logo

మిరప రైతుపై శీతకన్ను

మిరప రైతుకు తీరని నష్టం ఏర్పడింది. ఓ వైపు ప్రకృతి వైపరీత్యం, మరోవైపు గిట్టుబాటు ధరలు లేని కారణంగా వారికి కలిగిన నష్టం అపారం. కానీ, ప్రభుత్వం మిరప రైతులకు పంట నష్ట పరిహారం వర్తింపజేయకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

Published : 20 May 2024 05:15 IST

రూ.500 కోట్లకు పైగా నష్టపోయినా పట్టించుకోని ప్రభుత్వం

ఉరవకొండ మండలం నెరమెట్ల వద్ద మిరప నిల్వలు (పాత చిత్రం)

ఉరవకొండ, న్యూస్‌టుడే: మిరప రైతుకు తీరని నష్టం ఏర్పడింది. ఓ వైపు ప్రకృతి వైపరీత్యం, మరోవైపు గిట్టుబాటు ధరలు లేని కారణంగా వారికి కలిగిన నష్టం అపారం. కానీ, ప్రభుత్వం మిరప రైతులకు పంట నష్ట పరిహారం వర్తింపజేయకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాలో గత ఏడాది ఉరవకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లోని విడపనకల్లు, ఉరవకొండ, వజ్రకరూరు, బెళుగుప్ప, కూడేరు, బొమ్మనహాళ్, కణేకల్, కళ్యాణదుర్గం, రాయదుర్గం తదితర మండలాల్లో తుంగభద్ర ఎగువ కాలువ, జీబీసీ, హంద్రీనీవా కాలువలతో పాటు బోర్లు, బావుల కింద 1.20 లక్షల ఎకరాల్లో మిరప సాగైంది. అదంతా ఎండు మిరపకు పనికివచ్చే రకాలే. గత ఏడాది వర్షాభావంతోపాటు హెచ్‌ఎల్‌సీ, జీబీసీలకు సాగునీరు రెండు నెలల ముందుగానే బంద్‌ అయ్యాయి. దీంతో పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. రైతులు ఎకరాకు రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టారు. దీని ప్రకారం రూ.2400 కోట్ల వరకు పెట్టుబడి అయ్యింది. ఈ ఏడాది డబ్బీ రకం ఎకరాకు సగటున 8 క్వింటాళ్లు, ఇతర హైబ్రిడ్‌ రకాలు 12 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. అంటే సగం దిగుబడి కూడా రాలేదు. దీనికితోడు డబ్బీ రకం క్వింటా ధర రూ.20 వేలు లోపు, హైబ్రిడ్‌ రకాల ధరలు క్వింటా రూ.12 వేలు లోపు పలికాయి. రైతులు పెట్టిన పెట్టుబడి కూడా తిరిగిరాని పరిస్థితి. మిరప పంట ద్వారా ఈ ప్రాంత రైతులు సగటున రూ.500 కోట్లకు పైగా నష్టాన్ని అనుభవించారు.

నష్టాన్నీ అంచనా వేయలేదు..

ఇంత జరిగినా.. కనీసం పంట నష్టాన్ని అంచనా వేసే దిశగా కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది లేదు. గతంలో ఎన్నడూ లేనతంగా మిరప రైతులు తీవ్రంగా నష్టపోయారు. తాజాగా ప్రభుత్వం రైతులకు పంటనష్ట పరిహారం మంజూరు చేసింది. కానీ, అందులో మిరప రైతులకు అవకాశం కల్పించలేదు. వారిని ఆదుకునే దిశగా చేపట్టిన చర్యలు శూన్యం. భారీ నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలోనని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కానీ, ప్రభుత్వం వారి గురించి పట్టించుకోకపోవడంతో మరింత కుంగిపోతున్నారు. అరకొరగా వచ్చిన పంట దిగుబడిని తక్కువ ధరలకు అమ్ముకోలేక చాలామంది రైతులు దిగుబడిని అతికష్టం మీద శీతల గిడ్డంగుల్లో నిల్వ ఉంచుకుని గిట్టుబాటు ధర కోసం ఎదురు చూస్తున్నారు. కనీసం ఆ పంటకు గిట్టుబాటు ధరను కల్పించే దిశగానైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక కౌలు పరిస్థితి మరింత దారుణం. వారు అన్ని రకాలుగా నష్టాన్ని ఎదుర్కొంటున్నా ఆదుకునే వారేలేరు.


అన్నదాతలను ఆదుకోవాలి
- పెద్దన్న, వేల్పుమడుగు, విడపనకల్లు మండలం

నేను 14 ఎకరాల్లో జీబీసీ కింద మిరప సాగు చేశాను. వర్షాభావంతో ఆ కాలువకు అర్ధాంతరంగా నీటి సరఫరా ఆగిపోయింది. దీంతో ఎకరాకు మూడు నాలుగు క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదు. ఆ తక్కువ దిగుబడిని అమ్ముకుందామంటే ధర లేదు. ప్రభుత్వం మిరప పంటకు నష్ట పరిహారం లేదా పంటల బీమాను వర్తింపజేసి ఆదుకోవాలి.


ఎకరాకు రూ.లక్ష నష్టం
- యర్రగుంట్ల రాము, ఇంద్రావతి, ఉరవకొండ

నేను ఏడు ఎకరాల్లో మిరపను సాగు చేశాను. ఎకరాకు రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. పంట దిగుబడి తగ్గడం, గిట్టుబాటు ధర లేకపోవడంతో సగటున ఎకరకాకు రూ.లక్ష ప్రకారం నష్టం వాటిల్లింది. పంట భారీగా దెబ్బతిన్నా, ప్రభుత్వం కనీసం పంట నష్టాన్ని కూడా అంచనా వేయలేదు. పరిహారం, బీమాను వర్తింపచేయలేదు. ప్రభుత్వం మమ్మల్ని పరిగణనలోకి తీసుకోకపోవడం బాధాకరం. 


తక్కువ ధరకే పంట విక్రయం
- వెంకటేశ్, ఉరవకొండ 

నేను మూడు ఎకరాల్లో 273 రకం మిరప పంటను సాగు చేశాను. వాతావరణం పరంగా చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. కష్టాన్ని భరిస్తూ పంటను కాపాడుతూ వచ్చాము. కానీ, దిగుబడి గణనీయంగా తగ్గింది. దీనికితోడు ధర లేకపోవడంతో తాము పడిన ఇబ్బంది మాటల్లో చెప్పుకోలేనిది. తక్కువ ధరకు అమ్ముకోలేక, నిల్వ ఉంచుకోవడానికి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందికి గురవుతూ తక్కువ ధరకే పంటను అమ్ముకుని తీవ్రంగా నష్ట పోయాము.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని