logo

కష్టాలు కనవయ్యా.. వీరభద్రా!

లేపాక్షి దుర్గా, పాపనాశేశ్వర, వీరభద్రస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు కనీస మౌలిక వసతుల కల్పన, పర్యవేఓణలో నిర్లక్ష్యం అణువణువునా కనపడుతుంది.

Published : 20 May 2024 05:06 IST

కనీస వసతులు లేక భక్తుల ఇబ్బందులు 

ఆలయం చుట్టూ ఎండలో నడిచేందుకు ఇబ్బందులు పడుతున్న విదేశీ భక్తులు 

లేపాక్షి, న్యూస్‌టుడే: లేపాక్షి దుర్గా, పాపనాశేశ్వర, వీరభద్రస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు కనీస మౌలిక వసతుల కల్పన, పర్యవేఓణలో నిర్లక్ష్యం అణువణువునా కనపడుతుంది. పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిన ఆలయానికి వేలాది మంది వచ్చే భక్తులకు తగిన సదుపాయాలు లేక అవస్థలతో దర్శనం చేసుకోవాల్సి వస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక భక్తులు సాధారణ రోజుల్లో 500-1000 వరకు, శని, ఆదివారం, సెలవులు, పర్వదినాల్లో 10వేల మందిదాకా దర్శించుకుంటారు. బయట నుంచే భక్తులకు కల్పించాల్సిన వసతులపై నిర్లక్ష్యం, నిర్వహణపై ఆలయ అధికారుల పర్యవేక్షణ లోపంతో భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రధానంగా వాహనాల పార్కింగ్, స్నానాల గదులు లేకపోవడం, ఎండలో ఆలయం చుట్టూ తిరిగేలా తివాచీలు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. భక్తుల కష్టాలు వీరభద్రుడే తీర్చాలని మొరపెట్టుకుంటున్నారు.

పార్కింగ్‌ సమస్య

ఆలయానికి వచ్చే భక్తులకు వాహనాల పార్కింగ్‌ ప్రధాన సమస్యగా మారింది. పార్కింగ్‌ నిర్వహణకు పంచాయతీకి ఏటా రూ.50లక్షలకు పైగా ఆదాయం వస్తోంది. అయితే వాహనాల పార్కింగ్‌ చేసేందుకు అనువైన ప్రాంతం లేకపోవడంతో ఎక్కడపడితే అక్కడే వాహనాలను నిలపాల్సి వస్తోంది. వాహనదారుల నుంచి ద్విచక్ర వాహనానికి రూ.20, కార్లకు రూ.70, బస్సులకు రూ.100కు పైగా వసూలు చేస్తున్నా వారికి తగిన స్థలం చూపక పోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. శని, ఆదివారాల్లో రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ రహదారి మొత్తం నిండిపోయి, తూర్పు ద్వారంలోనూ, బస్టాండ్‌ వద్ద ఖాళీ స్థలాల్లో నిలపాల్సి వస్తోంది. జఠాయువు థీం పార్కు వద్ద కొంతమేర ఖాళీ స్థలం ఉన్నప్పటికీ అక్కడ గుత్తేదారు వాహనాలకు సుంకం వసూలు చేస్తుండటంతో భక్తులు అసహనానికి గురౌతున్నారు. వీటిపై అధికారులు, పాలకులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.     

ఆలయ తూర్పు ద్వారంలో రోడ్డుపైనే వాహనాలు


కనీస వసతులేవీ?

వీరభద్రుని దర్శనానికి వచ్చే సాధారణ భక్తులకు అత్యవసరాలు, స్నానాలు, దుస్తులు మార్చుకునేందుకు సదుపాయాలు తగినంతగా లేవు. ఆలయం పడమర వైపున ఉద్యానవనం, నంది విగ్రహం ఆవరణంలో పది మరుగుదొడ్లు ఉన్నాయి. అవి భక్తుల తాకిడి అధికంగా ఉన్న సమయంలో ఏ మూలకు సరిపోవడం లేదు. స్నానాలు చేసేందుకు సైతం గదులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ఆలయ ప్రాంగణంలో దాతల సహకారంతో నిర్మించిన అన్నదాన భవనం వద్ద నిర్మించిన స్నానపు గదులు, మరుగుదొడ్ల వినియోగం వలన భక్తులకు కాస్త ఊరట లభిస్తోంది. దీనికి తోడు సామాన్య, మధ్యతరగతి భక్తులు రాత్రిళ్లు స్థానికంగా ఉండేలా అతిథి గృహాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆలయానికి వచ్చే భక్తులకు తాగేందుకు శుద్ధజలం అందుబాటులో లేదు. గతంలో ఉన్న శుద్ధజల కేంద్రం మరమ్మత్తులకు గురికాగ దాని స్థానంలో కొత్తది ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆలయానికి పడమర ద్వారంలో ఉన్న కోనేరును పునరుద్ధరించి స్నానాలు చేసేలా చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని