logo

AP News: నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్‌ వ్యాపారం

మద్యంపై ఆదాయం అంటే.. ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేయడమే. మహిళల కంట నీరు పెట్టించే.. ఆదాయంతో ఎవరికీ మేలు జరగదు సరికదా... సమాజానికి నష్టం.

Updated : 20 Apr 2024 07:50 IST

ఏటా రూ.2,880 కోట్లు మద్యం విక్రయం
తెలంగాణ నుంచి వచ్చే సరకు అదనం
ప్రజారోగ్యానికి పాతరేసి వికృతానందం

మద్యంపై ఆదాయం అంటే.. ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేయడమే. మహిళల కంట నీరు పెట్టించే.. ఆదాయంతో ఎవరికీ మేలు జరగదు సరికదా... సమాజానికి నష్టం. కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలూ ధ్వంసం అవుతున్నాయి. నేను అధికారంలోకి రాగానే 3 దశల్లో నిషేధం అమలు చేస్తా.

ప్రతిపక్ష నేతగా ఊరూరా జగన్‌ డప్పు


మాట తప్పారు.. మడమ తిప్పారు

ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు పెట్టి ప్రజలను బానిసలుగా మార్చారు. మద్యం చుక్క గొంతులో పడనిదే పలువురు లేవలేని దీనస్థితికి చేర్చారు. గత మద్యం బ్రాండ్లకు తిలోదకాలు ఇచ్చి నాసిరక మద్యం సరఫరా చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. రూ.వేల కోట్లు దోచేస్తున్నారు. ధరలు పెంచింది మద్య నియంత్రణకే అని.. నిస్సిగ్గుగా చెబుతున్నారు.

 బానిసలుగా మారిన వారికి డీఅడిక్ట్‌ కేంద్రాలు పెట్టనేలేదు. మద్యం అలవాటు మాన్పించే చికిత్సలు చేయడం లేదు. ఒకవైపు సంక్షేమం పేరుతో అరకొర విదిల్చి మద్యం పేరుతో దానికి పది రెట్లు లాగుతోంది. మద్యానికి బానిస అయిన వ్యక్తి నెలకు వైద్యానికి రూ.వేలల్లోనే ఖర్చు చేస్తున్నాడు. పర్యవసానంగా వివిధ రకాల వ్యాధులు వస్తున్నాయి. బటన్‌ నొక్కి ఇచ్చే డబ్బు కంటే మద్యం, వైద్యం పేరుతో సామాన్యుల జేబుల్లో నుంచి తీసుకునేదే అధికంగా ఉంటోంది.

ఉమ్మడి జిల్లాలో గొలుసు దుకాణాలదే హవా. పేరుకే ప్రభుత్వ మద్యం దుకాణాలు. గతంలో మాదిరి కాకుండా దుకాణాలను ఆబ్కారీనే నిర్వహిస్తోంది. వీటి ప్రారంభ వేళ ఉపాధ్యాయులకు విధులు కేటాయించి వారితోనే విక్రయించారు. ఇప్పుడు ఎక్సైజ్‌, పొరుగు సేవల సిబ్బందిని నియమించారు. దుకాణాల వద్ద సీసీ కెమెరాలు, డిజిటల్‌ పేమెంట్‌లు లేవు. ప్రభుత్వ దుకాణాల నుంచి వైకాపా నాయకులు భారీగా మద్యం తీసుకెళ్లి పక్కనే గొలుసు దుకాణాలు పెట్టి అదనంగా బాదేస్తూ దోచేస్తున్నారు. ప్రభుత్వ దుకాణంలో ఆ రకం మద్యం లేదంటారు. మొత్తంగా గొలుసు దుకాణాలకు సరఫరా చేసి పరోక్షంగా వారికి ఆబ్కారీ సహకరిస్తోంది. వైకాపా నాయకులు పలువురు రెక్టిఫైడ్‌ స్పిరిట్‌కు రంగు కలిపి మద్యంలా అమ్మేస్తున్నారు.

అవాక్కవ్వాల్సిందే..

ఎన్టీఆర్‌ జిల్లాలో గత ఏడాది ఒక్క నెలలో 93,665 కేసుల మద్యం, 38,112 కేసుల బీర్లు విక్రయించగా.. అదే నెల ఈ ఏడాది 58,145 కేసుల మద్యం, 26,676 కేసుల బీర్లు విక్రయించారు.

కృష్ణా జిల్లాలో 2023లో 44,958 కేసుల మద్యం విక్రయించగా 2024లో 44,077 బాక్సుల మద్యం అమ్మారు. బీర్లు 2023లో 12,083 కేసులు, ఈ ఏడాది 8,321 కేసులు విక్రయించారు. ఎన్నికల ఏడాది కావడంతో కావాలనే తగ్గించామని ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నారు. ఇదంతా ప్రజల కష్టార్జితం. ఇవి కాక ప్రైవేటు వ్యాపారుల చేతుల్లో బార్లు ఉన్నాయి. వీటిలోనూ రూ.వందల కోట్ల వ్యాపారం సాగుతోంది. ఒక్క విజయవాడలోనే 135 బార్లు, పది వాకింగ్‌ స్టోర్సు ఉన్నాయి.

పక్క రాష్ట్రం నుంచి...

మద్యం ఎక్కువగా తెలంగాణ నుంచి దిగుమతి అవుతోంది. ఇక్కడి మద్యంపై తాగుబోతులకు సైతం నమ్మకం లేదు. ఒకే రకం మద్యం అయినా తెలంగాణ సరకు కొనేందుకు ఇష్టపడుతున్నారని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌ జిల్లా తెలంగాణ సరిహద్దున ఉండడంతో రకరకాలుగా దిగుమతి అవుతోంది. ద్విచక్ర వాహనాలు, ట్రాలీలలో ప్రత్యేక అరలు పెట్టి పోలీసుల కళ్లుగప్పి తెచ్చి గొలుసు దుకాణాల్లో విక్రయిస్తున్నారు. కొన్నే వెలుగుచూస్తున్నాయి. రూ.కోట్ల విలువైన మద్యం తెలంగాణ నుంచి తిరువూరు, నందిగామ, మైలవరం, జగ్గయ్యపేట సరిహద్దులకు తెచ్చి రవాణా చేస్తున్నారు.

మీకు తెలుసా?

  •  ఒక ఏడాది మద్యం విక్రయాల సొమ్ముతో ఒక బ్యారేజీ కట్టవచ్చు.
  •  అయిదేళ్ల ఆదాయంతో ఒక బందరు పోర్టు, పారిశ్రామిక కారిడార్‌ పూర్తి చేయవచ్చు.  

పిల్లల భవిత ప్రశ్నార్థకం..?

గుడివాడ పట్టణంలోని పెద్ద వీధికి చెందిన ఒక టీవీ మెకానిక్‌ (38) ఊరూ పేరూ లేని మద్యం తాగి కాలేయ సంబంధిత వ్యాధికి గురై మరణించాడు. దీంతో ఇంటర్‌, పదో తరగతి చదివే అతని కుమార్తెల భవిత ప్రశ్నార్థకంగా మారింది.

 కృష్ణలంక కరకట్టవాసి రామయ్య భవన నిర్మాణ మేస్త్రీ. రోజుకు రూ.1200 వస్తుంది. కానీ మద్యానికి బానిసయ్యాడు. ఒక రోజు పనికి వెళితే నాలుగు రోజులు వెళ్లరు. వచ్చిన ఆ సొమ్ముతో నిత్యం తాగి జోగుతుంటారు. కుటుంబం ఆర్థికంగా చితికింది,. ఆరోగ్యం దెబ్బతినడంతో మెరుగైన చికిత్సకూ వీలులేక వాళ్లందరూ వీధిన పడే పరిస్థితి వచ్చింది.

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే


మందు లేకపోతే అన్నీ పగలకొట్టేసేవాడు

మా అన్నకు మద్యం అలవాటు ఉంది. పగలు.. రాత్రి అనే తేడా లేకుండా తాగేవాడు. అది తాగితేనే స్థిరంగా ఉండేవాడు. ఏ రోజైనా మద్యం దొరక్కపోతే కోపం వచ్చేసేది. అన్నీ పగలకొట్టేసేవాడు. ఇలా రెండేళ్ల పాటు ఉన్నాడు. ఒక రోజు అకస్మాత్తుగా అస్వస్థతకు గురై చనిపోయాడు.

 వెంకట్రామయ్య, వాంబేకాలనీ


మద్యం.. నా భర్తను చంపేసింది:  ఓ మహిళ, న్యూ ఆర్‌ఆర్‌ పేట

నా భర్త మద్యానికి బానిసయ్యాడు. ఇంటికి సరిగా వచ్చేవాడు కాదు. రోజులు తరబడి రోడ్డు మీదే ఉండేవాడు. ఒక రోజు అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులు ఫోన్‌ చేశారు. నా భర్త అజిత్‌సింగ్‌నగర్‌లోని బార్‌ వద్ద చనిపోయి ఉన్నాడని సమాచారం ఇచ్చారు. మద్యమే నా భర్త ప్రాణాలు తీసింది. నా ఇద్దరు బిడ్డలకు తండ్రి లేకుండా చేసింది. ఇప్పుడు నేను కూలి పని చేసుకుని పిల్లలను చదివించుకుంటున్నాను.

 మధురానగర్‌, న్యూస్‌టుడే

ఉమ్మడి జిల్లాలో మద్యం విక్రయాలు (రూ.కోట్లలో)

  • రోజుకు 8
  • నెలకు 240
  • సంవత్సరానికి 2,880
  • 58 నెలల్లో 13,920
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని