logo

విషతుల్య ఆహారం తిని 150 మందికి అస్వస్థత

శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం కుర్లపల్లి బుడ్డారెడ్డిమిద్దెలు వద్ద శుక్రవారం శ్రీసీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అన్నదానం చేశారు.

Updated : 13 Apr 2024 06:25 IST

కనగానపల్లి మండలం కుర్లపల్లిలో ఘటన

అస్వస్థతకు గురై ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు

కనగానపల్లి, ధర్మవరం, న్యూస్‌టుడే : శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం కుర్లపల్లి బుడ్డారెడ్డిమిద్దెలు వద్ద శుక్రవారం శ్రీసీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అన్నదానం చేశారు. 400 మంది భోజనం తినగా అందులో 150 మందికి ఫుడ్‌ పాయిజన్‌ (ఆహారం విషతుల్యం) అయి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, కళ్లు తిరగడం, విరేచనాలు కావడంతో నీరసించిపోయారు. అస్వస్థతకు గురైన వారిలో అధికంగా మహిళలు, చిన్నారులు ఉన్నారు. అంబులెన్స్‌, 108, ప్రైవేటు వాహనాల్లో కుర్లపల్లి నుంచి అస్వస్థతకు గురైన వారిని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పట్టణంలోని రెండు ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ చేర్పించారు. అస్వస్థతకు గురైన వారు అధిక సంఖ్యలో రావడంతో ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో మంచాలు నిండిపోయాయి. పలువురు చిన్నారులు అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. వైద్యులు వారిని పరీక్షించి చికిత్సలు అందించారు. పాయసం, పులిహోరా తిన్న వారే ఎక్కువ మంది అస్వస్థతకు గురైనట్లు గ్రామస్థులు తెలిపారు. బాధితులతో ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేటు ఆసుపత్రులు నిండిపోయాయి. కుర్లపల్లి, బుడ్డారెడ్డి మిద్దెలు ప్రాంతానికి చెందిన వారే అనారోగ్యం పాలైన వారిలో ఉన్నారు. 108 వాహనాలు సరిపడా లేకపోవడంతో ప్రైవేటు వాహనాలు, ద్విచక్ర వాహనాల్లోనూ ఆసుపత్రులకు బాధితులను తీసుకొచ్చారు. ధర్మవరం నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌ ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ధర్మవరం డీఎస్పీ టి.శ్రీనివాసులు ఆసుపత్రికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. బాధితుల్లో కొందరికి సీరియస్‌గా ఉండటంతో వారిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల కుటుంబ సభ్యులు భారీగా తరలివచ్చారు. ఆహారం విషతుల్యం (ఫుడ్‌ పాయిజనింగ్‌) ఎలా జరిగిందనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు.

మంచాల కొరతతో బెంచీపైనే పడుకున్న చిన్నారి, బంధువులు

108లో కిక్కిరిసి బాధితులను ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారిలా..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని