logo

రాయితీ కుదించి.. రైతన్నపై బండరాయి

‘ఆత్మకూరుకు చెందిన రైతు తెదేపా ప్రభుత్వంలో రూ.20 వేలు చెల్లించి రూ.2 లక్షలు విలువైన డ్రిప్‌ పరికాలు పొందారు. ఐదేళ్లలో రెండుసార్లు 90 శాతం రాయితీతో పరికరాలు పొందారు. అదే రైతు వైకాపా ప్రభుత్వంలో మూడేళ్లపాటు సొంత డబ్బుతో డ్రిప్‌ సామగ్రి కొనుగోలు చేశారు.

Updated : 13 Apr 2024 06:03 IST

జగన్‌ పాలనలో బరువెక్కిన బిందు సేద్యం
మూడేళ్లపాటు డ్రిప్‌ పథకాన్ని పట్టించుకోని వైకాపా
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మొండిచేయి
ఈనాడు డిజిటల్‌, అనంతపురం

‘ఆత్మకూరుకు చెందిన రైతు తెదేపా ప్రభుత్వంలో రూ.20 వేలు చెల్లించి రూ.2 లక్షలు విలువైన డ్రిప్‌ పరికాలు పొందారు. ఐదేళ్లలో రెండుసార్లు 90 శాతం రాయితీతో పరికరాలు పొందారు. అదే రైతు వైకాపా ప్రభుత్వంలో మూడేళ్లపాటు సొంత డబ్బుతో డ్రిప్‌ సామగ్రి కొనుగోలు చేశారు. పథకాన్ని పునరుద్ధరిస్తామని జగన్‌ చెప్పడంతో దరఖాస్తు చేయడానికి వెళ్లారు. రాయితీలుపోను జీఎస్టీతో కలిపి మొత్తం రూ.80 వేలు కట్టమని అధికారులు చెప్పడంతో వెనక్కి వచ్చేశారు. దీన్నిబట్టి రైతు పక్షపాత ప్రభుత్వమేదో అర్థమవుతోంది.’

మీ చేయకపోయినా.. అన్నీ చేసినట్లు చెప్పుకోవడం జగన్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఏడాదికి రెండుసార్లు బటన్‌ నొక్కి రూ.7,500 జమ చేయడమే రైతు సంక్షేమం అని చెప్పుకోవడం తప్ప.. ఐదేళ్ల పాలనలో వారి కోసం చేసిందేమీ లేదు. గతంలో తెదేపా అమలు చేసిన బిందు (డ్రిప్‌) సేద్యం పథకాన్ని రద్దు చేసి కరవు ప్రాంతమైన అనంతపురం రైతులకు తీవ్ర అన్యాయం చేశారు. పథకాన్ని మూడేళ్లపాటు పక్కన పెట్టేయడంతో ఉద్యాన రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం నుంచి సాయం లేకపోవడంతో ప్రైవేట్‌గా పరికరాలు కొనుగోలు చేయాల్సి వచ్చింది. దీంతో ఒక్కో రైతుపై రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు భారం పడింది. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో 2022-23 సంవత్సరం నుంచి రైతుల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. అయితే రాయితీలను పూర్తిగా తగ్గించేశారు.  దరఖాస్తు చేసినవారు పరికరాల కోసం నెలల కొద్దీ వేచి చూడాల్సి వస్తోంది. గతంలో మాదిరి కంపెనీని ఎన్నుకునే స్వేచ్ఛ రైతులకు లేకుండా చేశారు.


ప్రభుత్వ ప్రోత్సాహం శూన్యం

కర్బూజా సాగుకు సొంతంగా ఏర్పాటు చేసుకున్న మల్చింగ్‌ కవర్లు

కదిరి: తనకల్లు మండలం పడమటివారిపల్లికి చెందిన సుధాకర్‌యాదవ్‌ కర్బూజా, టమాటా, తదితర పంటలు సాగుచేస్తున్నారు. కొంత దుక్కిచేసి సాగుకు సిద్ధం చేశారు. వర్షాభావ పరిస్థితులు, వైరస్‌ తెగుళ్ల ఉద్ధృతి నేపథ్యంలో బిందు పరికరాలు, మల్చింగ్‌ కవరు అవసరమయ్యాయి. ప్రభుత్వ ప్రోత్సాహం లేదని రైతు చెబుతున్నారు. బిందు పరికరాలు కొనుగోలు చేయాలంటే హెక్టారుకు రూ.1.60 లక్షలు, మల్చింగ్‌ కవర్లకైతే రూ.30 వేలకు పైగా భరించాల్సి వస్తోందని వాపోతున్నారు.


సొంత ఖర్చుతో ఏర్పాటు

హెచ్‌డీ.హళ్లిలో డ్రిప్‌ పరికరాలతో సాగు చేసిన వక్క తోట

అగళి: ప్రభుత్వం నాలుగేళ్లుగా డ్రిప్‌ సౌకర్యం కల్పించకపోవడంతో మండలంలోని ఇరిగేపల్లికి చెందని కామరాజు సొంత నిధులు రూ.80 వేలు ఖర్చు చేసి పరికరాలు కొనుగోలు చేసి మూడు ఎకరాల్లో డ్రిప్‌ ఏర్పాటు చేసుకున్నారు. తెదేపా హయాంలో రైతులకు డ్రిప్‌ సౌకర్యాలతో పాటు వర్షాభావంతో ఎండిపోతున్న వేరుసెనగ పంటలకు రెయిన్‌గన్‌, పైపులు, ఆయిల్‌ ఇంజిన్‌ సౌకర్యం కల్పించి అన్నదాతలను ఆదుకున్నారని, ఈ ప్రభుత్వంలో రైతులకు అందాల్సిన నష్టపరిహారంతో పాటు బీమా సౌకర్యం, బిందు, తుంపర సేద్యం పరికరాలు అందించడం లేదని వాపోయారు.


సామూహిక బిందు సేద్యానికి మంగళం

తక్కువ నీటితో ఎక్కువ ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో అప్పటి తెదేపా ప్రభుత్వం సామూహిక బిందు సేద్యం పథకానికి శ్రీకారం చుట్టింది. రూ.842 కోట్ల అంచనాతో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని ఉరవకొండలో మొదలు పెట్టి ప్రధాన పైపులైనుతోపాటు కొన్ని గ్రామాల్లో 80 శాతం పనులు పూర్తి చేశారు. అయితే అధికారంలోకి రాగానే జగన్‌ ఆ ప్రాజెక్టుకు మంగళం పాడేశారు. రూ.కోట్లు విలువ చేసే సామగ్రిని ఐదేళ్లుగా గాలికొదిలేశారు. ఈ సామగ్రితో కనీసం 25 వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్నా పట్టించుకోలేదు. ఆమిద్యాల వద్ద సామగ్రి ఐదేళ్లుగా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ తుప్పు పడుతోంది.


రూ.1.20 లక్షలతో పరికరాల కొనుగోలు

గోరంట్ల: గోరంట్ల పంచాయతీలోని గుమ్మయ్యగారిపల్లికి చెదిన హరికుమార్‌ 2014లో తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే బిందు సేద్య పరికరాల కోసం దరఖాస్తు చేశారు. మూడెకరాలకు కావాల్సిన సామగ్రి కోసం కేవలం రూ.8 వేలు చెల్లించారు. వారంలోనే 90 శాతం రాయితీతో సామగ్రి అందించారు. నీటి ఆదాతో అయిదేళ్లపాటు బాగా పంటలు పండించుకున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక పరికరాల కోసం దరఖాస్తు చేస్తే పట్టించుకోలేదు. రెండేళ్లపాటు నిరీక్షించి చివరకు రూ.1.20 లక్షల సొంతడబ్బుతో బిందు పరికరాలు కొనుగోలు చేశారు.


రెండేళ్లకు డీడీ నగదు వెనక్కి..

తాడిమర్రి: మండల కేంద్రానికి చెందిన తలారి వెంకటేశ్‌ వైకాపా ప్రభుత్వ ప్రారంభంలో మూడు ఎకరాలకు బిందుసేద్య పరికరాలకు రూ.40,000 డీడీ కట్టారు. బిందు సేద్య పరికరాల మంజూరులో ప్రభుత్వం ఆలస్యం చేస్తోందంటూ కంపెనీ ప్రతినిధులు డీడీ నగదును రెండేళ్లకు వెనక్కి ఇచ్చేశారు. నీళ్లులేకపోతే చీనీచెట్లు ఎండిపోతాయని రూ.70 వేలు చెల్లించి సొంతంగా బిందుసేద్య పరికరాలు కొనుగోలు చేశారు. గత ఏడాది డ్రిప్పు ఇస్తున్నారంటే మళ్లీ డీడీ కట్టి పరికరాలు తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని