టుడే: పెడనలోని రెండు ప్రాంతాల్లో పేదలకు ఏర్పాటు చేసిన నివాస కాలనీలు కష్టాలకు నిలయంగా మారాయి. 216 జాతీయ రహదారి పక్కగా శింగరాయపాలెం, బల్లిపర్రుల్లో ఏర్పాటైన వీటిలో దాదాపు 300లకు పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గత కొన్నేళ్లుగా ఈరెండు కాలనీల్లో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమకు ఇక్కడ ఇళ్లు ఎందుకిచ్చారంటూ ప్రశ్నిస్తున్నారు. బల్లిపర్రు కాలనీలో పెడన పట్టణ పేదలు నివసిస్తున్నారు. ఈ కాలనీ బల్లిపర్రు పంచాయతీలోకి వెళ్లడంతో అక్కడ ప్రగతి పూర్తిగా స్తంభించింది. శింగరాయపాలెం కాలనీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ డ్రెయిన్లు, రహదార్లు, తాగునీటి సౌకర్యంతో పాటు వీధి దీపాలు లేక బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.

విషసర్పాల సంచారం

కాలనీలోకి రాత్రి వేళల్లో విషసర్పాలు వస్తున్నాయి.వీధి దీపాలు లేక ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయం వేస్తోంది. కాలనీ అభివృద్ధిని కొన్నేళ్లుగా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.పంట పొలాలను ప్లాట్లుగా మార్చి ఇళ్లు కట్టమన్నారు. ఇప్పటివరకు కాలనీలో ఒక్క రోడ్డు కూడా వేయలేదు. వర్షాలు వస్తే ముంపు బాధలు తప్పడం లేదు.

బొడ్డు చిట్టెమ్మ, అరుణ శింగరాయపాలెం కాలనీ

ఎవరూ పట్టించుకోరు

ఈ కాలనీ పరిధి బల్లిపర్రు పంచాయతీలోకి వస్తుంది. కాలనీ వాసులందరూ పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. పంచాయతీ పట్టించుకోదు. మున్సిపాలిటీ కనికరించదు. ఏళ్లుగా మౌలిక సదుపాయాలు లేక అవస్థలు పడుతున్నాం

పిండి జగన్మాత, బల్లిపర్రు కాలనీ

కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లినా..

కాలనీ సమస్యను ఇప్పటివరకు నలుగురు కలెక్టర్ల దృష్టికి స్పందన ద్వారా తీసుకెళ్లాం. ఒక రోజు రెవెన్యూ అధికారులు ఇంటింటి సర్వే కూడా చేపట్టారు. ఆ తర్వాత ఎలాంటి కదలిక లేదు. కాలనీలో రహదార్లు, డ్రెయిన్లు, వీధిదీపాలు, తాగునీటి సౌకర్యం లేక విషసర్పాల మధ్య జీవనం సాగిస్తున్నాం.

అన్నమనేని భవాని, బల్లిపర్రు కాలనీ

తాగునీటికి అవస్థలు

తాగునీటి సరఫరా లేదు. వేసవిలో మరింత ఇబ్బందిగా ఉంది. మున్సిపాలిటీ నుంచి ట్యాంకర్లు వస్తోన్నా సరిపోవడం లేదు. ఈ సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు.

బెజవాడ సత్యనారాయణ, శింగరాయపాలెం కాలనీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని