logo

జగన్‌ షాకులు.. జనం కేకలు!

విద్యుత్తు సర్దుబాటు ఛార్జీల రూపంలో జగన్‌ వేసిన దొంగ దెబ్బకు ప్రజలు అల్లాడిపోతున్నారు. పేరుకు ఛార్జీలు పెంచలేదంటూనే.. దొడ్డిదారిన వడ్డిస్తున్న ట్రూఅప్‌ బాదుడు మామూలుగా లేదు.

Updated : 24 Apr 2024 06:55 IST

సామాన్యులకు భారంగా మారిన ట్రూఅప్‌ ఛార్జీలు
ఒకే బిల్లులో మూడు సర్దుబాటు ఛార్జీల వడ్డన
ఐదేళ్లలో ప్రజలపై రూ. వందల కోట్లలో భారం
ఈనాడు, అమరావతి

విద్యుత్తు సర్దుబాటు ఛార్జీల రూపంలో జగన్‌ వేసిన దొంగ దెబ్బకు ప్రజలు అల్లాడిపోతున్నారు. పేరుకు ఛార్జీలు పెంచలేదంటూనే.. దొడ్డిదారిన వడ్డిస్తున్న ట్రూఅప్‌ బాదుడు మామూలుగా లేదు. అన్ని వర్గాల ప్రజలూ జగన్‌ బాధితులే. అటు పేదల నుంచి ఎగువ తరగతి వరకు అందరినీ దారుణంగా వంచించారు ముఖ్యమంత్రి. బిల్లుల భారం దెబ్బకు స్విచ్‌ వేయాలంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి నెలకొంది. అసలే భారీగా వస్తున్న విద్యుత్తు బిల్లులు.. ఎడాపెడా విధిస్తున్న సర్దుబాటు ఛార్జీలు మరింత భారంగా మారుతున్నాయి. ఒకేసారి మూడు సర్దుబాటు ఛార్జీలను మోపుతుండడంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు.

మ్మడి జిల్లాలో ప్రజలపై ఈ ఛార్జీల భారం సుమారు రూ. 700 కోట్ల మేర పడుతోంది. భారీగా వస్తున్న కరెంటు బిల్లులు చెల్లించలేక విలవిల్లాడుతున్నారు. పెరుగుతున్న ధరలకు తోడు, ఈ బిల్లులు మరింత కుంగదీస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. విద్యుత్తు ఛార్జీలు పెంచడం లేదని ప్రభుత్వం చెబుతున్నా.. సర్దుబాటు భారం వినియోగదారుల నడ్డి విరుస్తోంది. డిస్కమ్‌కు నష్టాలు వచ్చాయని ఇప్పుడు వసూలు చేస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

2014-15 నుంచి 2018-19 మధ్య విద్యుత్తు వ్యాపారంలో పంపిణీ సంస్థకు నష్టాలు వచ్చాయని ట్రూఅప్‌ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఆ కాలంలో వాడిన యూనిట్‌కు 22 పైసలు చొప్పున లెక్కగట్టి బిల్లులో విధిస్తున్నారు. 2022 ఆగస్టు నుంచి విధిస్తున్నారు. మొత్తం 36 నెలలు విధించే ఈ ఛార్జీల్లో ఇప్పటి వరకు 22 నెలలకు వేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వినియోగదారులపై ఈ భారం రూ.270 కోట్లు విధించారు. దీనికి అదనంగా.. 2021-22 ఆర్థిక సంవత్సర నష్టాల పేరుతో ఎఫ్‌పీపీసీఏ 1 (ఇంధన, విద్యుత్తు సర్దుబాటు ఛార్జీలు)ను మరో రూ.వంద కోట్ల భారం మోపారు. దీనిని 2021-22లో ఏ నెలలో వాడిన యూనిట్లను 2023-24లో అదే నెలలో విద్యుత్తు బిల్లులో సర్దుబాటు చేస్తున్నారు. యూనిట్‌కు 20 పైసలు నుంచి గరిష్ఠంగా 66 పైసల వరకు భారం విధించారు. మొదటి త్రైమాసికంలో యూనిట్‌కు రూ.0.20, రెండో త్రైమాసికంలో యూనిట్‌ రూ.0.63, మూడో త్రైమాసికంలో రూ.0.63, చివరి త్రైమాసికంలో ప్రతి యూనిట్‌పై రూ.0.66 చొప్పున లెక్కించి విధిస్తున్నారు. 2023-24లో ఏప్రిల్‌ నుంచి సంబంధిత నెలలో వాడిన విద్యుత్తుపై తర్వాత నెలలో వచ్చే బిల్లులో లెక్కించి ఎఫ్‌పీపీసీఏ 2 పేరుతో యూనిట్‌కు 40 పైసలు చొప్పున సర్దుబాటు చేస్తున్నారు. ఈ భారం రూ.330 కోట్ల మేర పడింది. మొత్తం కలిపి మూడు రకాల భారాలతో  ప్రజలపై రూ.700 కోట్ల మేర సర్దుబాటు ఛార్జీల పేరిట వడ్డించారు. భారం మొత్తం బిల్లులో 10 శాతం పైగానే ఉంటోంది.

వాడింది ఒకరు.. కట్టాల్సింది మరొకరు: సర్దుబాటు భారం కేవలం ఇప్పుడున్న వినియోగదారులకే కాదు.. పాత వారికీ వర్తింపజేసింది. ఫలితంగా గతంలో విద్యుత్తు కనెక్షన్‌.. ఆ తర్వాత తొలగించిన వారూ బాధితులుగా మారుతున్నారు. ఆ డోర్‌ నంబర్‌లో ఇప్పుడు ఉన్న వారికి ట్రూఅప్‌ ఛార్జీలను విధిస్తున్నారు. అప్పుడు విద్యుత్తు వాడిన వినియోగదారుడు లేకపోయినా.. అదే ప్రాంగణం అనే కారణంతో అసలు సంబంధమే లేని వారిపైనా విధించడంపై తీవ్ర విమర్శలున్నాయి. కట్టకపోతే కనెక్షన్‌ తొలగిస్తామని విద్యుత్తు సిబ్బంది బెదిరిస్తున్నారు.


భారీగా పెరిగింది

-అబ్దుల్‌ వాహెద్‌,  పెడన

గతంలో ఇంటి సర్వీసుకు రూ.1500లు మించి కట్టలేదు. ప్రస్తుత ప్రభుత్వంలో రూ2600ల వరకు బిల్లులొస్తున్నాయి. కరెంటుకే ఇంత అయితే మిగిలిన ఖర్చులు ఎలా.


రూ. వేలల్లో వస్తోంది

- కాగిత రాంబాబు, అర్తమూరు

గతంలో రూ  200 నుంచి రూ 300 వచ్చే బిల్లు నేడు వెయ్యి రూపాయలు దాటింది. ఇంత మొత్తం ఎలా చెల్లించాలో తెలియడం లేదు.

న్యూస్‌టుడే, పెడన, బంటుమిల్లి


అదనపు వడ్డింపు  

- వెనిగెళ్ల ఫణి, బాపులపాడు

జగనన్న కాలనీలో ఇల్లు కట్టుకుని ఏడాది కూడా పూర్తి కాలేదు. మొదట్లో కనెక్షన్లు ఇవ్వకుండానే బిల్లులు జారీ చేసిన అధికారులు, గత కొన్ని నెలలుగా ఎఫ్‌పీపీసీఏ ఛార్జీల పేరుతో ప్రతి నెలా రూ.50 వసూలు చేస్తున్నారు.

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని