logo

ఉన్నత విద్యను గాలికొదిలేసిన జగన్‌

ఉన్నత విద్యను విస్మరించిన జగన్‌.. మాటలు మాత్రం కోటలు దాటిపోతాయి.. చేతలు గడప దాటవు. కనీస సౌకర్యాలు కరవు... అధ్యాపకుల కొరత తదితర సమస్యలతో ప్రభుత్వ కళాశాలలు కొట్టుమిట్టాడుతున్నాయి.

Updated : 13 Apr 2024 06:26 IST

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఉత్తీర్ణత సగటు 40 శాతమే..

తాడిపత్రి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల

అనంతపురం విద్య, కొత్తచెరువు న్యూస్‌టుడే: ఉన్నత విద్యను విస్మరించిన జగన్‌.. మాటలు మాత్రం కోటలు దాటిపోతాయి.. చేతలు గడప దాటవు. కనీస సౌకర్యాలు కరవు... అధ్యాపకుల కొరత తదితర సమస్యలతో ప్రభుత్వ కళాశాలలు కొట్టుమిట్టాడుతున్నాయి. శుక్రవారం విడుదలైన ఇంటర్‌ పరీక్ష ఫలితాలే ఇందుకు నిదర్శనం. ఉమ్మడి అనంత జిల్లాలో 43 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలున్నాయి. అనంత జిల్లాలో 22 కళాశాలలుండగా సగటున 40 శాతం కూడా ఉత్తీర్ణత సాధించలేకపోయారు. కేవలం 38.26 శాతమే నమోదైంది. ప్రథమ సంవత్సరానికి సంబంధించి తాడిపత్రి జూనియర్‌ కళాశాల 18.56 శాతం.. ద్వితీయ సంవత్సరంలో బెళుగుప్ప 33.33 శాతంతో అనంత జిల్లాలో అట్టడుగున నిలిచాయి. నల్లమాడ ప్రభుత్వ కళాశాల ప్రథమ సవంత్సరంలో 10.96 శాతం, ద్వితీయ సంవత్సరంలో ముదిగుబ్బ 37.50 శాతం ఉత్తీర్ణతతో శ్రీసత్యసాయి జిల్లాలో ఆఖరి స్థానంలో ఉన్నాయి.

ఉచిత పుస్తకాలు అటకెక్కించి..

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇంటర్‌ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. వైకాపా ప్రభుత్వం ఉచిత పుస్తకాలను అటకెక్కించింది. కొన్ని కళాశాలల్లో విద్యార్థులకు ఇచ్చిన పుస్తకాలను వెనక్కుతీసుకొని మళ్లీ కొత్తగా చేరిన విద్యార్థులకు ఇవ్వడానికి ప్రయత్నించారు. అవి కూడా సకాలంలో ఇవ్వలేదు.

అధ్యాపకుల కొరత

జూనియర్‌ కళాశాలల్లో తగిన సంఖ్యలో అధ్యాపకులు లేరు. వైకాపా ప్రభుత్వం ఒక్కసారి కూడా పోస్టులు భర్తీ చేసిన పాపాన పోలేదు. ఒప్పంద, అతిథి అధ్యాపకులతో బోధన చేయిస్తున్నారు. నాణ్యమైన బోధన లేకపోడంతో విద్యార్థులు ఎక్కువ మంది అనుత్తీర్ణులవుతున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అనంత జిల్లాలో 257 పోస్టులకు గాను 113 మంది మాత్రమే రెగ్యులర్‌ అధ్యాపకులు పనిచేస్తున్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో 267 పోస్టులకు గాను 52 మంది రెగ్యులర్‌ అధ్యాపకులు ఉన్నారు.

మధ్యాహ్న భోజనం ఎత్తేశారు..

తెదేపా హయాంలో విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్న భోజనం అందించింది. వైకాపా సర్కారు వచ్చాక భోజనం పెట్టలేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు మధ్యాహ్నం వరకు మాత్రమే కళాశాలల్లో ఉంటున్నారు. తరువాత ఊర్లకు వెళ్లిపోతున్నారు. తరగతులకు సక్రమంగా హాజరుకాలేని పరిస్థితి. ఇంటి నుంచి భోజనం తెచ్చుకోలేక.. ప్రభుత్వం అందించకపోవడంతో  విద్యార్థుల హాజరుశాతం, ఉత్తీర్ణతపై ప్రభావం చూపుతోంది. కళాశాలల అభివృద్ధికి నిధులు సైతం సక్రమంగా ఇవ్వడంలేదు. సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో కళాశాలల్లో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి.   

బాలికలదే పైచేయి

ఉమ్మడి అనంత జిల్లాలో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత శాతంలో బాలికలు సత్తా చాటారు. అనంత జిల్లాలో మొదటి సంవత్సరం విద్యార్థులు 23,687 మంది పరీక్షలకు హాజరయ్యారు. అందులో బాలురు 6,163, బాలికలు 8042 మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 16,725 మంది పరీక్ష రాశారు. బాలురు 5,586 మంది, బాలికలు 7,5431 మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణతలో రాష్ట్రంలో అనంతకు 10వ స్థానం, ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 16వ స్థానంలో నిలిచింది. శ్రీసత్యసాయి జిల్లాలో మొదటి సంవత్సరం విద్యార్థులు 9878 మంది పరీక్ష రాయగా 5,769 మంది ఉత్తీర్ణులయ్యారు. అందులో బాలికలు 3775 మంది, బాలురు 2668 మంది ఉన్నారు. ద్వితీయ సంవత్సరంలో 7,447 మంది పరీక్ష రాయగా 5653 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 3770 మంది, బాలురు 2505 మంది ఉన్నారు.  ప్రథమ సంవత్సరానికి సంబంధించి శ్రీసత్యసాయి జిల్లా 20వ స్థానంలో, ద్వితీయ సంవత్సరం 13వ స్థానంలో నిలిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని