logo

పురం పారిశ్రామికవాడల్లో నీటికి కటకట

శ్రీరామరెడ్డి తాగునీటి పథకానికి సంబంధించి కళ్యాణదుర్గం పంపింగ్‌ హౌస్‌ వద్ద నీటిని పంపింగ్‌ చేయాల్సిన మోటార్లు దెబ్బతినటంతో ప్రస్తుతం ఒకే మోటారు పనిచేస్తోంది.

Published : 21 May 2024 03:47 IST

పారిశ్రామికవాడలకు నీటిని తరలించేందుకు వినియోగించే ట్యాంకర్లు   

హిందూపురం అర్బన్, న్యూస్‌టుడే: శ్రీరామరెడ్డి తాగునీటి పథకానికి సంబంధించి కళ్యాణదుర్గం పంపింగ్‌ హౌస్‌ వద్ద నీటిని పంపింగ్‌ చేయాల్సిన మోటార్లు దెబ్బతినటంతో ప్రస్తుతం ఒకే మోటారు పనిచేస్తోంది. రెండో మోటారు మరమ్మతులో ఉన్నందున ఒక మోటారు నీరు గ్రామాలకు సరఫరా చేయటానికే సరిపోవటంతో కొంత కాలంగా హిందూపురం సమీపంలోని తూముకుంట, గోళ్లాపురం పారిశ్రామిక వాడలకు నీటి సరఫరాను అధికారులు నిలిపి వేశారు. దీంతో పారిశ్రామిక వాడల్లో పరిశ్రమల యజమానులు నీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిశ్రమలు నడవాలంటే లక్షలాది రూపాయల నీటి భారం మోయాల్సిన దుస్థితి నెలకొంది. 

  కొనుగోలు చేయాల్సిందే...

తూముకుంట, గోళ్లాపురం పారిశ్రామిక వాడలో 19 స్టీల్‌ పరిశ్రమలు, 4 వస్త్రపరిశ్రమలు, రెండు భారీ రంగుల పరిశ్రమలు, ఫార్మాకంపెనీలు, విప్రో, విద్యుత్తు స్తంభాల తయారీ దాదాపు 180 పరిశ్రమలు ఉన్నాయి. వీటికి ప్రతి రోజు శ్రీరామరెడ్డి తాగునీటి పథకం ద్వారా ఒక ఎంఎల్‌టీ నీటిని సరఫరా చేయాలి. పేరుకే నీటి సరఫరా కాని ఏ నాడు పూర్తిస్థాయిలో వీరికి ఈ నీరు అందిన దాఖలాలు లేవు. దీంతో స్టీల్, రంగుల పరిశ్రమల వారు ప్రతి రోజూ 10 నంచి 20 ట్యాంకర్ల నీటిని రూ.450 నుంచి రూ.500తో రూ.10 వేల నుంచి రూ.20వేల విలువ చేసే నీటిని కొనుగోలు చేస్తున్నారు. మిగిలిన పరిశ్రమలకు నీటి వినియోగం తక్కువ ఉన్నందున దాదాపు 5 ట్యాకర్ల నీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇది పరిశ్రమల యజమానులకు అద]నపు భారమై నెలకు రూ.6-8 లక్షలకు చేరుకొంటుండటంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ఇతర ఛార్జీలతో సతమతమవుతున్నామని ఇక నీటికి డబ్బు ఎక్కడ నుంచి తీసుకురావాలని, ఇలా అయితే పరిశ్రమలు నడపలేమంటున్నారు.

గోళ్లాపురంలో జోరుగా నీటి వ్యాపారం 

తూముకుంట, గోళ్లాపురం పారిశ్రామిక వాడలో నీరు అందుబాటులో లేదు. పరిశ్రమల వారు బోర్లు వేసినా అందులో ఉప్పునీరు వస్తుండటంతో పరిశ్రమల వారు తప్పని సరిగా నీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీనివల్ల పారిశ్రామిక వాడ సమీపంలోని గోళ్లాపురంలో నీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. ఈ ఒక్క గ్రామంలోనే దాదాపు 150 నీటి ట్యాంకర్లు ఉన్నాయంటే ఎంత మేర వ్యాపారం జరుగుతుందో అర్థమవుతోంది. రైతులు వ్యవసాయానికి వాడాల్సిన నీటిని ప్రస్తుతం పరిశ్రమలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు.  


మరమ్మతులైన వెంటనే సరఫరా 
- శ్రీనివాసులు, డీఈ, శ్రీరామరెడ్డి తాగునీటి పథకం

కళ్యాణదుర్గం పంప్‌హౌస్‌లో నీటిని పంపింగ్‌ చేసే మోటార్లు మరమ్మతులు చేస్తున్నారు. ఈ పని పూర్తి అయిన వెంటనే మోటారు బిగించి తూముకుంట
పారిశ్రామిక వాడకు నీటిని సరఫరా చేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని