logo

మళ్లీ బాదుడు ..

ఏరుదాటే దాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా జగన్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఓట్ల కోసం ఈ ఏడాది జనవరి నుంచి చెత్తపన్నును నిలిపివేసిన ప్రభుత్వం.. మళ్లీ బాదుడుకు రంగం సిద్ధం చేసింది.

Published : 21 May 2024 06:41 IST

చెత్తపన్ను పునరుద్ధరించాలని ఆదేశాలు!

ఎన్నికల కోసం కొన్నినెలల పాటు నిలిపివేసిన జగన్‌ ప్రభుత్వం

ఈనాడు డిజిటల్, అనంతపురం: ఏరుదాటే దాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా జగన్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఓట్ల కోసం ఈ ఏడాది జనవరి నుంచి చెత్తపన్నును నిలిపివేసిన ప్రభుత్వం.. మళ్లీ బాదుడుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో క్లాప్‌ అమలు చేస్తున్న మున్సిపాలిటీలకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈనెల పన్నుతో పాటు గత నాలుగు నెలల బకాయిలు వసూలు చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందినట్లు సచివాలయం సిబ్బంది పేర్కొంటున్నారు. లక్ష్యం విధించి వీలైనంత త్వరగా చెత్తపన్ను వసూలు చేయాలని ఒత్తిడి తెస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో క్షేత్రస్థాయి సిబ్బంది పట్టణవాసుల వద్దకు వెళ్లి చెత్తపన్ను వసూలు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. నాలుగు నెలల విరామం తర్వాత ఇప్పుడు మళ్లీ అడిగితే పురవాసుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనని క్షేత్రస్థాయి సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

నెలకు రూ.11 కోట్లు 

ఉమ్మడి జిల్లాలో నాలుగు నెలలుగా చెత్తపన్ను వసూలు లేకపోవడంతో క్లాప్‌ వాహనాలను కొన్ని ప్రాంతాల్లో నిలిపివేశారు. అనంత కార్పొరేషన్‌తోపాటు నాలుగు మున్సిపాలిటీలకు 160 వాహనాలు అవసరం కాగా 136 మాత్రమే ఉన్నాయి. ఇందులోనూ మరమ్మతుల పేరిట కొన్నింటిని మూలన పడేశారు. దీంతో చెత్త సేకరణ లేక అత్యధిక శాతం కాలనీవాసులు అవస్థలు పడుతున్నారు. ఐదు పురపాలికల్లో కలిపి నెలకు రూ.11.91 కోట్లు వసూలు చేయాలని లక్ష్యం విధించుకున్నారు. అంటే సంవత్సరానికి రూ.142.92 కోట్లు. వాటి పరిధిలో మొత్తం 1.94 లక్షల ఇళ్లు ఉండగా నెలకు రూ.30 నుంచి రూ.60 వరకు.. వ్యాపార వాణిజ్య సముదాయాలకు రూ.120 నుంచి రూ.10 వేలు వరకు వసూలు చేయనున్నారు. 

ఎన్నికల ముందు కపటప్రేమ 

గతంలో ఎన్నడూ లేని విధంగా వైకాపా అధికారంలోకి వచ్చాక  చెత్తపన్ను ప్రవేశపెట్టింది. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని అనంతపురం, గుంతకల్లు, హిందూపురం, ధర్మవరం, కదిరి మున్సిపాలిటీల్లో క్లాప్‌ కార్యక్రమం అమలు చేశారు. ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి ఇంటింటికీ చెత్త సేకరణ మొదలుపెట్టారు. బిల్లులు సరిగా చెల్లించకపోవడంతో గుత్తేదారులు పూర్తిస్థాయిలో సేకరణ ప్రక్రియను అమలు చేయలేదు. అయినా పురవాసుల నుంచి పన్ను వసూలు చేశారు. కట్టనివారికి పింఛన్లలో కోత విధించారు. కొన్నిచోట్ల సేకరణ చేయకుండా ఇబ్బందులకు గురిచేశారు. జగన్‌ ప్రభుత్వం.. ఎన్నికల కోసం ఈ ఏడాది జనవరి నుంచి ప్రక్రియను నిలిపివేసింది. అరకొరగా వ్యాపార సముదాయాల నుంచి వసూలు చేసినా ప్రజల జోలికి వెళ్లలేదు. పోలింగ్‌ ప్రక్రియ ముగియడంతో మళ్లీ బాదుడు మొదలుపెట్టారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని