logo

ముంచుకొస్తున్న సాగు సమయం

శ్రీసత్యసాయి జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తుండటంతో దుక్కులు చేసే పనిలో అన్నదాతలు నిమగ్నమయ్యారు. ఈనెల 29న విత్తన వేరుసెనగ పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించడంతో రైతు భరోసా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకుంటున్నారు.

Published : 25 May 2024 04:24 IST

ఆర్బీకేలకు చేరని ఎరువులు
అన్నదాతల ఎదురుచూపులు

నల్లచెరువులోని రైతు భరోసా కేంద్రం

కదిరి, బుక్కపట్నం, ముదిగుబ్బ, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తుండటంతో దుక్కులు చేసే పనిలో అన్నదాతలు నిమగ్నమయ్యారు. ఈనెల 29న విత్తన వేరుసెనగ పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించడంతో రైతు భరోసా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకుంటున్నారు. అన్నదాతల అవసరాలు తీర్చేందుకు భరోసా కేంద్రాలను నిర్మించినట్లు వైకాపా ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంది. సలహాలు, సూచనలు ఇచ్చేవారితోపాటు అవసరమైన ఎరువులు, పురుగు మందులు మాత్రం అందుబాటులో లేవని కర్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్‌లో వేరుసెనగ సాగుకు దుక్కి సమయంలోనే ఎరువులు వినియోగిస్తారు. పశువుల ఎరువైతే ముందే పొలంలో వేసి దుక్కి చేస్తారు. తద్వారా భూసారం పెరగటం, నేల గుల్లబారేందుకు దోహదపడుతోంది. సేంద్రియ ఎరువులు కరవైన స్థితిలో రసాయన ఎరువులే రైతులకు ఆధారమయ్యాయి. దీంతో సూపర్‌ పాస్పేట్, డీఏపీ, యూరియా అవసరం ఉంది. ఆర్బీకేల్లో ఎరువులు అరకొరగా ఉన్నాయి. పురుగులు మందులైతే సరఫరాయే లేదని సిబ్బంది చెబుతున్నారు. రైతు భరోసా కేంద్రాలకు ముందస్తుగా నాణ్యత ధ్రువీకరణతో ఎరువులు, పురుగు మందులు సరఫరా చేయాల్సి ఉంటుంది. రైతులు వాటినే అడుగుతున్నా సిబ్బంది నుంచి సరైన సమాధానం లేదు. దీంతో ప్రైవేటు దుకాణాలను ఆశ్రయించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.

  • రైతు భరోసా కేంద్రాలు  416
  • వేరుసెనగ సాగు విస్తీర్ణం 1,74,910 హెక్టార్లు
  • అవసరమైన ఎరువులు 39,378 మెట్రిక్‌ టన్నులు

అవసరమైనవి లేవు

నేను 16 ఎకరాలు కౌలుకు చేస్తున్నా. నాలుగెకరాల్లో వేరుసెనగ సాగు చేశా. ఎనిమిది ఎకరాల్లో విడతల వారీగా దోసపంట వేస్తా. భూదానంపల్లిలోని రైతు భరోసా కేంద్రంలో అవసరమైన ఎరువులు అందుబాటులో లేవు. ముదిగుబ్బకు వెళ్లాలంటే 30 కి.మీ.దూరం ఉంది. బత్తలపల్లిలోని ఎరువుల దుకాణంలో డీఏపీ, 12:12:24, 10:26:26, 0:0:23 రకాలను రూ.20 వేలతో కొనుగోలు చేశా. రవాణా ఖర్చు రూ.3 వేలు అయింది.

చంద్రశేఖర్‌రెడ్డి, రైతు, చిన్నకోట్ల

ఇంతవరకు ఇవ్వలేదు

మారాలలో రైతు భరోసా కేంద్రం ఉంది. ఇప్పటి వరకు ఎలాంటి ఎరువులు అందుబాటులో లేవు. వేరుసెనగ, వరి సాగు చేస్తున్నా. స్థానికంగా ఎరువులు, మందులు ఎప్పుడూ ఇవ్వలేదు. ఎరువులు ఏవైనా కావాలంటే పాముదుర్తి, ముదిగుబ్బకు వెళ్లక తప్పటంలేదు. గ్రామంలోనే అందుబాటులో ఉంచితే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. 

నాగరాజు, రైతు, మారాల

నిల్వ సమస్యతోనే...

జిల్లాలో వేరుసెనగ సాగు రైతులకు అవసరమైన ఎరువుల కోసం నివేదికలు పంపాం. కావాల్సిన ఎరువులను రైతు భరోసా కేంద్రాలకు సరఫరా చేస్తాం. ప్రస్తుతం విత్తన పంపిణీ జరుగుతోంది. ఆర్బీకేల్లో విత్తనం ఉండటంతో ఎరువులను అక్కడే నిల్వ చేస్తే సమస్య వస్తుంది. అందుకే వేరుసెనగ విత్తన పంపిణీ తర్వాత ఎరువులను రైతులకు అందిస్తాం. అవసరాన్ని బట్టి పురుగు మందులు ఇస్తాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

 సుబ్బారావు, జిల్లా వ్యవసాయాధికారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని