logo

అంతా ఏకపక్షమే.. వైకాపాకు కొమ్ముకాసిన కొందరు పోలీసులు!

ఈనెల 13న జరిగిన ఎన్నికల్లో కొందరు పోలీసులు అధికార వైకాపాతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడంతోనే తాడిపత్రిలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయనే విమర్శలు వచ్చాయి.

Updated : 23 May 2024 09:31 IST

తాడిపత్రిలో ఇద్దరికి భారీగా ముడుపులు 
గొడవలపై అధికారులకు సమాచారం ఇవ్వని వైనం
ఈనాడు డిజిటల్, అనంతపురం, న్యూస్‌టుడే, అనంత నేరవార్తలు

నెల 13న జరిగిన ఎన్నికల్లో కొందరు పోలీసులు అధికార వైకాపాతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడంతోనే తాడిపత్రిలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయనే విమర్శలు వచ్చాయి. అధికారపార్టీ నాయకులు గొడవలకు తెగపడతారని ముందుగానే సమాచారం ఉన్నా ఉన్నతాధికారులకు చెప్పకుండా మౌనం పాటించడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా స్పెషల్‌ బ్రాంచి, ఇంటెలిజెన్స్‌ విభాగాలు జిల్లాలో పనిచేస్తున్నాయా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి ఘటనలను ముందుగానే పసిగట్టి ఉన్నతాధికారులను అప్రమత్తం చేయాల్సిన ఆయా విభాగాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయనే విమర్శలు వచ్చాయి. తాడిపత్రిలో ఇద్దరు అధికారులు, ఎస్బీలో ఓ అధికారి నిర్వాకం వల్లే పరిస్థితి ఇంతవరకు వచ్చిందని పోలీసు శాఖలోనే చర్చ నడుస్తోంది. సదరు అధికారులు అధికార వైకాపాతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. 

ఎందుకీ నిర్లక్ష్యం..

తాడిపత్రికి ఫ్యాక్షన్‌ ప్రాంతంగా పేరుంది. ఈ ఐదేళ్లలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మూడేళ్ల కిందట ఏకంగా ఎమ్మెల్యే పెద్దారెడ్డి.. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి ఇంటికి మారణాయుధాలతో వెళ్లి హల్‌చల్‌ చేశారు. అనంతరం జరిగిన రాళ్లదాడిలో చాలామందికి గాయాలయ్యాయి. ఇదేమాదిరిగా పోలింగ్‌ మరుసటి రోజు జరగడం గమనార్హం. ఎమ్మెల్యే పెద్దారెడ్డి తెదేపా నేత సూర్యముని ఇంటికి వెళ్లి దౌర్జన్యానికి దిగడంతో రాళ్ల దాడికి దారి తీసింది. బయట ప్రాంతాలను నుంచి వచ్చిన వందలాది మంది దాడిలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. గొడవలను ముందుగానే పసిగట్టడంలో అధికారులు విఫలమయ్యారు. కనీస సమాచారం కూడా ఉన్నతాధికారులకు ఇవ్వలేదు. ఇదే విషయాన్ని సిట్‌ బృందం తన నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. ముందస్తు సమాచారం లేకపోవడం, సకాలంలో బలగాలను రంగంలోకి దింపకపోవడం వల్లే అల్లర్లు తీవ్రరూపం దాల్చయనే అభిప్రాయాన్ని సిట్‌ అధికారులు వెల్లడించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. తిరుపతి, మాచర్ల ప్రాంతాల్లో జరిగిన అల్లర్లపై బాధ్యులైన పోలీసులపై ఎన్నికల సంఘం చర్యలు చేపట్టంది.. తాడిపత్రి అల్లర్ల నేపథ్యంలో జిల్లా ఎస్పీ, తాడిపత్రి డీఎస్పీ, సీఐపై ఎన్నికల సంఘం సస్పెన్షన్‌ వేటు వేసింది. అల్లర్లపై ముందస్తు సమాచారం సేకరించడంలో పూర్తిగా విఫలమైన స్పెషల్‌ బ్రాంచి, ఇంటెలిజెన్స్‌ అధికారులపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. 

ఇద్దరికి భారీగా ముడుపులు

ఎన్నికల నేపథ్యంలో ప్రలోభాలు సర్వసాధారణంగా మారాయి. ఓటర్లతో పాటు రాజకీయ నాయకులు పోలీసులు, అధికారులకు ఎర వేస్తున్నారు. ఓ రాజకీయ పార్టీతో ముడుపులు అందుకున్న పోలీసులు ఎన్నికల్లో కచ్చితంగా వారి కోసమే పనిచేస్తారు. తాడిపత్రి అల్లర్ల నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ విషయంపై అప్రమత్తం కాలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. తాడిపత్రిలో పనిచేసిన ఇద్దరు అధికారులు వైకాపా ప్రజాప్రతినిధి నుంచి ఎన్నికలకు ముందే భారీగా ముడుపులు తీసుకున్నట్లు సమాచారం. ఓ అధికారి రూ.25 లక్షలు, మరో అధికారి రూ.20 లక్షలు తీసుకుని ఎన్నికల్లో సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం జిల్లా ఉన్నతాధికారులకు ఆలస్యంగా తెలిసినట్లు సమాచారం. అప్పటికే ఈసీ చర్యలకు ఉపక్రమించడంతో ముడుపుల విషయాన్ని అక్కడితో వదిలేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. తాడిపత్రిలో పనిచేస్తున్న కొంతమంది పోలీసులకు కూడా వైకాపా ప్రజాప్రతినిధి నుంచి ముడుపులు అందినట్లు తెలుస్తోంది. అల్లర్లను అదుపు చేసే అవకాశం ఉన్నా ముడుపులు అందుకున్న అధికారులు ఉన్నతాధికారులను పక్కదారి పట్టించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 


అంతులేని ప్రేమ దేనికో.. 

తాడిపత్రిలో అల్లర్లు చెలరేగేందుకు రాజంపేట డీఎస్పీ చైతన్య కూడా ప్రధాన కారణమే. ఆయన తాడిపత్రికి వస్తున్న విషయంపై ఎస్బీలో పనిచేసే అధికారికి తెలిసినా ఎస్పీ అమిత్‌ బర్దర్‌కు దృష్టికి తీసుకెళ్లలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. డీఎస్పీ చైతన్య తాడిపత్రికి ఎలా వచ్చారో తనకు తెలియదని ఎస్పీ స్వయంగా చెపారు. దీని వెనుక ఎస్బీ అధికారి నిర్లక్ష్యం ఉందని పోలీసుశాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. డీఎస్పీ చైతన్య తాడిపత్రిలో పనిచేసినప్పుడు జరిగిన అల్లర్లు, ఆయనపై వచ్చిన ఆరోపణలు తెలిసి కూడా ఉన్నతాధికారులకు ఉద్దేశపూర్వకంగానే సమాచారం ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. విధుల్లో సదరు అధికారి ఎంత నిర్లక్ష్యంగా ఉన్నా ఆయనపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చైతన్యపై ఇంత అంతులేని ప్రేమ ఎందుకో.. అన్న చర్చ పోలీసు శాఖలో జరుగుతోంది.  
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని