logo

కౌంటింగ్‌కు మూడంచెల భద్రత

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట చర్యలు చేపడతామని జిల్లా నూతన ఎస్పీ గౌతమిశాలి పేర్కొన్నారు. ఆమె ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయం ఎస్పీ ఛాంబర్లో పదవీ బాధ్యతలు స్వీకరించారు.

Published : 20 May 2024 04:55 IST

బాధ్యతలు చేపట్టిన నూతన ఎస్పీ గౌతమి శాలి 

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట చర్యలు చేపడతామని జిల్లా నూతన ఎస్పీ గౌతమిశాలి పేర్కొన్నారు. ఆమె ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయం ఎస్పీ ఛాంబర్లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ.. కాన్ఫరెన్స్‌ హాలులో మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ప్రశాంతత లోపించకుండా శాంతి భద్రతలను పరిరక్షించడానికి కార్యాచరణ ప్రణాళికలతో ముందుకెళ్తామన్నారు. అన్ని వర్గాల ప్రజల సహకారం తీసుకుంటామన్నారు. క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందితో మాట్లాడి మెరుగైన పోలీసింగ్‌కు కృషి చేస్తామన్నారు. సున్నిత గ్రామాలు, బైండోవర్లు.. ఇలా ఏదైనా చట్టపరంగా ముందుకెళ్తామన్నారు. ఎన్నికల నియమ నిబంధనల మేరకు స్ట్రాంగ్‌ రూంల వద్ద పటిష్ట మూడంచెల భద్రత కొనసాగుతోందని, కౌంటింగ్‌ ప్రక్రియ సందర్భంగా కూడా ఎలాంటి హింస, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. 

మరింత బలోపేతం 

స్థానిక జేఎన్టీయూ స్ట్రాంగ్‌ రూంల భద్రతను ఎస్పీ పరిశీలించారు. కేరళ సాయుధ స్పెషల్‌ పోలీసులు, ఏఆర్‌ సాయుధ పోలీసులు, సివిల్‌ పోలీసులు మూడంచెల భద్రతను నిర్వహిస్తుండటాన్ని సమీక్షించి మరింత బలోపేతం చేయాలన్నారు. పార్కింగ్‌ స్థలాన్ని స్ట్రాంగ్‌ రూంలకు దూరంగా ఏర్పాటు చేయాలని, అన్ని గేట్లలోనూ సిబ్బందిని బందోబస్తుకు నియమించాలని సూచించారు. కౌంటింగ్‌ రోజున తీసుకోవాల్సిన బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. అవాంఛనీయ ఘటనలకు, హింసకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లా ఎస్పీతోపాటు అదనపు ఎస్పీలు విజయభాస్కర్‌రెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, డీఎస్పీలు టీవీవీ ప్రతాప్‌కుమార్, మునిరాజు, సీఐలు జాకీర్‌హుస్సేన్, ఇందిర, రెడ్డెప్ప, ప్రతాప్‌రెడ్డి వెళ్లారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని