logo

శ్రీరామిరెడ్డి నీటిపథకం కార్మికుల సమ్మె బాట

శ్రీరామిరెడ్డి నీటి పథకం కార్మికులు ఈ నెల 18 నుంచి సమ్మె బాట పట్టారు. జీతాలతోపాటు తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండు చేస్తున్నారు

Updated : 21 May 2024 06:30 IST

వేతనాలతోపాటు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌
గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: శ్రీరామిరెడ్డి నీటి పథకం కార్మికులు ఈ నెల 18 నుంచి సమ్మె బాట పట్టారు. జీతాలతోపాటు తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండు చేస్తున్నారు. నీటి సరఫరాను నిలిపివేయడంతో గ్రామాల్లో తాగునీటి సమస్య మొదలైంది. పథకంలో ప్రస్తుతం 650 మంది కార్మికులు, 20 మంది సూపర్‌వైజర్లు పని చేస్తున్నారు. కళ్యాణదుర్గం, మడకశిర, హిందూపురం, అమరాపురం, రాయదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల పరిధిలోని 1,059 గ్రామాలకు నీరు సరఫరా చేస్తున్నారు. రోజుకు కొన్ని మిలియన్ల లీటర్ల నీరు సరఫరా అవుతోంది.

కళ్యాణదుర్గం నీటి పథకంలోని ఫేస్‌-4 పరిధిలో 21 మందికి మూడు నెలల జీతాలు రూ.10.20 లక్షలు,  ఫేస్‌-1లో 70 మందికి మూడు నెలల వేతనాలు రూ.1.13 కోట్లు ఇవ్వాల్సి ఉంది. 195 మంది కార్మికులకు రూ.2 వేలు కోత విధించి ఇస్తున్నారు. వారికి రూ.11.70లక్షలు రావాల్సి ఉంది. 256 మందికి నెలకు రూ.3,200 చొప్పున 14 నెలల పీఎఫ్‌ రూ.11.04 కోట్లు రావాల్సి ఉంది. జిల్లా అధికారులతో సుమారు 17 సార్లు చర్చలు జరిపితే ప్రభుత్వం నుంచి రూ.18 కోట్లు వచ్చాయని, జీతాలు మొత్తం ఇస్తామని చెప్పారన్నారు. రెండు నెలల జీతాలు మాత్రమే ఖాతాల్లో వేసినట్లు కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించిన, కలెక్టర్, ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లిన వారందరిని విధుల నుంచి తొలగిస్తామని బెదిరిస్తున్నారని వారు ఆరోపించారు. పంప్‌హౌస్‌లో ఏ సమస్య తలెత్తినా కొంతమంది కార్మికులపై రుద్దుతూ వారికి నోటీసులు ఇస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు.

అధికారులు గుత్తేదారులకు వత్తాసు పలుకుతూ తమను అన్యాయం చేస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, జిల్లా కలెక్టర్‌ చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కార్మికులు కోరుతున్నారు. దీనిపై నీటిపారుదల శాఖ విభాగం ఎస్‌ఈ ఎహ్‌సాన్‌బాషను వివరణ కోరగా పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి సుమారు రూ.10 కోట్ల వరకు బిల్లులు రావాల్సి ఉంది. దాంతో సమస్య నెలకొంది. జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. కార్మికులకు జీతాలు ఇచ్చేలా చూస్తామన్నారు. దాంతోపాటు వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.


అమ్మ వైద్యానికి అప్పులు చేశా..

14 సంవత్సరాలుగా నీటి పథకంలో పని చేస్తున్నా. నెలవారి జీతాలు రాక పోవడంతో అవస్థలు పడుతున్నా. అమ్మకు వైద్యానికి, కుటుంబ పోషణకు ఇప్పటి వరకు రూ.90వేలు అప్పులు చేశా. అధికారులు పట్టించుకోక పోవడంతో దుర్భరంగా బతుకీడ్చాల్సి వస్తుంది. 
ఎర్రిస్వామినాయక్, లైన్‌మెన్, బొమ్మగానిపల్లి, బ్రహ్మసముద్రం మండలం


 పోషణ భారం

పథకంలో 15 సంవత్సరాలుగా పని చేస్తున్నా. మొదట్లో జీతాలు బాగానే వచ్చేవి. కొన్నేళ్ల నుంచి ఐదారు నెలలైనా ఇవ్వడం లేదు. నా భార్య ఆరోగ్యం సక్రమంగా లేక పోవడంతో వైద్యం కోసం, పిల్లల చదువులకు ఇప్పటికే సుమారు రూ.75వేల వరకు అప్పులు చేశా. జీతాలు రాక, తీసుకొన్న అప్పులు తీర్చలేక, కుటుంబాన్ని పోషించలేక ఇబ్బంది పడుతున్నా. 
నాగరాజు, లైన్‌మెన్, రాయదుర్గం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని