logo

ఇంటర్మీడియట్‌ ప్రవేశాలకు వేళాయె..

పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో ప్రవేశానికి సిద్ధమవుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 43 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలున్నాయి.

Updated : 21 May 2024 06:42 IST

కార్పొరేట్‌కు దీటుగా కొన్ని ప్రభుత్వ కళాశాలలు

ఉత్తమ మార్కులు సాధిస్తున్న విద్యార్థులు

అనంతపురం విద్య, న్యూస్‌టుడే:  పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో ప్రవేశానికి సిద్ధమవుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 43 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలున్నాయి. కొన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు.. ప్రైవేటు, కార్పొరేట్‌కు దీటుగా ఉన్నాయి. మారుమూల ఉన్న బొమ్మనహాళ్‌ కళాశాలలో వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారు. అనంత నగరంలోని  కొత్తూరు ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్‌ కళాశాలలు జిల్లాలోనే ఉత్తమమైనవిగా గుర్తింపు పొందాయి. ప్రత్యేక బోధన, గ్రంథాలయాలు, ప్రయోగశాలలు, ఐఎఫ్‌పీ ప్యానల్‌ బోర్డులు కలిగిన తరగతి గదులు. అంతర్జాలం, సాంకేతిక పరిజ్ఞానం సద్వినియోగం చేసుకొని విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు.

ఫలితాల్లో అగ్రస్థానం

బొమ్మనహాళ్‌: అనంతపురం జిల్లా కేంద్రానికి దూరంగా కర్ణాటక సరిహద్దున ఉన్న బొమ్మనహాళ్‌ జూనియర్‌ కళాశాలలో పనిచేసే అధ్యాపకుల సమష్టి కృషి, ప్రత్యేక శిక్షణతో ద్వితీయ సంవత్సరం ఇంటర్‌లో రెండేళ్లుగా 100 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి జిల్లాలో ప్రథమ స్థానం సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 196 మంది, ప్రథమ సంవత్సరంలో 101 మంది విద్యార్థులు ఉన్నారు. ఎంపీసీ, బైపీసీ, ఆర్ట్స్‌లో హెచ్‌ఈసీ, బైపీసీ గ్రూపులు ఉన్నాయి. 14 గదులు ఉన్నాయి. దాతల సహకారం, నాడు-నేడు వల్ల విద్యార్థులకు సరిపడా బల్లలు ఉన్నాయి. ముగ్గురు రెగ్యులర్‌ అధ్యాపకులు, ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్, ఆరుగురు ఒప్పంద, ముగ్గురు అతిథి అధ్యాపకులు ఉన్నారు. అందరూ కలసికట్టుగా పనిచేసి కార్పొరేట్‌ కళాశాలకు దీటుగా ఫలితాలు సాధించి ఆదర్శంగా నిలిచారు. నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు 120 రోజులు విద్యార్థులకు ప్రణాళికాబద్ధంగా విద్యాబోధన చేసి ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించారు. రాత్రివేళల్లో కూడా వారి చదువును పర్యవేక్షణ చేశారు.

అనంత నగరంలో కేఎస్‌ఆర్‌ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల ఇది. ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు 950 మంది ఉన్నారు. మొదటి సంవత్సరం అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం కూడా 500 మందికి పైగా ప్రవేశాలకు దరఖాస్తు చేసుకొన్నారు. జిల్లా కేంద్రంలో ఏకైక ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల ఇది. కెమిస్ట్రీ, ఫిజిక్స్, జువాలజీ, బాటనీతోపాటు 11 ఒకేషనల్‌ ప్రయోగశాలలున్నాయి. మొత్తం 15 ప్రయోగశాలలున్న కళాశాల ఇది. 42 మంది అధ్యాపకులు పనిచేస్తున్నారు. ఇంటర్‌ ఫలితాల్లో 15 మంది 900 పైగా మార్కులు సాధించారు. కార్పొరేట్‌ కళాశాలల కంటే మెరుగైన వసతులు ఇందులో ఉన్నాయి.

అనంత నగరంలోని ప్రభుత్వ కొత్తూరు బాలుర జూనియర్‌ కళాశాల ఇది. ఇంటర్మీడియట్‌ బోర్డు ఏర్పాటైనప్పటి నుంచి ఈ కళాశాల ఉంది. 1969లో ఏర్పాటు చేశారు. ఉమ్మడి అనంత జిల్లాకే తలమానికంగా నిలుస్తోంది. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ, హెచ్‌ఈసీ, టీహెచ్‌సీ  కోర్సులు, అనుబంధంగా వసతి గృహం ఉన్న ఏకైక కళాశాల ఇది. 4 ప్రయోగశాలలు, విశాలమైన తరగతి గదులు, 18 ఐఎఫ్‌బీ బోర్డులు, 36 మంది అధ్యాపకులున్నారు. సువిశాలమైన క్రీడామైదానం కూడా ఉంది. ఆవరణలోనే ఒకేషనల్‌ కళాశాల ఉండటం విశేషం.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని