logo

రాష్ట్రాన్ని మద్యం మాఫియాగా మార్చేశారు: సునీత

దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి ఆ మద్యాన్నే ఆదాయ వనరుగా మార్చుకున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు.

Published : 13 Apr 2024 05:32 IST

తెదేపాలో చేరిన వారితో పరిటాల సునీత, శ్రీరామ్‌

అనంతపురం(కళ్యాణదుర్గంరోడ్డు), ఆత్మకూరు, న్యూస్‌టుడే: దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి ఆ మద్యాన్నే ఆదాయ వనరుగా మార్చుకున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతూ మద్యంతోనే లక్ష కోట్లు దోపిడీ చేశారని ఆరోపించారు. శుక్రవారం అనంతపురం క్యాంపు కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రాత్రి..సింగంపల్లి, సింగంపల్లి తండా, వై.కొత్తపల్లి గ్రామాల్లో ప్రచారం చేపట్టారు.  మద్యపానం నిషేధిస్తామని చెబితే మహిళంతా నమ్మి జగన్‌కు ఓట్లు వేశారని, అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యానికే తాళిబొట్లు తాకట్టు పెట్టాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. 2021లో నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వేలోనూ ఆంధ్రప్రదేశ్‌లో 31.4 శాతం మంది మద్యం తాగుతున్నట్లు తేలిందన్నారు. ఐదేళ్లలో మద్యం తాగుతున్న వారి సంఖ్య రెండింతలు పెరిగిపోయిందన్నారు. మద్యం మాఫియా ద్వారా జే బ్రాండ్‌ గ్యాంగ్‌ రూ.లక్షల కోట్లను అప్పనంగా కొట్టేశారని, బ్లాక్‌ మార్కెట్‌ అమ్మకాల మీద వచ్చే సొమ్మంతా తాడేపల్లి ప్యాలెస్‌కు తరలిపోయిందని ఆరోపించారు. 

భారీగా తెదేపాలోకి వలసలు

రాప్తాడు నియోజకవర్గంలో వైకాపా రాక్షస శకం ముగిసిందని, ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి దుకాణం సర్దుకునే సమయం ఆసన్నమైందని సునీత విమర్శించారు. అనంతపురం క్యాంపు కార్యాలయంలో రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి పంచాయతీ, ఇందిరమ్మ కాలనీ, కళాకారుల కాలనీల నుంచి 35 కుటుంబాలు, ఆత్మకూరు నుంచి 8 కుటుంబాలు, అనంతపురం గ్రామీణం పాపంపేట నుంచి 8 కుటుంబాలు తెదేపాలోకి చేరారు. పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌ వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నామినేషన్ల లోపు రాప్తాడులో వైకాపా అంతా ఖాళీ కావడం ఖాయమన్నారు. ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని