logo

కాలువల నిండా పూడిక.. సాగు సాగేదెలా ఏలిక?

శ్రీసత్యసాయి జిల్లాలో చెరువుల కట్టలు బలహీనంగా మారాయి. తూములు దెబ్బతిని మొరాయిస్తున్నాయి. కాలువలు పూడిక, ముళ్లపొదలతో నిండిపోయాయి. చుక్క నీరు కూడా వెళ్లే పరిస్థితి లేదు.

Published : 20 May 2024 05:11 IST

ముంచుకొస్తున్న ఖరీఫ్‌
ప్రతిపాదనలకే పరిమితమైన చెరువుల మరమ్మతులు

జంబు, పూడికతో బుక్కపట్నం చెరువు ప్రధాన కాలువ దుస్థితి

చిత్రావతి నదిపై నిర్మించిన బుక్కపట్నం చెరువు ఉమ్మడి రాష్ట్రంలోనే రెండో అతిపెద్దది.  కొత్తచెరువు, బుక్కపట్నం మండలాల మధ్యలో 2 వేల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. నాలుగైదు దశాబ్దాల కిందట రెండు పంటల వరిసాగుతో దక్షిణ తాలూకాలకు ధాన్యాగారంగా పేరొందిన చెరువులో పూడిక పెరిగిపోయి ఒక పంటకు నీరందడం గగనంగా మారింది. ఒక టీఎంసీ సామర్థ్యంతో నిర్మించిన చెరువులో ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం అర టీఎంసీకి పడిపోయింది. అధికారికంగా 3,175 ఎకరాల ఆయకట్టు సాగు ఉండగా.. అనధికారికంగా మరో మూడు వేల ఎకరాల సాగు ఉంది. నీటి విడుదలకు ఏర్పాటు చేసిన ప్రధాన తూములు నియంత్రణకు వీలుకాక నీరు వృథా అవడం పరిపాటిగా మారింది. నాలుగైదేళ్లలో సాగునీటి కాలువల్లో పూడిక తీత పనులు చేపట్టక వాటి రూపురేఖలే మారిపోయాయి. దీంతో ఆయకట్టులో పంటలసాగుకు రైతులు ఆసక్తి కనబరచడం లేదు.


పుట్టపర్తి, కదిరి, కొత్తచెరువు, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి జిల్లాలో చెరువుల కట్టలు బలహీనంగా మారాయి. తూములు దెబ్బతిని మొరాయిస్తున్నాయి. కాలువలు పూడిక, ముళ్లపొదలతో నిండిపోయాయి. చుక్క నీరు కూడా వెళ్లే పరిస్థితి లేదు. మరమ్మతులు చేయడానికి ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. సాగుభూములు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. నిర్వహణపై జలవరులశాఖ అధికారులు మొద్దునిద్ర వీడటం లేదు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి, వృథా కాకుండా భూగర్భంలోకి ఇంకేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఈ మేరకు పాలకులు, అధికారులు నిత్యం ప్రసంగాలు చేస్తున్నారు కానీ.. క్షేత్రస్థాయిలో గాలికి వదిలేయడంతో లక్ష్యం నీరుగారిపోతోంది. 2022లో కురిసిన భారీ వర్షాలకు చెరువుల గట్లు దెబ్బతిన్నాయి. తూములు మొరాయిస్తున్నాయి. మరమ్మతులకు నిధుల యోగం దక్కలేదు. 2022-23లో దెబ్బతిన్న 23 చెరువుల మరమ్మతులకు ప్రతిపాదనలు పంపినా.. పైసా కూడా మంజూరు కాలేదు. తాగు, సాగునీటికి భరోసా ఇస్తున్న చెరువుల బాగోగులపై అధికారులు అలసత్వం వహిస్తుండటంతో అవి బలహీనంగా మారాయి.

జిల్లాలో మొత్తం చెరువులు: 1,186
సాగు విస్తీర్ణం: 83,486 ఎకరాలు
నీటి సామర్థ్యం: 15,323 ఎంసీఎఫ్‌టీ


నల్లచెరువు మండల పరిధిలోని పూలకుంట చెరువు కింద 175 ఎకరాల ఆయకట్టు ఉంది. చెరువు నిండితే ప్రత్యక్షంగా 175 ఎకరాలతోపాటు పరోక్షంగా వంద ఎకరాల సాగుతో పాటు, బోరుబావుల్లో భూగర్భ జలాలు పెరుగుతాయి. నాలుగేళ్లు కిందట రైతులే రూ.లక్ష వరకు ఖర్చు చేసి కాలువలను బాగు చేసుకున్నారు. చెరువు కింద కాలువల నిర్వహణ పట్టించుకోకపోవడంతో పూర్తిగా కంపచెట్లు, కూడికతో నిండిపోయాయి. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయని, చెరువు నిండినా.. సాగు ప్రశ్నార్థకమేనని రైతులు వాపోతున్నారు.


అవే రైతన్నకు కల్పతరువులు..

రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన శ్రీసత్యసాయి జిల్లాలో ఎలాంటి ప్రాజెక్టులు లేవు. నీటి వనరులు లేవు. హంద్రీనీవా కాలువ ద్వారా వచ్చే నీరే జిల్లాకు దిక్కు. వర్షధారంపై ఆధారపడి రైతులు అధిక సంఖ్యలో పంటలు సాగు చేస్తున్నారు. చెరువులే ఇక్కడి కర్షకుల కల్పతరువు. జిల్లాలో 83,486 ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా పరోక్షంగా మరో 80 వేల ఎకరాలు సాగులోకి వస్తాయి. వర్షాలు సకాలంలో రాకపోవడంతో ఏటా పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులు పట్టణాలకు వలస బాట పట్టారు. రెండేళ్ల కింద కురిసిన వర్షాలకు 80 శాతం చెరువులోకి వర్షపునీరు చేరాయి. తూములు మొరాయించడం.. కాలువల నిండా పూడిక, కంపచెట్లతో ఉండటంతో రైతులు పంటలు సాగుకు ఆసక్తి చూపడం లేదు. అధికారులు స్పందించకుంటే చెరువులోకి వచ్చే వర్షపునీరు వృథాగా వెళ్లే అవకాశాలు ఉన్నాయి.


ప్రతిపాదనలు పంపాం
- గంగాధర్, జిల్లా నీటి పారుదలశాఖ ఈఈ 

బలహీనంగా ఉన్న చెరువు కట్టలు, దెబ్బతిన్న తూములు, మరువల మరమ్మతులు, కాలువల్లో పూడికతీత పనులకు ప్రతిపాదనలు పంపాం. పరిపాలన, ఆర్థిక అనుమతులు రాగానే  మరమ్మతులు చేయించేందుకు తగు చర్యలు తీసుకుంటాం. దెబ్బతిన్న కుంటలు, చెరువులను తాత్కాలికంగా మరమ్మతులు చేయించాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు