logo

చూస్తారు.. దోచేస్తారు

నగర పాలకులకు, ప్రజాప్రతినిధులకు, శాసన సభ్యులకు, చివరకు వైకాపా నాయకులకు అక్రమ కట్టడాలే ఆదాయ వనరుగా మారిపోయాయి.

Published : 13 Apr 2024 04:19 IST

నగరంలో అనధికార భవన నిర్మాణాలు
మామూళ్లు దండుకుంటున్న వైకాపా ప్రజాప్రతినిధులు
విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే

పశ్చిమంలో ఓ కార్పొరేటర్‌ అండతో సాగుతున్న అక్రమ కట్టడం

నగర పాలకులకు, ప్రజాప్రతినిధులకు, శాసన సభ్యులకు, చివరకు వైకాపా నాయకులకు అక్రమ కట్టడాలే ఆదాయ వనరుగా మారిపోయాయి. విజయవాడలోని 64 డివిజన్లలో ఎక్కడపడితే అక్కడ బరితెగించి అక్రమ నిర్మాణాలకు కొమ్ముకాస్తూ రూ.లక్షలు కొల్లగొడున్నారు. ఎన్నడూలేని విధంగా శాసనసభ్యులు, కార్పొరేటర్లే ప్రణాళికాధికారులుగా మారిపోయారు. వారి అనుమతి, అండ లేనిదే ఏ ఒక్కటీ నిర్మించేందుకు వీలులేని స్థితి కల్పించారు. అధికారులు డమ్మీలైపోయారు.

  • మధ్య శాసనసభ్యుడి కుటుంబ సభ్యుల పేరిట గవర్నరుపేటలోని స్థలంలో ప్లానుకు భిన్నంగా అక్రమంగా రెండు అదనపు అంతస్తులు నిర్మించగా, అధికారులు నిలువరించలేకపోయారు. అదే అదనుగా మరో అంతస్తు అక్రమంగా నిర్మించేందుకు యత్నించగా, పత్రికల్లో వచ్చిన వార్తతో దిగొచ్చారు. సదరు శాసనసభ్యుడి కుటుంబ సభ్యులకు నియోజకవర్గంలోని 21 డివిజన్లలో అక్రమ భవనాలు నిర్మిస్తున్న వారు ముడుపులు చెల్లించుకోవాల్సిందే. అవి లేకుండా ఒక్క ఇటుక కూడా పెట్టనివ్వని పరిస్థితి. నియోజకవర్గంలో ఎవరైనా అక్రమ నిర్మాణాలకు పాల్పడితే వాటిని పసిగట్టి, యజమానులను పిలిపించి దండుకోవడం పలువురు కార్పొరేటర్లు అలవాటుగా మార్చుకున్నారు. నియోజకవర్గంలో లెక్కకు మించి జరుగుతున్న అక్రమ కట్టడాలే వారికి ప్రధాన ఆదాయ వనరులుగా మారాయి.
  • తూర్పులోని వైకాపా నాయకుడొకరు నలుగురు అనుయాయుల ద్వారా నియోజవకర్గంలో 21 డివిజన్లలో జరిగే అక్రమ కట్టడాల గురించి తెలుసుకుంటారు. అనంతరం అధికారులను ఉసిగొల్పడం, పగల గొట్టించడం.. ఆపై తమ వద్దకు రప్పించుకోవడం, దండుకోవడం అలవాటుగా మార్చేసుకున్నారు. నియోజకవర్గ పరిధిలోని అత్యధిక డివిజన్లలో వందల సంఖ్యలో అక్రమ కట్టడాలు సాగుతుంటాయి. వాటి తాలుకా రూ.లక్షల్లో సొమ్ము వారి జేబుల్లోకి చేరుతోంది.
  • పశ్చిమంలోని 22 డివిజన్లలో లెక్కకు మించి అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు. అక్కడిశాసనసభ్యుడి అనుయాయులైన ఇద్దరు అందినకాడికి దండుకుంటున్నారు. మరో ఇద్దరు అనుయాయలు సైతం ఆయన పేరుచెప్పి అక్రమ కట్టడాలతో చెలరేగిపోతున్నారు.

ముఖ్య ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుడి హవా

నగరపాలక సంస్థ ఓ ముఖ్య ప్రజాప్రతినిధి, తన కుటుంబ పెద్ద హవానే నేడూ నడుస్తోంది. ఎక్కడ అక్రమ కట్టడం జరిగినా కాసుల వాటాలు వారికి పంపాల్సిందే. ఏ అధికారి క్షేత్ర స్థాయి విధుల్లో చేరినా మామూళ్లు ఇవ్వాల్సిందే. ఇటీవల భవానీపురంలో సదరు ముఖ్య ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుడి సన్నిహితుడు అక్రమ నిర్మాణం చేయించేందుకు ఓ బిల్డరు నుంచి రూ.7 లక్షలు దండుకున్నట్లు బాధితుడు చెప్పిన వీడియా సామాజిక మాధ్యమాల్లో హల్‌చెల్‌ చేసింది. అదే అక్రమ కట్టడాన్ని అడ్డుపెట్టుకుని ముఖ్య ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుడు మరో రూ.5 లక్షలు, ఆపై స్థానిక కార్పొరేటర్‌ మరో రూ.13 లక్షలు వసూలు చేశారని బాధితుడు ఆరోపించాడు. పాతబస్తీలో కొద్ది రోజుల కిందట ఒక్కసారిగా 13 అక్రమ భవనాల నిర్మాణం చేపట్టగా, అడ్డుకున్న ప్రణాళికాధికారిని పాలకులు అత్యంత వేగంగా సాగనంపారు. గట్టువెనుక ఓ నలుగురు వైకాపా కార్పొరేటర్లూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు.

అధికారుల్లో బదిలీల భయం

అక్రమ కట్టడాలను అడ్డుకున్న అధికారులను బదిలీ చేయిస్తారనే భయం ప్రణాళికాధికారులను వెంటాడుతోంది. సాహసం చేసి అడ్డుకుంటే, ఆ వెంటనే ముఖ్యప్రజాప్రతినిధి నుంచి ఫోన్లు వెళ్లిపోతున్నాయి. దీంతో నిస్సహాయలై వెనుదిరగాల్సి వస్తోంది. అక్రమ కట్టడాలను అడ్డుకునే ప్రణాళికాధికారులను ఇతర ప్రాంతాలకు బదిలీలతోనూ, క్షేత్రస్థాయి విధుల నుంచి తప్పించడం వంటి చేస్తున్నారు. తమకు అనుకూలమైన వారు బదిలీ అయితే తిరిగి రప్పించుకునేందుకు సిఫారసులు చేస్తున్నారు.

ఎన్నో అక్రమ కట్టడాలు!

వైకాపా అధికారంలోకి వచ్చాక అక్రమ కట్టడాలు, అనుమతిలేని భవనాలు, అదనపు అంతస్తులు దాదాపు 4500 వరకు ఉన్నట్లు అధికారులు అనధికారిక లెక్కల్లో తేల్చారు. ఇక ఇంటింట పరిశీలన చేస్తే ఆ సంఖ్య 10 వేలకు మించిపోనుంది. ఇలా అక్రమ కట్టడాలు అడ్డుపెట్టుకున్న సంపాదించిన సొమ్ముతో ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు విలాసవంతమైన లగ్జరీ కార్లలో తిరుగుతూ ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదు. మరోవైపు తమ నాయకులకు ఫ్లెక్సీల ఏర్పాటు, ఎన్నికల్లో ఆర్థిక సాయం వంటి వాటికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

జీఎస్‌ రాజు రోడ్డు వెంబడిలో అదే పరిస్థితి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని