logo

పతకం కల.. దక్కించుకునే పట్టుదల

ఆ బాలుడు ఆరో తరగతిలో లాన్‌ టెన్నిస్‌ రాకెట్‌ పట్టాడు. మూడేళ్ల పాటు టెన్నిస్‌లో పెద్దగా విజయాలు సాధించలేదు. నాలుగేళ్ల క్రితం లాన్‌ టెన్నిస్‌ నుంచి సాఫ్ట్‌ టెన్నిస్‌లో అడుగుపెట్టాడు. గేమ్‌ మొత్తం లాన్‌ టెన్నిస్‌ మాదిరిగానే ఉంటుంది.

Published : 20 May 2024 05:02 IST

సాఫ్ట్‌ టెన్నిస్‌లో అంతర్జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
దక్షిణ కొరియా పోటీలకు ఆరోన్‌ రొనాల్డీనో

జాతీయ క్రీడల్లో ట్రోఫీ అందుకున్న ఆరోన్‌ రొనాల్డినో

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: ఆ బాలుడు ఆరో తరగతిలో లాన్‌ టెన్నిస్‌ రాకెట్‌ పట్టాడు. మూడేళ్ల పాటు టెన్నిస్‌లో పెద్దగా విజయాలు సాధించలేదు. నాలుగేళ్ల క్రితం లాన్‌ టెన్నిస్‌ నుంచి సాఫ్ట్‌ టెన్నిస్‌లో అడుగుపెట్టాడు. గేమ్‌ మొత్తం లాన్‌ టెన్నిస్‌ మాదిరిగానే ఉంటుంది. కేవలం బంతి బరువులో మాత్రమే కొంత తేడా ఉంటుంది. సాఫ్ట్‌ టెన్నిస్‌లో ఎదురులేని విజయాలు సాధించాడు. ఇంకేముంది జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాడు. వచ్చే నెలలో దక్షిణ కొరియాలో జరగనున్న అంతర్జాతీయ సాఫ్ట్‌టెన్నిస్‌ పోటీలకు భారత్‌ తరఫున ఎంపికైన బాలుడు ఎస్‌.ఆరోన్‌ రొనాల్డినో. గుంతకల్లు పట్టణానికి చెందిన ఈ బాలుడు తల్లిదండ్రులు మేరీజ్యోతి, సి.శేఖర్‌ ప్రోత్సాహంతో సాఫ్ట్‌టెన్నిస్‌ క్రీడలో ఉన్నత శిఖరాలు అధిరోహించాడు. జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన మొట్టమొదటి క్రీడాకారుడు ఈ బాలుడే కావడం విశేషం.

నాలుగేళ్లలో పట్టు

లాన్‌ టెన్నిస్‌ నుంచి సాఫ్ట్‌టెన్నిస్‌కు మారిన రొనాల్డినో నాలుగేళ్లలో ఎంతో పట్టు సాధించాడు. రాష్ట్రస్థాయిలో విజయవాడ, కర్నూలు జిల్లాల్లో జరిగిన పోటీల్లో స్వర్ణం సాధించాడు. జాతీయస్థాయిలో జరిగిన పోటీలకు వరుసగా ఆరుసార్లు ఎంపికై రాష్ట్ర కీర్తిని ఇనుమడింపజేశాడు. గుజరాత్, భువనేశ్వర్, లఖ్‌నవూ, మధ్యప్రదేశ్, జమ్ముకశ్మీర్‌ జరిగిన జాతీయ సాఫ్ట్‌ టెన్నిస్‌ పోటీలకు ప్రాతినిధ్యం వహించాడు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగిన జాతీయ పాఠశాల క్రీడల్లో ప్రథమస్థానాన్ని సాధించి అందరినీ ఆశ్చర్య పరిచాడు. ఈనెల 29 నుంచి మొహలీలో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు ఈ బాలుడు ఎంపికయ్యాడు. 


నిరంతర సాధన 

ఆరోన్‌ రొనాల్డినో అంతర్జాతీయ స్థాయిని చేరుకున్నాడంటే.. తొమ్మిదేళ్ల నుంచి అలుపెరగని సాధన, పట్టుదల, తల్లిదండ్రుల సంపూర్ణ ప్రోత్సాహం ఉంది. రైల్వే మైదానంలో రోజుకు ఐదు గంటలపాటు సాధన చేసి వివిధ పోటీల్లో పాల్గొని ఆటపై పట్టు సాధించాడు. ఇప్పటివరకు ఏడు పర్యాయాలు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనగా ప్రతిసారి పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. జాతీయ స్థాయిలో కూడా ఒకసారి స్వర్ణపతకం సాధించి అదరహో అనిపించాడు. గత జనవరిలో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన జాతీయ పాఠశాల క్రీడల సాఫ్ట్‌టెన్నిస్‌ పోటీల్లో ఏకంగా పసిడి పతకం పట్టాడు. అద్భుత ఆటతీరును ప్రదర్శించి రాష్ట్రానికి స్వర్ణ పతకం అందించిన ఏకైక క్రీడాకారుడు ఈ బాలుడు. ఇంటర్‌ పూర్తి చేసుకున్న ఈ బాలుడు ఆరుసార్లు జాతీయ స్థాయి సాఫ్ట్‌టెన్నిస్‌ పోటీలకు ఎంపికై రాణించాడు. నాలుగేళ్లలో ఆటలో పరిణతి సాధించాడు.


పతకం తెస్తా  
- ఆరోన్‌ రొనాల్డినో, సాఫ్ట్‌టెన్నిస్‌ ఆటగాడు

తల్లిదండ్రులు, శిక్షకుల ప్రోత్సాహంతో సాఫ్ట్‌టెన్నిస్‌లో అనేక విజయాలు సాధించా. దక్షిణ కొరియాలో జరగనున్న అంతర్జాతీయ పోటీల్లో పతకం సాధించాలన్నదే నా కల. ఈ పోటీల కోసం ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నా. లాన్‌ టెన్నిస్‌ నుంచి సాఫ్ట్‌టెన్నిస్‌లో అడుగుపెట్టగానే విజయాలు సొంతమయ్యాయి. ఈ ఆటలో అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలన్నదే నా ఆశ.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని