logo

కన్నెత్తి చూశావా జగన్‌?

కరవు జిల్లా అనంతపై కనికరం లేదు. కర్షకుల కన్నీరు కనిపించదు. మాటలు కోటలు దాటుతాయ్‌.. అభివృద్ధి పనులు చేయడానికి చేతులాడవ్‌.. నీటి మీద రాత రాసే నైపుణ్యం.. ఇచ్చిన హామీ మడతపెట్టేయడం.. పైగా అందరికీ అన్నీ చేశానంటూ ఏ వేదిక ఎక్కినా ఊదరగొట్టడం జగన్‌ నైజం.

Updated : 30 Mar 2024 05:13 IST

ఐదేళ్లలో ఒక అడుగు పని చేస్తే ఒట్టు  
హెచ్చెల్సీ ఆధునికీకరణను గాలికి వదిలేసి.. ఓట్ల కోసం యాత్రనా?

కరవు జిల్లా అనంతపై కనికరం లేదు. కర్షకుల కన్నీరు కనిపించదు. మాటలు కోటలు దాటుతాయ్‌.. అభివృద్ధి పనులు చేయడానికి చేతులాడవ్‌.. నీటి మీద రాత రాసే నైపుణ్యం.. ఇచ్చిన హామీ మడతపెట్టేయడం.. పైగా అందరికీ అన్నీ చేశానంటూ ఏ వేదిక ఎక్కినా ఊదరగొట్టడం జగన్‌ నైజం. రూ.వందల కోట్లు మంజూరు చేస్తానని ఒక్క రూపాయి ఇవ్వని సీఎం.. ఐదేళ్లలో హెచ్చెల్సీ ఆధునికీకరణకు తట్ట మట్టి కూడా పోయించిన పాపాన పోలేదు. కాలువల రూపు కోల్పోయి.. దారుణంగా మారి ఆయకట్టుకు సక్రమంగా సాగునీరు అందని అనంత దయనీయ దుస్థితి. 

ఈనాడు డిజిటల్‌, అనంతపురం-న్యూస్‌టుడే, కణేకల్లు, బొమ్మనహాళ్‌, ఉరవకొండ

హెచ్చెల్సీని బాగు చేస్తావని నమ్మితే మరింత బుగ్గి చేశావు. సమాంతర కాలువ నిర్మిస్తానని.. ఉన్న వాటికి గండ్లు పడేలా చేశావు. ఉమ్మడి అనంత జిల్లా పర్యటనల సందర్భంగా పలుసార్లు హామీలు గుప్పించావు. ఐదేళ్లలో కనీసం కన్నెత్తి ఇటువైపు చూశావా? ఇప్పుడు మళ్లీ ఓట్ల కోసం వస్తున్నావు. అద్దాల బస్సులో నుంచి కిందకి దిగి అధ్వానంగా మారిన కాలువను ఒక్కసారి చూడు. హామీలు నమ్మి బలైన మా బతుకులు అందులో కనిపిస్తాయి. ఒక్క అవకాశం అన్నావు.. నమ్మాం, మోసపోయాం.. ఇంకోసారి నమ్మేందుకు సిద్ధంగా లేం.

హెచ్చెల్సీ ఆయకట్టు రైతులు

ఉమ్మడి అనంతపురం జిల్లాలో 1.45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) ఆధునికీకరణపై సీఎం జగన్‌ ఇచ్చిన హామీలు నీటి మీద రాతలుగా మారాయి. ప్రతిపక్ష నేతగా, సీఎం అయ్యాక పలుమార్లు అనంత జిల్లా పర్యటనకు వచ్చారు. ప్రధాన కాలువను పటిష్ఠ పరిచి సామర్థ్యాన్ని పెంచుతామంటూ హామీలు గుప్పించి రైతుల ఓట్లు కొల్లగొట్టిన పెద్దమనిషి కనీసం తాత్కాలిక మరమ్మతులకూ నిధులు ఇవ్వలేదు. రూ.600 కోట్లు ఖర్చు చేయాల్సిన ఉండగా.. ఐదేళ్లలో ఐదు రూపాయాలూ మంజూరు చేయలేదు. పలు చోట్ల కాలువలు ధ్వంసమై తీవ్రస్థాయిలో నీటి నష్టం జరుగుతున్నా అరికట్టేందుకు కనీస ప్రయత్నం చేయలేదు. పూర్తి సామర్థ్యంతో కర్ణాటక నుంచి నీరు తీసుకుంటే కాలువ తెగిపోతుందనే భయంతో ప్రవాహాన్ని తగ్గించుకునే స్థాయికి దిగజారారు. దీంతో చివరి ఆయకట్టు రైతులు నీరు అందక నష్టపోతున్నారు.

పనులు రద్దు చేసి..

హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులకు 2008లో శ్రీకారం చుట్టారు.రూ.458 కోట్లతో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడే నాటికి రూ.309 కోట్లు ఖర్చు చేసి 67 శాతం పనులు పూర్తి చేశారు. అయితే కొన్ని ప్యాకేజీల్లో 25 శాతం కంటే తక్కువ పనులు జరిగాయని వాటిని జగన్‌ సర్కార్‌ రద్దు చేసింది. ఇప్పటివరకు మళ్లీ టెండర్లు పిలిచింది లేదు.. ఆలస్యం కావడంతో అంచనాలు పెరిగిపోయాయి. మిగిలిన పనులకు రూ.600 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపినా ఇప్పటికీ మోక్షం లభించలేదు.

రూ.36 కోట్లూ లేవా?

రెండేళ్ల కిందట తాత్కాలిక మరమ్మతులకు రూ.36 కోట్లు అవసరమని అధికారులు పంపిన ప్రతిపాదనలను జగన్‌ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో కాలువకు తరచూ గండ్లు పడి నీరు వృథాగా పోతున్నాయి.Åకాలువ గట్లు దెబ్బతిన్నాయి. ప్రధాన కాలువపై నాలుగు వంతెనలు కూలిపోయాయి. కొన్నిచోట్ల రైతులే ముందుకు వచ్చి సొంత డబ్బులతో తాత్కాలిక మరమ్మతు చేయించుకున్నా.. వైకాపా సర్కారులో ఏమాత్రం చలనం లేదు.

  • హెచ్చెల్సీ ప్రధాన కాలువ: 84 కిలోమీటర్లు
  • ఆయకట్టు: 1.45 లక్షల ఎకరాలు
  • 2019 వరకు జరిగిన పనులు: 67 శాతం
  • చేసిన ఖర్చు: రూ.309 కోట్లు
  • జగన్‌ ప్రభుత్వంలో పరిస్థితి: అధికారంలోకి రాగానే పనుల రద్దు. ఇప్పటివరకు ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు