logo

పురంలో కట్టుతప్పిన పట్టణ ప్రణాళిక

హిందూపురం మున్సిపల్‌ పట్టణ ప్రణాళికా విభాగం అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో పని చేస్తూ.. సామాన్యులను వేధించడమే పనిగా, నిబంధనల సాకుతో దండుకోవడమే పరమావధిగా పెట్టుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

Published : 25 May 2024 04:21 IST

అధికార పార్టీ అండతో అవినీతి దందా

పురపాలిక కార్యాలయంలో పట్టణ ప్రణాళికా విభాగం

హిందూపురం, న్యూస్‌టుడే: హిందూపురం మున్సిపల్‌ పట్టణ ప్రణాళికా విభాగం అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో పని చేస్తూ.. సామాన్యులను వేధించడమే పనిగా, నిబంధనల సాకుతో దండుకోవడమే పరమావధిగా పెట్టుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొందరు కౌన్సిలర్ల అండతో ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేసినా పట్టించుకోని అధికారులు, సామాన్యులను సెట్‌ బ్యాక్‌ నిబంధనల పేరుతో వేధిస్తున్నారు. నోటీసులు ఇస్తూ.. ఛార్జీషీట్లు వేసి కోర్టుల్లో కేసు వేస్తున్నారు. భారీ భవంతులు, మాల్స్‌ నిర్వాహకులతో నాయకులు లక్షలాది రూపాయలు దండుకొని.. వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చూస్తున్నారు. నిబంధనల అతిక్రమణ నోటీసు ఇచ్చినా...వాటిని వెనక్కి తీసుకొనేలా చూస్తున్నారు. హిందూపురం పురపాలిక పరిధిలో ఎక్కడ భవన నిర్మాణం జరిగినా కొందరు వైకాపా నాయకులు, ప్రజాప్రతినిధులు... వాటి యజమానుల నుంచి సొమ్ము చేసుకొంటున్నారు.  అధికార పార్టీ నాయకులే మున్సిపల్‌ సిబ్బందిని పంపి నోటీసులు ఇప్పించి... భవన యజమానులను బెదరగొట్టడం, దారికి వస్తే అంతోఇంతో రాబట్టుకొని వదిలేయడం చేస్తున్నారు. కొందరు భవన యజమానులు ప్రశ్నిస్తు ఛార్జీషీట్లు దాఖలు చేసి నిర్మాణాలు నిలిపివేయించి కోర్టులో కేసులు వేస్తున్నారు.

మనోళ్లే.. వదిలేయండి!

పట్టణంలోని 40 మంది భవన యజమానులపై ఛార్జీషీట్లు వేసి కోర్టులో కేసులు వేశారు. మరో 21 మందిపై మాత్రం కరుణ చూపారు. దీని వెనుక అధికార పార్టీ ముఖ్య నాయకుడు జోక్యం చేసుకొని 21 మంది మనవాళ్లని... కోర్టుకు వెళ్లకుండా చూడాలని ఆదేశించారు. దీంతో మున్సిపల్‌ అధికారులు ఛార్జీషీటుకు జత చేయాల్సిన స్థల మార్కెట్‌ విలువను అదే పనిగా తప్పుగా చూపించారు. వాటిని సరిచేసి, మళ్లీ కోర్టులో వేస్తామని 21 ఛార్జీషీట్లను వెనక్కు తీసుకొచ్చారు. మళ్లీ ఇప్పటి దాకా కోర్టులో వేయకపోవడానికి కారణం అధికార పార్టీ ముఖ్య నేత ఆదేశాలేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఒక్కొక్కరికీ ఒక్కో న్యాయమా?

  • వాసవీ ధర్మశాల రోడ్‌లోని ఓ భవంతికి సంబంధించి నిర్మాణంలో నిబంధనలు పాటించలేదని ఆరోపణలు వచ్చాయి. దాని యజమాని అధికార పార్టీ నాయకులతో మాట్లాడుకోవడంతో తరువాత ఎలాంటి చర్యలు లేవు.
  • బాలాజీ టాకీస్‌ రోడ్‌లో ఓ మాల్‌ నిర్మాణానికి సంబంధించి లక్షలాది రూపాయలు చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. అనుమతుల విషయంలో భారీగా దండుకొన్నారు. అవినీతి సొమ్మును పంచుకోవడంలో ఓ మున్సిపల్‌ అధికారికి, నాయకులకు వివాదం తలెత్తి.. కొట్టుకొనే వరకు వెళ్లారు.
  • బైపాస్‌ రహదారిలో నిర్మిస్తున్న ఓ భవంతి అనుమతుల విషయంలో అనుమానాలు ఉన్నాయి. దీన్ని కొందరు కౌన్సిలర్లు గుర్తించారు. లక్షలాది రూపాయలు ఇవ్వాలని యజమానిపై వివిధ రూపాల్లో ఒత్తిడి తెచ్చారు. ఆయన తనకున్న పలుకుబడి ఉపయోగించుకొని అధికార పార్టీలోనే పెద్ద నాయకులతో చెప్పించుకొని బయటపడ్డారు.

నా దృష్టికి రాలేదు

నిబంధనలు ఉల్లంఘించి చేసిన నిర్మాణాలకు నోటీసులు ఇచ్చి కోర్టులో కేసులు వేసిన విషయం టౌన్‌ ప్లానింగ్‌ విభాగం అధికారులు నా దృష్టికి తీసుకురాలేదు. నేను మార్చిలో ఇక్కడకు బదిలీపై వచ్చాను. పట్టణ ప్రణాళిక అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకొంటాం.

 శ్రీకాంత్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్, హిందూపురం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని