logo

పాతఏరులో కబ్జాదారుల పాగా

హిందూపురంలోని పరిగి రోడ్‌లో ఉన్న పాతఏరులో ఆక్రమణదారులు తిష్ఠవేశారు. దాదాపు పది ఎకరాలకు పైగా ఉన్న ఈఏరు సగానిపైగా కబ్జాకు గురైంది.

Published : 21 May 2024 03:42 IST

స్థలం ఆక్రమించి ఏర్పాటు చేసిన రేకుల షెడ్లు   

హిందూపురం అర్బన్, న్యూస్‌టుడే: హిందూపురంలోని పరిగి రోడ్‌లో ఉన్న పాతఏరులో ఆక్రమణదారులు తిష్ఠవేశారు. దాదాపు పది ఎకరాలకు పైగా ఉన్న ఈఏరు సగానిపైగా కబ్జాకు గురైంది. నకిలీ పత్రాలు సృష్టించి ఈ స్థలాన్ని మేము కొన్నాం.. మాదంటూ కొందరు రాత్రికిరాత్రే రేకుల షెడ్లు, కంచె ఏర్పాటు చేసుకొని దర్జాగా ఆక్రమించుకొంటున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పురపాలక సంఘానికి చెందిన పంపుహౌస్‌కు విద్యుత్తు కనెక్షన్‌ తొలగించి రాత్రి రాత్రే ధ్వంసం చేశారు. మున్సిపాలిటీ అధికారులు కనీసం పోలీస్‌స్టేషన్‌లో  ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవు. పట్టణం వేగంగా విస్తరిస్తుండటంతో ఈ ప్రాంతంలో ఎకరా రూ.2 కోట్లు పలుకుతోంది. దీంతో అక్రమార్కులు కబ్జాపర్వానికి తెరలేపారు. గతంలో ఖాళీగా కనిపించే ఈఏరు ప్రాంతమంతా ప్రస్తుతం రేకుల షెడ్లు ఏర్పాటు అవుతున్నాయి. 

డంపింగ్‌ యార్డుపైనా కన్ను 

పాతఏరుకు ఎదురుగా హిందూపురం- పరిగి మార్గం సమీపాన మున్సిపాలిటీకి చెందిన డంపింగ్‌ యార్డుపైనా కబ్జాదారుల కన్ను పడింది. ప్రధాన రహదారి సమీపంలో ఉన్న చెత్తను శుభ్రం చేసి... ఈ స్థలం మాదంటూ రాతి స్తంభాలు పాతేస్తున్నారు. డంపింగ్‌ యార్డు ముందుభాగం ప్రధాన రహదారి సమీపంలోని ప్రాంతమంతా ఆక్రమణకు గురయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకొని కబ్జాదారులను అడ్డుకోవాలని.. పాతఏరుకు రక్షణ ఏర్పాట్లు చేయాలని పురవాసులు డిమాండ్‌ చేస్తున్నారు.  
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని