logo

విద్యుత్తు సమస్యలు కోకొల్లలు..ఏవీ ముందస్తు చర్యలు?

ఇటీవల ఉమ్మడి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గాలులు వీస్తూ కురిసిన వర్షం ధాటికి పెద్ద ఎత్తున స్తంభాలు నేలకొరిగాయి.

Published : 25 May 2024 04:25 IST

జిల్లా పశు సంవర్ధకశాఖ కార్యాలయం వద్ద విద్యుత్తు తీగలపై పడిన కొమ్మలు

అనంతపురం(విద్యుత్తు), వ్యవసాయం, నార్పల, న్యూస్‌టుడే: ఇటీవల ఉమ్మడి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గాలులు వీస్తూ కురిసిన వర్షం ధాటికి పెద్ద ఎత్తున స్తంభాలు నేలకొరిగాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా ఆగిపోయింది. విద్యుత్తుశాఖకు రూ.లక్షల్లో నష్టం వచ్చింది. ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన విద్యుత్తు అధికారులు, ఉద్యోగులు కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వర్షాకాలం ప్రారంభం కాకముందే తమ సెక్షన్‌ పరిధిలో శిథిలావస్థకు చేరిన స్తంభాలు, వేలాడుతున్న తీగలను ఎప్పటికప్పుడు గుర్తించి మార్చేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులు సమస్యలు తలెత్తినపడు మినహా మిగతా సమయాల్లో తమకు కేటాయించిన ప్రాంతాలను పరిశీలించడం లేదు. లైన్లపై చెట్లు పెరిగినప్పుడు ముందస్తుగా గుర్తించి తీగలపై వెళుతున్న కొమ్మలను తొలగింపు చేపట్టడం లేదు. కొత్త విద్యుత్తు స్తంభాలను కూడా సిమెంట్‌ కాంక్రీ¨ట్‌ వేసి ఏర్పాటు చేయకుండా తూతూ మంత్రంగా ఏర్పాటు చేయడంతో పటిష్టత లేక చిన్నపాటి గాలివీచినా విరిగి పడుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి.

  • అనంతపురం పశు సంవర్ధకశాఖ కార్యాలయం వద్ద చెట్టుకొమ్మలు విద్యుత్తు లైన్‌పై విరిగిపడటంతో లైన్‌కిందకు వచ్చి ప్రమాదకరంగా మారింది. కనీసం విద్యుత్తు ఉద్యోగులు లైన్‌పై పడిన చెట్టుకొమ్మలు తొలగించి లైన్‌ను సరిచేసేందుకు చర్యలు చేపట్టలేదు.
  •  నార్పల సమీపాన పాలిటెక్నిక్‌ కళాశాల సమీపంలో ఒక ప్రైవేట్‌ స్కూల్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆవరణలో విద్యుత్తు లైన్‌ వెళుతుండగా ఇందుకు ఏర్పాటు చేసిన స్తంభాల్లో కొన్ని పక్కకు ఒరిగిపోయాయి. ఓ స్తంభం కూలేందుకు సిద్ధంగా ఉంది. అవి వాలి కిందపడి.. ప్రమాదాలు జరిగి మనుషులు, మూగజంతువులు ప్రాణాలు కోల్పోయినపుడే విద్యుత్తు ఉద్యోగులు కాస్త స్పందిస్తున్నారు. లేకుంటే అసలు పట్టించుకోలేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
  •  పలుమార్లు తమ ప్రాంతాల పరిధిలో స్తంభాలు పడిపోయే స్థితిలో ఉన్నాయని, లైన్లు కిందికి వచ్చి ప్రమాదకరంగా ఉన్నాయని ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవటం లేదని రైతులు, ప్రజలు వాపోతున్నారు. సమస్యల్ని అనంతపురం టౌన్‌ డివిజన్‌ ఈఈ జె.వి.రమేశ్‌ దృష్టికి తీసుకెళ్లగా ఉద్యోగులను క్షేత్రస్థాయికి పంపి సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడించారు. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని