logo

సిట్‌ దర్యాప్తుపై తొలగని ఉత్కంఠ

తాడిపత్రిలో ఎన్నికల అనంతరం జరిగిన గొడవలపై సిట్‌ అధికారుల బృందం చేపట్టిన విచారణ ఆదివారం రెండో రోజూ కొనసాగింది. అత్యంత గోప్యంగా విచారణ సాగింది. మీడియా ప్రతినిధులకు అనుమతి ఇవ్వలేదు.

Published : 20 May 2024 04:52 IST

వినతి పత్రం ఇచ్చేందుకు గ్రామీణ ఠాణాకు చేరుకొన్న తెదేపా జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడుయాదవ్, నాయకులు  

తాడిపత్రి, న్యూస్‌టుడే: తాడిపత్రిలో ఎన్నికల అనంతరం జరిగిన గొడవలపై సిట్‌ అధికారుల బృందం చేపట్టిన విచారణ ఆదివారం రెండో రోజూ కొనసాగింది. అత్యంత గోప్యంగా విచారణ సాగింది. మీడియా ప్రతినిధులకు అనుమతి ఇవ్వలేదు. మూడు రోజులపాటు జరిగిన అల్లర్లలో రాళ్లదాడులను అరికట్టేందుకు, భౌతిక దాడులు తదితర వాటిపై ముందుస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదన్న దానిపై విచారణ చేపట్టారు. బృందం సభ్యులు అల్లర్లకు సంబంధించి బాధితులను, ఆయా పార్టీ నాయకులను ఏమైనా విచారిస్తారా లేక కేవలం అధికారుల అభిప్రాయాలు తీసుకొని వెళ్తారా అని పలువురు చర్చించుకుంటున్నారు. రాళ్ల దాడిలో ప్రమేయం ఉన్న  వైకాపాకు చెందిన నాయకులు, కార్యకర్తలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారిని అదుపులోకి తీసుకునే విషయంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. జేసీ ఇంట్లోకి డీఎస్పీ చైతన్య చొరబడి అమాయకులను చావబాది కొందర్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలపై విచారణ చేస్తున్న సిట్‌ బృందం బాధితులతో సమగ్రంగా విచారణ చేస్తారా లేక నామమాత్రంగా విచారించి వెళ్తారా అనే దానిపై సర్వత్రా చర్చ సాగుతోంది. 

తాడిపత్రి ఘటనపై న్యాయం చేయండి

తాడిపత్రి: ఎన్నికల పోలింగ్‌ రోజు, తరువాత జరిగిన హింసాత్మక ఘటనలపై న్యాయం చేయాలని తెదేపా నాయకులు పేర్కొన్నారు. ఆదివారం తాడిపత్రి గ్రామీణ పోలీస్‌స్టేషన్‌లో సిట్‌ అధికారులకు తెదేపా జిల్లా నాయకులు వినతి పత్రం అందజేశారు. రాళ్లదాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు వస్తే కేసులు పెట్టి జైలుకు పంపిస్తారని భయపడి  తెదేపా నాయకులు రాలేదన్నారు. తాడిపత్రిలో జరిగిన హింసాత్మక ఘటనలపై న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెదేపా జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్, నాయకులు ఆదెన్న, తిరుపతినాయుడు తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని