logo

ఎన్నికల విధుల మినహాయింపుపై కలెక్టర్‌ ఆరా

జిల్లా జలవనరుల శాఖలో చోటు చేసుకున్న సార్వత్రిక ఎన్నికల విధుల మినహాయింపు భాగోతంపై కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆరా తీశారు. ఏ సమస్య లేకపోయినా 20 మందికిపైగా ఎన్నికల విధుల నుంచి మినహాయించినట్లు తేలింది.

Published : 13 Apr 2024 05:12 IST

అనంతపురం(శ్రీనివాస్‌నగర్‌), న్యూస్‌టుడే: జిల్లా జలవనరుల శాఖలో చోటు చేసుకున్న సార్వత్రిక ఎన్నికల విధుల మినహాయింపు భాగోతంపై కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆరా తీశారు. ఏ సమస్య లేకపోయినా 20 మందికిపైగా ఎన్నికల విధుల నుంచి మినహాయించినట్లు తేలింది. ఈ తతంగంపై ఈ నెల 11న ‘ఎన్నికల విధులపై రాజకీయం... జలవనరుల శాఖలో చేతివాటం’ అన్న కథనాన్ని ‘ఈనాడు’ కథనానికి కలెక్టర్‌ స్పందించి విచారణ చేయిస్తున్నారు. శుక్రవారం జలవనరులశాఖ పరిధిలోని ఎంఐ, హెచ్చెల్సీ, హంద్రీనీవా ప్రాజెక్టుల అధికారులను కార్యాలయానికి పిలిపించారు. ఒక రోజు ముందే ప్రొఫార్మా పెట్టినట్లు తెలిసింది. మీ ప్రాజెక్టు పరిధిలో మంజూరీ పోస్టులు ఎన్ని? ఇపుడు ఎంతమంది పని చేస్తున్నారు. ఎన్నికల విధులకు ఎంత మందిని సిఫార్సు చేశారు. ఎవరెవరికి మినహాయింపు ఇచ్చారు.. వంటి వివరాలను ఆగమేఘాలపై తీసుకున్నారు. ఈ వివరాలను కలెక్టర్‌ కార్యాలయ ఎన్‌ఐసీలో సరిపోల్చారు. హంద్రీనీవా నుంచి వెళ్లిన జాబితాలోనే మాయాజాలం నెలకున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని కలెక్టర్‌ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సమగ్ర వివరాలతో మళ్లీ జాబితాను తీసుకుని రావాలని ఆదేశించినట్లు చర్చ నడుస్తోంది. ఈ బాగోతం వెనుక వ్యవహరం నడిపిన ఇద్దరు అధికారులపై వేటు పడే అవకాశం ఉంది.

క్వాలిటీ ఇంజినీర్లా... మజాకా

జిల్లా జలవనరుల శాఖ అనుబంధంగా క్వాలిటీ కంట్రోల్‌ డివిజన్‌ ఉంది. ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా ఈ డివిజన్‌ అనంతలోనే ఉంది. ఈ డివిజన్‌లో పని చేస్తున్న ఇంజినీర్లు, ఉద్యోగులు కొందరు అతి తెలివి ఉపయోగించి అనంత, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఎన్నికల విధుల నుంచి తప్పించుకున్నారు. క్వాలిటీ కంట్రోల్‌ విభాగంలో తగిన పని లేక.. ముదిగుబ్బ మండలం జిల్లెడు బండ ప్రాజెక్టులో పని చేసేందుకు తాత్కాలికంగా నియమించారు. ఇదే అదనుగా భావించిన కొందరు ఇంజినర్లు, ఉద్యోగులు రెండు జిల్లాల్లోనూ ఎన్నికల విధుల నుంచి తప్పించుకున్నారు. దీనిపైనా కూడా కలెక్టర్‌ ఆరా తీస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని