logo

నడిచొచ్చి నీతులు.. గద్దెనెక్కి గోతులు..!

‘నేను విన్నాను.. నేను ఉన్నాను’... ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అంటూ ప్రతిపక్ష హోదాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గొప్పలు చెప్పారు. ఒక్క ఏడాది ఓపిక పట్టండి.. మీ బిడ్డ వస్తున్నాడు.. రైతు సంక్షేమ రాజ్యం వస్తుందంటూ ఊదరగొట్టారు.

Published : 15 Apr 2024 04:33 IST

అమలు కాని సీఎం జగన్‌ హామీలు
ఈనాడు, అమరావతి న్యూస్‌టుడే, కలెక్టరేట్‌ (మచిలీపట్నం), గుడివాడ రూరల్‌, అవనిగడ్డ, హనుమాన్‌ జంక్షన్‌

‘నేను విన్నాను.. నేను ఉన్నాను’... ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అంటూ ప్రతిపక్ష హోదాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గొప్పలు చెప్పారు. ఒక్క ఏడాది ఓపిక పట్టండి.. మీ బిడ్డ వస్తున్నాడు.. రైతు సంక్షేమ రాజ్యం వస్తుందంటూ ఊదరగొట్టారు. ప్రజలు నమ్మి ఓట్లు వేసి గెలిపించారు. గద్దెనెక్కి అయిదేళ్లు కావస్తోంది. పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరక పోగా.. సీఎం హోదాలో మరెన్నో అమలు కాని వాగ్దానాలు చేశారు. అవన్నీ బుట్టదాఖలయ్యాయి. ‘అన్నా.. మీరిచ్చిన హామీ గుర్తుందా... అని తెలియజేసేందుకు తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్లిన బాధితులకు సీఎం దర్శన భాగ్యం లభించలేదు. కనీసం గేటు లోపలికి కూడా వెళ్లలేకపోయారు. ఆయన ప్యాలెస్‌ వదిలి వస్తారని నిరీక్షించిన వారికి నిరాశే ఎదురైంది. నాడు నేనున్నానంటూ తలనిమిరిన చేతులు.. నేడు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ఐదేళ్లలో పన్నుల మీద పన్నులు వేస్తూ నడ్డి విరుస్తున్నారు. నెత్తి మీద చెయ్యి పెట్టి పాతాళానికి అణచివేస్తున్నారు. 2018లో పాదయాత్ర కృష్ణా జిల్లా గన్నవరంలో ప్రారంభమై బందరు వరకు సాగింది. నేడు మళ్లీ అదే గన్నవరంలో ప్రారంభమై గుడివాడ వరకు బస్సు యాత్ర సాగనుంది. నాడు దారిలో ఇచ్చిన హామీలు మరోసారి గుర్తు తెచ్చుకుంటున్నారు జిల్లా ప్రజలు.


అభివృద్ధికి నిధుల్లేవ్‌... కళాశాలలో వసతుల్లేవ్‌

హామీ: మచిలీపట్నం అభివృద్ధికి నిధుల మంజూరు

ప్రస్తుతపరిస్థితి

మచిలీపట్నం నగరాభివృద్ధికి ఒక్క రూపాయి విదల్చలేదు. నగరం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. వైద్య కళాశాల ప్రారంభించినా వసతులు కల్పించలేదు. హామీలు నెరవేరలేదు. క్యాంటీన్‌ ఏర్పాటు చేయలేదు. తాగునీరు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. గుత్తేదారు చెప్పిన ప్రకారం ఈ ఏడాది డిసెంబర్‌కు మొత్తం పనులు పూర్తి కావాలి. ఎంతవరకు చేస్తారో వేచి చూడాలి.


రూపాయి రాలేదు.. రూపు మారలేదు

హామీ : గన్నవరం బ్రహ్మయ్యలింగం చెరువు జలాశయంగా తీర్చిదిద్దుతాం

ప్రస్తుత పరిస్థితి

బ్రహ్మయ్యలింగం చెరువులో నీరు-చెట్టు పనులు చేస్తున్నారు. నాడు పాదయాత్రగా వచ్చిన జగన్‌ చెరువు మట్టి మొత్తం స్థానిక ఎమ్మెల్యే వంశీ తినేస్తున్నారని, చంద్రబాబు, కలెక్టర్లకు వాటాలు అందుతున్నాయని గగ్గోలు పెట్టారు. అదే ఎమ్మెల్యే ఇప్పుడు జగన్‌ పక్కన ఉన్నారు. తాను సీఎం అయిన వెంటనే చెరువును జలాశయంగా మారుస్తా.. అన్నారు. అయిదేళ్లు గడిచాయి. మట్టి మింగిన వారిని గుర్తించలేదు. చర్యలు లేవు. చెరువుకు రూపాయి కేటాయించలేదు. దాని కింద ఉన్న గొలుసుకట్టు చెరువుల సంగతే మర్చిపోయారు. నాడు నడిచి వచ్చారు. ఇప్పుడు ఏసీ బుల్లెట్‌ఫ్రూఫ్‌ బస్సులో వస్తున్న జగనన్న ముఠాకు చెరువు గుర్తుందా అని గన్నవరం ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒక సారి చెరువు పరిస్థితి చూడాలని కోరుతున్నారు. ఒక్కసారి బస్‌ దిగి గన్నవరం పరిసరాల్లోని అటవీ భూములు, పోలవరం కట్టలను గమనించండి... మీ నేతలు మింగిన మట్టి గుంతలు కనిపిస్తాయని ప్రజలు సూచిస్తున్నారు.


అవనిగడ్డలో మాటలు... నీటి మూటలు

ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి 2022 అక్టోబర్‌ 20న అవనిగడ్డ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఎన్నో వరాలు ప్రకటించారు. స్థానిక ప్రజలు సీఎం మాటలు విని.. సమస్యలు పరిష్కారమవుతాయని సంతోషించారు. తరువాత తెలిసింది అవన్నీ నీటి మూటలని..


అంచనాలు తగ్గించి... చేస్తున్నాం అనిపించి...

హామీ: అవనిగడ్డ-కోడూరు రహదారి నిర్మిస్తాం

ప్రస్తుత పరిస్థితి

అవనిగడ్డ నుంచి కోడూరు వరకు రహదారి అభివృద్ధికి రూ.35 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఇటీవల రూ.16.8 కోట్లకు అంచనాలు తగ్గించి పనులు ప్రారంభించారు. ప్రస్తుత రోడ్డును పొక్లెయిన్‌తో తవ్వి, వాటరింగ్‌ చేసి, రోలింగ్‌ చేస్తున్నారు. కొత్తగా రోడ్డు నిర్మాణానికి మెటీరియల్‌ ఇప్పటివరకు తోలలేదు. రోడ్డు వెడల్పు పెంచి, గ్రామాల వద్ద అప్రోచ్‌ రోడ్డుల నిర్మాణం, 5 కి.మీ. కాలువ సైడు రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం కొత్త అంచనాల్లో నుంచి తొలగించారు. ఈ రోడ్డు అవనిగడ్డ, కోడూరు మండలాలకు చెందిన సుమారు 30 వేల మందికి ఎంతో ఉపయోగం.


గుడివాడలోనూ గొప్పలు

సీఎం హోదాలో గుడివాడ వచ్చిన జగన్‌ ప్రజలకు చాలా హామీలు ఇచ్చారు. వాటిని అమలు చేయలేదు.


ఒకరి ఘనత కొట్టేసి... వాగ్దానం మడతెట్టేసి..

హామీ: రూపాయి చెల్లిస్తే చాలు.. టిడ్కో ఇళ్లు రిజిస్ట్రేషన్‌ చేస్తాం

ప్రస్తుత పరిస్థితి

గుడివాడలో సీఎం మాటలు కోటలు దాటాయి. తెదేపా ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను నాలుగేళ్లు పడుకోబెట్టారు. రంగులు వేసి పేదలకు అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఆ ఘనత తనదేనని చాటుకున్నారు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఒక్క రూపాయితోనే ఇళ్లు రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తామని వాగ్దానం చేశారు. పదవిలోకి వచ్చిన తరువాత తిలోదకాలు ఇచ్చారు. కేవలం 300 గజాల వారికి మాత్రం లబ్ధిదారుని వాటాగా రూపాయి తీసుకుంటున్నారు. మిగిలిన రుణం మామూలే.


ఆరడుగుల స్థలం.. అందనంత దూరం

హామీ: శ్మశానవాటిక కోసం భూమి కొనుగోలు

ప్రస్తుత పరిస్థితి

గుడివాడలో దళితుల శ్మశాన వాటిక కోసం స్థలం కొనుగోలుకు నిధులు మంజూరు చేస్తానని ఇటీవల టిడ్కో కాలనీలో జరిగిన బహిరంగ సభలో సీఎం మాట ఇచ్చారు. ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. మృతులకు అంత్యక్రియలు చేయడానికి ఆరడుగుల స్థలం వారికి కరవైంది. స్థలం సమస్య అలాగే మిగిలిపోయింది.


70 గ్రామాలను వీడని జలఘోష

హామీ: నందివాడలో 70 గ్రామాలకు తాగు నీటి వసతి కల్పిస్తాం

ప్రస్తుత పరిస్థితి

పైలట్‌ వాటర్‌ స్కీమ్‌ త్వరలోనే ప్రారంభిస్తాం. నిధులు కూడా త్వరలోనే విడుదల చేస్తా. తాగునీటి సమస్య పరిష్కరిస్తానని చెప్పారు. ఇంతవరకు అతీగతీ లేదు.


డప్పు కొట్టారు.. డబ్బు ఇవ్వలే...

హామీ: కృష్ణా కరకట్టల బలోపేతానికి

ప్రస్తుత పరిస్థితి

రూ.25 కోట్ల మంజూరు ఇప్పటి వరకు నిధులు మంజూరు చేయలేదు. ఎటువంటి పనులు జరగలేదు. ఇది పూర్తయితే అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాలకు చెందిన సుమారు 15 వేల మందికి ఉపయోగం. కృష్ణా నది వరదల నుంచి రక్షణ లభిస్తుంది. స్థానికులు ఎంతో కాలంగా వేచి చూస్తున్నా... జగన్‌ ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు.


వారధి.. సమాధి

హామీ: కృష్ణా నదిపై వంతెన నిర్మాణం

ప్రస్తుత పరిస్థితి

అవనిగడ్డ మండలం పాత ఎడ్లంక వాసుల కోసం కృష్ణా నది పాయపై రూ.8.5 కోట్లతో వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇది పూర్తయితే 800 మందికి ప్రయోజనం కలుగుతుంది.


హామీ: సీసీ డ్రెయిన్‌ నిర్మాణం చేపడతాం

అవనిగడ్డలో సీసీ డ్రెయిన్‌ నిర్మాణానికి రూ.15 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు అంచనాలు రూపొందించలేదు. దీంతో 10 వేల మందికి తీవ్ర నిరాశే మిగిలింది.


హామీ: సముద్ర కరకట్ట అభివృద్ధి చేస్తాం

ఎటువంటి పురోగతి లేదు. నాగాయలంక, కోడూరు తీర ప్రాంత ప్రజలకు ఉప్పెన, సునామీల నుంచి రక్షణ లేక వణుకుతున్నారు.


హామీ: డంపింగ్‌ యార్డు ఏర్పాటుకు నిధులు

కొత్తగా స్థలం తీసుకుని డంపింగ్‌ యార్డు ఏర్పాటు చేస్తామన్నారు. రూ.8 కోట్లు ఇస్తామని చెప్పి రూపాయిచ్చిన పాపాన పోలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు