logo

తాడిపత్రి అల్లర్ల కేసులో 728 మంది నిందితులు

పోలింగ్‌ రోజు, మరసటిరోజు తాడిపత్రిలో జరిగిన అల్లర్లకు 728 మందిని బాధ్యులుగా గుర్తించారు.

Published : 21 May 2024 02:40 IST

ఇప్పటికే 91 మందికి రిమాండ్‌

ఎన్నికల సంఘానికి సిట్‌ నివేదిక

ఈనాడు డిజిటల్, అనంతపురం: పోలింగ్‌ రోజు, మరసటిరోజు తాడిపత్రిలో జరిగిన అల్లర్లకు 728 మందిని బాధ్యులుగా గుర్తించారు. ఈ మేరకు సిట్‌ అధికారులు ఎన్నికల సంఘానికి సోమవారం నివేదిక అందించారు. పోలింగ్‌ రోజు ఎమ్మెల్యే పెద్దారెడ్డి.. తెదేపా ఏజెంట్లపై దాడి చేయడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ మరుసటిరోజు పెద్దారెడ్డి తెదేపా నేత సూర్యముని ఇంటికి వెళ్లి దాడికి పాల్పడ్డారు. తెదేపా నాయకులు ప్రతిఘటించడంతో రెండువర్గాల మధ్య రాళ్ల దాడులు జరిగాయి. సీఐ మురళీకృష్ణతో పాటు పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. సీఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైకాపా, తెదేపా సానుభూతిపరులపై కేసులు నమోదు చేశారు. తాడిపత్రిలో అల్లర్లను అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారనే కారణంతో జిల్లా ఎస్పీ అమిత్‌ బర్దర్, తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, సీఐ మురళీకృష్ణను ఎన్నికల సంఘం సస్పెండ్‌ చేసింది. అల్లర్లపై విచారించేందుకు ఒంగోలు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో సిట్‌ ఏర్పాటు చేశారు. సిట్‌ బృందం శని, ఆదివారాల్లో తాడిపత్రిలోనే ఉండి విచారణ చేపట్టింది. పోలీసు అధికారులతో పాటు రాళ్ల దాడిని చూసిన ప్రత్యక్ష సాక్షులను విచారించింది. బృందం సభ్యులు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఇప్పటికే 396 మందిని గుర్తించారు. 332 మందిని గుర్తించాల్సి ఉంది. 91 మందిని అరెస్టు చేయగా..634 మందిని అరెస్టు చేయాల్సి ఉంది. ఇందులో ముగ్గురికి 41ఏ నోటీసులు జారీ చేసినట్లు సిట్‌ బృందం ఎన్నికల సంఘానికి నివేదిక అందజేసింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని