logo

జగన్‌ పాలనలో పప్పన్నమూ కరవే

సంక్షేమ పాలన సాగిస్తున్నామంటూ ప్రగల్భాలు పలుకుతున్న జగన్‌ ప్రభుత్వం పేద వర్గాలకు పప్పనం కూడా తినలేని పరిస్థితి కల్పిస్తోంది.

Published : 13 Apr 2024 04:23 IST

రెండేళ్లుగా 11,100 టన్నుల కందిపప్పుకు ఎగవేత
రూ.150 కోట్లకు పైగా పక్కదారి
కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే

సంక్షేమ పాలన సాగిస్తున్నామంటూ ప్రగల్భాలు పలుకుతున్న జగన్‌ ప్రభుత్వం పేద వర్గాలకు పప్పనం కూడా తినలేని పరిస్థితి కల్పిస్తోంది. తెదేపా పాలనలో పేదవర్గాలకు ఇతర నిత్యావసరాలు లేకుండా కేవలం బియ్యం మాత్రమే ఇచ్చి సరిపెడుతున్నారంటూ నిప్పులు చెరిగిన జగన్‌ తన అయిదేళ్ల పాలనలో పేద వర్గాలకు పస్తులు ఉండే పరిస్థితులు సృష్టించారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన రూ.2ల బియ్యాన్ని ఇవ్వకుండా ఎగగొట్టడమే కాకుండా పేదలకు కందిపప్పు సైతం దక్కకుండా చేసి తానేదో పేదల పక్షపాతిని అంటూ ప్రవచనాలు పలకడం గమనార్హం.

జగన్‌ ప్రభుత్వం అధికారం చేపట్టిననాటి నుంచి సబ్సిడీ ధరకు చౌకడిపోల ద్వారా పేదలకు అందించాల్సిన నిత్యావసరాలను ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ వస్తోంది. చివరకు కేంద్రం ఉచితంగా ఇచ్చే బియ్యంతో పాటు అరకొరగా ఇచ్చే అరకేజీ పంచదార మినహా పామాయిల్‌, గోధుమపిండి, కారం, తదితర నిత్యావసరాలు ఏనాటి నుంచో నిలిచిపోయాయి. గత ప్రభుత్వ హయాంలో వివిధ వర్గాలకు పండుగ సందర్భాల్లో ఉచితంగా అందజేసే సంక్రాతి కానుక, రంజాన్‌ తోఫా, క్రిస్మస్‌Ã కానుకలు ఇవ్వడం మానేశారు. ఇచ్చే నిత్యావసరాల్లో పేదలకు కాస్తోకూస్తో పోషకాహారంగా ఉండే కందిపప్పును సైతం విడుదల చేయడం లేదు. కనీసం పండగల సందర్భంగా కూడా ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు.

అన్నింటా కోతలే

తెదేపా ప్రభుత్వ హయాంలో కిలో రూ.40 చొప్పున ప్రతి కార్డుదారుడికి రెండు కిలోల కందిపప్పు ఇచ్చేవారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక కార్డుకు కిలో కందిపప్పే పరిమితం చేయడంతో పాటు ధరను రూ.67కు పెంచారు. కరోనా సమయం నుంచి కార్డుదారులకు కేంద్ర ఉచితంగా ఇస్తున్న బియ్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పరంగా కిలో రూపాయి చొప్పన ఒక్కో మనిషికి 5 కిలోల చొప్పున బియ్యం ఇచ్చేవారు. దాదాపుగా రెండు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇవ్వాల్సిన బియ్యానికి తిలోదకాలిచ్చేశారు. ఉచిత బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు ఇస్తున్నా పంచదార ఏనెలలో దక్కుతుందో లేదో తెలియని పరిస్థితి ఉండగా, ఏడాదిన్నరగా కందిపప్పు ఇవ్వకుండా చేతులెత్తేస్తున్నారు. ప్రతి నెలా కార్డుదారుల అవసరాలకు అనుగుణంగా పౌరసరఫరాల శాఖ కందిపప్పు కేటాయింపులు చేస్తున్నా.. ప్రొక్యూర్‌మెంట్‌ చేయలేని కారణంగా కార్డుదారులకు ఎగనామం పెడుతున్నా ప్రభుత్వంలో మాత్ర కనీస చలనం లేదు.

నిధులు దారి మళ్లించి..

జిల్లాలో పేదలకు ఇవ్వాల్సిన కందిపప్పును ఎగగొట్టడం ద్వారా ప్రభుత్వం రూ.150 కోట్ల మేర దారి మళ్లించింది. జిల్లాల విభజన అనంతరం కృష్ణాలో 5.26 లక్షల తెల్లరేషన్‌కార్డులున్నాయి. వీరికి ప్రతి నెలా కిలో చొప్పున 526 మెట్రిక్‌.టన్నుల కందిపప్పు అవసరం. 2022 ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకూ లెక్క ప్రకారం రమారమి 13,150 మెట్రిక్‌ టన్నుల కందిపప్పు పంపిణీ చేయాల్సి ఉండగా ఇచ్చింది కేవలం 2,400 మెట్రిక్‌ టన్నులు మాత్రమే. అంటే 25 నెలల వ్యవధిలో పేదలకు అందించాల్సిన 11,100 టన్నుల కందిపప్పుకు గండికొట్టి మార్కెట్‌ ధర ప్రకారం రూ.150 కోట్లకు పైగా నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టించింది.

కార్డుదారులపై నెలకు రూ.2.80 కోట్ల అదనపు భారం

గతంలో ఎలా ఉన్నా కరోనా సమయం నుంచి ఆరోగ్య స్పృహ పెరగడం, కూరగాయలు, ఇతర నిత్యావసరాల ధరలు రోజుకో రకంగా పెరగడం వంటి పరిస్థితుల నేపథ్యంలో 70 శాతం మంది కార్డుదారులు కందిపప్పు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. పేదవర్గాల అవసరాన్ని ఏమాత్రం పట్టించుకోని ప్రభుత్వం కందిపప్పును బయట కొనుగోలు చేయడం ద్వారా నెలకు సగటున రూ.2.80 కోట్ల అదనపు భారం భరించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని