logo

దారి చూపని వైకాపా.. దాతృత్వం చూపిన ఆర్డీటీ

వైకాపా ప్రభుత్వం వచ్చాక రోడ్ల పరిస్థితి అతి దారుణంగా మారింది. కనీసం మరమ్మతులకు నోచుకోని రహదారులెన్నో.. ఏ రోడ్డుపైనా తట్టెడు మట్టి వేసిన మరమ్మతు చేసి దాఖలాలు లేవు. వంతెనల పరిస్థితి అయితే మరీ అధ్వానం.

Published : 13 Apr 2024 05:36 IST

ధర్మవరం మండలం పోతుల నాగేపల్లి- కనంపల్లి గ్రామాల మధ్య
చిత్రావతి నదిపై గ్రామస్థులు నిర్మించుకున్న తాత్కాలిక వంతెన (పాత చిత్రం)

వైకాపా ప్రభుత్వం వచ్చాక రోడ్ల పరిస్థితి అతి దారుణంగా మారింది. కనీసం మరమ్మతులకు నోచుకోని రహదారులెన్నో.. ఏ రోడ్డుపైనా తట్టెడు మట్టి వేసిన మరమ్మతు చేసి దాఖలాలు లేవు. వంతెనల పరిస్థితి అయితే మరీ అధ్వానం. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరానికి దగ్గరగా.. పోతుల నాగేపల్లి- కనంపల్లి గ్రామాల మధ్య చిత్రావతిపై కట్టిన వంతెన, రోడ్డు నిర్మాణం.. ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతగానితనానికి మచ్చుతునకగా మిగిలింది. చిత్రావతి నది వరదల కారణంగా ఈ గ్రామాల మధ్య ఉన్న తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. ఇరుగ్రామాల్లో 3 వేల మందికిపైగా జనాభా ఉంటారు. రాకపోకలు ఆగి ప్రజలకు ఇబ్బందులు తీవ్రమయ్యాయి. తెదేపా ప్రభుత్వ హయాంలో రహదారి, వంతెన నిర్మాణంపై టెండర్ల దశ వరకు వచ్చి ఆగిపోయాయి. వైకాపా ప్రభుత్వం వచ్చాక.. ఇక కన్నెత్తి చూసింది లేదు. 2022లో గ్రామాల మధ్య వరదలకు వంతెన మరింత దెబ్బతిని కాలినడకకూ వీలుకాని విధంగా మారింది. ప్రయాణం సాగించలేక ఇరుగ్రామాల ప్రజలు నాయకులను ఎన్నోసార్లు వేడుకొన్నారు. ఎవరూ పట్టించుకోలేదు. ఇక లాభం లేదనుకొని ఇరు గ్రామస్థులు చందాలు వేసుకుని సిమెంటు పైపులు వేసి దానిపై మట్టి కప్పి రహదారి ఏర్పాటు చేసుకున్నారు. వీరి ఇబ్బందిని చూసి రూ.కోటి మొత్తంతో చెక్‌డ్యాం, వంతెన నిర్మాణానికి ఆర్డీటీ సంస్థ ముందుకొచ్చి పూర్తి చేసింది. ఓట్లు అడగడానికి ముందుంటారు.. పనులు చేయడానికి ఉండరా? అంటూ స్థానికులు నాయకులను ప్రశ్నిస్తున్నారు.

ఆర్డీటీ నిర్మించిన చెక్‌డ్యాం వంతెన

ఈనాడు, అనంతపురం, న్యూస్‌టుడే, ధర్మవరం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని