logo

రెండేళ్లయినా సొంత భవనాల్లేవ్‌

శ్రీసత్యసాయి జిల్లా ఏర్పాటై 25 నెలలు గడుస్తున్నా జిల్లా కేంద్రమైన పుట్టపర్తి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా  విడుదల చేసిన పాపానపోలేదు.

Published : 21 May 2024 03:38 IST

కార్యాలయాల ఏర్పాటుకు స్థలసేకరణ ఊసేలేదు..

నయా పైసా ఇవ్వని వైకాపా ప్రభుత్వం

ప్రశాంతిగ్రామ్‌ సత్యసాయి ట్రస్టు సామూహిక భవనంలో 14 ప్రభుత్వ కార్యాలయాలు
పుట్టపర్తి, న్యూస్‌టుడే : శ్రీసత్యసాయి జిల్లా ఏర్పాటై 25 నెలలు గడుస్తున్నా జిల్లా కేంద్రమైన పుట్టపర్తి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా  విడుదల చేసిన పాపానపోలేదు. ప్రభుత్వ కార్యాలయాలకు భవనాలు, కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదు. కనీసం ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలూ నెలకొల్పలేదు. రాత్రి 8.30 గంటల దాటితే అనంతపురం వెళ్లేందుకు కనీసం ఒక్క బస్సు లేదంటే ఉద్యోగులు ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితి ఇట్టే అర్థమవుతోంది. అధికారులకు విధి నిర్వహణలో ఆలస్యం జరిగితే రాత్రి ఇక్కడే బస చేయాల్సిన దుస్థితి నెలకొంది. అనంతపురం, ధర్మవరం నుంచి అత్యధికంగా అధికారులు విధులకు హాజరవుతున్నారు. కొందరు మాత్రమే పుట్టపర్తిలో ఉంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు 70 శాతం సత్యసాయి ట్రస్టుకు సంబంధించిన భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. చిన్నపాటి గదుల్లో విధులు నిర్వర్తించడానికి అధికారులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయాలు పుట్టపర్తికి దూరంగా ఉండటంతో వెళ్లేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నేటికీ పక్కా భవన నిర్మాణాలకు స్థలసేకరణ చేయలేదు. ఇందుకు నిధులు ప్రభుత్వం విడుదల చేసిన దాఖలాలు లేవు. 

అన్నింటికీ అనంతవైపే చూపు 

నేటికీ కొన్ని కార్యాలయాలు ఉమ్మడిగా ఉండటం, విభజన జరగక పాలన పరంగా సమస్యలున్నాయి.జిల్లా ఏర్పడి రెండేళ్లు అయినప్పటికీ.. కొన్ని శాఖల ఆర్థికపరమైన అధికారాలు లేకపోవడంతో పాత జిల్లా వైపు చూడాల్సి వస్తోంది. నేటికీ రెవెన్యూ శాఖలో జరిగే బదిలీలన్నీ, సర్వీసులకు సంబంధించిన అన్ని అంశాలు అనంత జిల్లా కలెక్టరేట్‌ నుంచి జరుగుతున్నాయి. కొన్ని శాఖల అధికారులు నిర్వహణ వ్యయం తదితర వాటిని ప్రతి నెలా అనంతపురంలోకి కార్యాలయాలకు బిల్లులు పంపించి, మంజూరు చేయించుకుంటున్నారు. నేటికీ విద్యుత్తు, జిల్లా పరిషత్, మైనింగ్, గ్రంథాలయం, ఉపాధి కల్పన, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్, పట్టణ ప్లానింగ్, విభాగాలు ఉమ్మడిగానే ఉన్నాయి.

ట్రస్టు భవనాలే కార్యాలయాలు 

జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువులో నిర్వహిస్తున్నారు. 70 శాతం సత్యసాయి ట్రస్టుకు సంబంధించిన భవనాల్లోనే వాటిని నడుపుతున్నారు. కలెక్టరేట్‌తో పాటు ప్రశాంతిగ్రామ్‌ వద్ద ట్రస్టు భవనంలో 12, దీనజనోద్ధరణ భవనాల్లో 10 ప్రభుత్వ కార్యాలయాలను కొనసాగిస్తున్నారు. కొన్ని అద్దె భవనాల్లో.. మరికొన్ని సంబంధిత శాఖల కార్యాలయాల్లోనే నిర్వహిస్తున్నారు. ఫర్నిచర్‌ సమస్యతో పాటు సిబ్బంది కొరత ఉంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సమస్యలతో వచ్చే, ప్రజలకు ఏ కార్యాలయం ఎక్కడ ఉందో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.

ఇన్‌ఛార్జులతోనే పాలన .. 

జిల్లాలో చాలా శాఖల్లో అధికారులందరూ ఇన్‌ఛార్జులే కొనసాగుతున్నారు.  పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, పబ్లిక్‌ హెల్త్, మలేరియా, గృహనిర్మాణం, ఆర్‌డబ్ల్యూఎస్, విద్యాశాఖ, మెప్మా, టిడ్కో తదితర శాఖలకు ఇన్‌ఛార్జీలే కొనసాగుతున్నారు. ఉద్యోగులు, సిబ్బంది కొరతతో దస్త్రాలు ముందుకు కదలడంలేదు. ఎక్కడ వేసిన దస్త్రం అక్కడే ఉంటుంది. ప్రజలు ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కలెక్టరేట్‌లోని మూడు విభాగాల్లో  40 శాతం సిబ్బంది కొరతతో పనులు ముందుకు సాగడంలేదు. ఉన్న ఉద్యోగులు, సిబ్బంది పని ఒత్తిడితో సతమతమవుతున్నారు. పనిభారం తట్టుకోలేక కొందరు ఉద్యోగులు సెలవుల్లో వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. పుట్టపర్తి, కదిరి, పెనుగొండ, ధర్మవరం డివిజన్‌ రెవెన్యూ కార్యాలయాల్లో సిబ్బంది కొరత ఉంది.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని