logo

టిప్పరు, ద్విచక్ర వాహనం ఢీ

ద్విచక్ర వాహనం, టిప్పరు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని నల్లబోయనపల్లి జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది.

Published : 20 May 2024 04:37 IST

యువకుడి దుర్మరణం.. మరొకరికి తీవ్ర గాయాలు

అశోక్‌రెడ్డి

బత్తలపల్లి, న్యూస్‌టుడే : ద్విచక్ర వాహనం, టిప్పరు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని నల్లబోయనపల్లి జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. చెన్నేకొత్తపల్లి మండలం ప్యాదిండి గ్రామానికి చెందిన హనుమంతరెడ్డి కుమారుడు అశోక్‌రెడ్డి, బత్తలపల్లి మండలం అప్రాచెరువుకు చెందిన విష్ణు చెన్నైలో బీటెక్‌ పూర్తి చేసుకుని ఆదివారం ఉదయం ద్విచక్ర వాహనంపై బయలుదేరారు.మధ్యాహ్నం ముదిగుబ్బ మండలం రాళ్లఅనంతపురంలోని అశోక్‌రెడ్డి అక్క ఇంటికి చేరుకొని అక్కడ భోజనం చేసి తిరిగి బయలుదేరారు. మార్గమధ్యంలోని నల్లబోయనపల్లి వద్దకు రాగానే నాలుగు వరుసల రహదారి పనులు జరుగుతున్నాయి. దీంతో ఒకే మార్గంలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ముందు వెళ్తున్న ఐచర్‌ వాహనాన్ని అధికమించి వెళ్లే (ఓవర్‌టెక్‌) క్రమంలో వారి ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వేగంగా వస్తున్న టిప్పరు ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహన చోదకుడు అశోక్‌రెడ్డి (22) అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుకవైపు కూర్చున్న స్నేహితుడు విష్ణు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే బత్తలపల్లి ఆర్‌డీటీ ఆసుపత్రికి తరలించారు. అశోక్‌రెడ్డి తండ్రి హనుమంతరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.  పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. 


రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి

కనగానపల్లి, న్యూస్‌టుడే: కనగానపల్లి మండలం పాలబావి మిట్ట సమీపం వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వృద్ధుడు మృతి చెందగా ముగ్గురు గాయపడినట్లు ఎస్సై మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు. కనగానపల్లి మండల కేంద్రానికి చెందిన కృష్ణయ్య (61) ఉదయం ద్విచక్ర వాహనంలో ధర్మవరానికి వెళ్లాడు. పని ముగించుకొని తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో పాలబావి మిట్ట సమీపానికి రాగానే అదే రహదారి వెంబడి ఒకే ద్విచక్ర వాహనంపై ముగ్గురు కలిసి వేగంగా వస్తూ.. వాహన వేగాన్ని అదుపు చేయలేక ఎదురుగా  కృష్ణయ్య ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో కృష్ణయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతపురం పట్టణం 5వ రోడ్డుకు చెందిన నారాయణస్వామి, లోకేశ్, సోనూ తీవ్రంగా గాయపడటంతో వైద్యం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని