logo

ఎన్నికల విధుల నుంచి మినహాయించండి

దివ్యాంగులు, శస్త్రచికిత్సలు చేయించుకున్నవారు, ఉద్యోగ విరమణకు దగ్గరగా ఉన్నవారైనా సరే తప్పనిసరిగా ఎన్నికల విధులు నిర్వహించాలని అధికారులు ఒత్తిడి చేస్తుండడంతో ఏంచేయాలో పాలుపోని స్థితిలో వారు కొట్టుమిట్టాడుతున్నారు.

Published : 13 Apr 2024 04:21 IST

కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న దివ్యాంగ ఉద్యోగులు
న్యూస్‌టుడే, గుడివాడ(నెహ్రూచౌక్‌)

కలెక్టరేట్‌లో ఉపాధ్యాయినుల నిరీక్షణ

దివ్యాంగులు, శస్త్రచికిత్సలు చేయించుకున్నవారు, ఉద్యోగ విరమణకు దగ్గరగా ఉన్నవారైనా సరే తప్పనిసరిగా ఎన్నికల విధులు నిర్వహించాలని అధికారులు ఒత్తిడి చేస్తుండడంతో ఏంచేయాలో పాలుపోని స్థితిలో వారు కొట్టుమిట్టాడుతున్నారు. తమ వల్ల కాదని దివ్యాంగులు, దీర్ఘకాలిక రోగులు మొర పెట్టుకుంటున్నా అధికారులు కనికరించడం లేదు. కలెక్టరుకు విన్నవించుకోవాలని ఉచిత సలహాలిస్తుండడంతో చేసేది లేక కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

పట్టించుకునే వారే కరవు

సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు పీఓ, ఏపీఓ, ఓపీఓ హోదాల్లో అధికారులు డ్యూటీలు వేశారు. అందులో భాగంగా ఈ సారి సిబ్బంది కొరత ఉందని.. దివ్యాంగులు, శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి, దీర్ఘకాలిక రోగులకు, ఉద్యోగ విరమణకు దగ్గర్లో ఉన్నవారికి, చివరకు వైద్య సెలవులో ఉన్నవారిని కూడా నియమించారు. గుడివాడలో గీతామహలక్ష్మి, గౌసియాబేగం అనే ఉపాధ్యాయినులు వంద శాతం దివ్యాంగులు. చక్రాల కుర్చీలో పాఠశాలకు వెళ్లేవారు. వారిని కూడా ఎన్నికల విధులకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేయడంతో మానవతా దృక్పథంలో తమను తప్పించాలని వారు వేడుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మా చేతిలో ఏమీ లేదని.. కలెక్టరుకు విన్నవించుకోవాలని చెప్పడంతో నిస్సహాయస్థితిలో అద్దె కారు మాట్లాడుకొని కలెక్టరేట్‌కు వెళ్లినా పట్టించుకున్న పరిస్థితి లేదు.  మోకాలుకు శస్త్రచికిత్స చేయించుకొని ఇబ్బందులు పడుతున్నానని మోటూరు గురుకుల పాఠశాలలో పనిచేసే ఒక ఉపాధ్యాయిని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. మరికొందరు వైద్య సెలవులో ఉన్నప్పటికీ వీఆర్వోలను ఇళ్లకు పంపించి మరీ ఉత్తర్వులు అందజేస్తున్నారు.

ఎన్నికల కమిషనర్‌ ఉత్తర్వులు అమలు చేయాలి

ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి కొన్ని మినహాయింపులిస్తూ కేంద్ర ప్రభుత్వం 2023లో వివరణాత్మక ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు అమలు చేయాలని, దీంతోపాటు డివిజినల్‌ స్థాయిలో ఫిర్యాదులు స్వీకరించేందుకు ఒక నమోదు కేంద్రం కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం(ఎస్‌టీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి డి.చంద్రశేఖర్‌ కోరారు. గత ఎన్నికల్లో ఇబ్బందులున్నవారిని మినహాయించారు. గతంలో ఆర్టీవో కార్యాలయంలోనే ఈ ఏర్పాటు ఉండేదని.. ఇప్పుడు మచిలిపట్నం వెళ్లాలని చెప్పడం సరికాదని డెమొక్రటిక్‌ పీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి మత్తి వెంకటేశ్వరరావు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని