logo

‘ఓట్ల లెక్కింపులో సొంత నిర్ణయాలు వద్దు’

ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ అరుణ్‌బాబు అన్నారు.

Published : 25 May 2024 04:18 IST

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ అరుణ్‌బాబు, అధికారులు

పుట్టపర్తి, న్యూస్‌టుడే : ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ అరుణ్‌బాబు అన్నారు. సొంత నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. శుక్రవారం పుట్టపర్తిలోని కలెక్టరేట్‌లో రిటర్నింగ్‌ అధికారులు, సహాయ అధికారులు, అదనపు సహాయ రిటర్నింగ్‌ అధికారులతో తొలి విడత అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓట్ల లెక్కింపు పక్రియలో వివిధ దశల్లో పాటించాల్సిన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెరపై ప్రదర్శించారు. చిన్న పొరపాటుకు కూడా తావు ఇవ్వద్దని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. జిల్లాలో హిందూపురం పార్లమెంటు, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల కౌటింగ్‌ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. హిందూపురం బీట్స్‌ కళాశాలలో హిందూపురం, కదిరి, పెనుగొండ, మడకశిర, లేపాక్షి బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలలో పుట్టపర్తి, ధర్మవరం నియోజకవర్గాల ఓట్లు లెక్కింపు జరుగుతుందన్నారు. ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లను ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతందని, ఉదయం 6 గంటలకే తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకుని అంతా సిద్ధం చేసుకోవాలని సూచించారు. లెక్కింపు కేంద్రంలోకి సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు అనుమతి లేదన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌తో పాటు, ఈవీఎం ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. కౌంటింగ్‌ హాలులో రిటర్నింగ్‌ అధికారులదే సర్వాధికారమని, వారే పూర్తిగా నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. జేసీ అభిషేక్‌కుమార్‌ మాట్లాడుతూ పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులకు పోలైన పోస్టల్‌ బ్యాలెట్‌ వివిధ దశల్లో పరిశీలన చేయాలన్నారు. పారదర్శకంగా ఓట్లు లెక్కింపు ప్రక్రియ జరగాలన్నారు. కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ అపూర్వభరత్, డీఆర్‌ఓ కొండయ్య, రిటర్నింగ్‌ అధికారులు భాగ్యరేఖ, వెంకటశివసాయిరెడ్డి, గౌరీశంకర్, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని