logo

అత్యవసర వాహనాలకు అరిగిన టైర్లు

అత్యవసర వాహన సేవల 108కు ప్రజల్లో ఆదరణ ఉన్నా పాలకుల నిర్లక్ష్యం కారణంగా సేవల్లో లోపాలు తలెత్తుతున్నాయి.

Published : 25 May 2024 04:27 IST

రోగుల తరలింపులో భద్రత డొల్ల
సిబ్బందికి తప్పని ఇబ్బందులు

పంక్చరైన వాహనం

చెన్నేకొత్తపల్లి, న్యూస్‌టుడే: అత్యవసర వాహన సేవల 108కు ప్రజల్లో ఆదరణ ఉన్నా పాలకుల నిర్లక్ష్యం కారణంగా సేవల్లో లోపాలు తలెత్తుతున్నాయి. వాహనం మంచి కండీషన్‌లో ఉండి.. టైర్లు ఇతరత్రా సక్రమంగా ఉంటేనే అత్యవసర పరిస్థితిల్లో రోగులకు సరైన సేవలు అందుతాయి. ప్రమాద, ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారిని వేగంగా ఆస్పత్రులకు చేర్చి ప్రాణాపాయం నుంచి కాపాడగలిగే అవకాశం ఉంటుంది. టైర్లు సక్రమంగా లేకపోవడం, వాహనం కండీషన్‌లో లేకుండా ఉంటే.. ఎక్కడి వరకు వాహనం వెళ్తుందోనన్న బెంగ అనుక్షణం వెంటాడుతుంది. ఈ కోవల్లో ఇటు సిబ్బందికి, అటు రోగులకు ప్రాణసంకటం ఎదురవుతోంది.  
ః అనంత ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రెండు నియోనేటల్‌ వాహనాలతో కలిపి 66 వాహనాలు ఉన్నాయి. అందులో 40 నుంచి 45 వాహనాలకు స్టెఫ్నీ టైర్లు అందుబాటులో లేవు. వాహనం ఎక్కడైనా ఆగితే దుకాణాల కోసం వెతుక్కుంటూ వెళ్లి పంక్చర్‌ వేయించుకోవాల్సిన దుస్థితి. మారుమూల గ్రామాల్లో వాహనం పంక్చర్‌ అయితే సిబ్బంది పరిస్థితి ఆగమ్యగోచరమే.

 చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని అత్యవసర వాహనం ఇటీవల పంక్చర్‌ కావడంతో దారి పక్కన ఆపేశారు. స్టెఫ్నీ అందుబాటులో లేక అదే టైరుకే పంక్చర్‌ వేయించి వాహనాన్ని తీసుకెళ్లారు. దుకాణం దగ్గరలో లేకపోవడంతో సిబ్బంది గ్రామ శివారుకెళ్లి చేయించుకువచ్చారు. ఇందుకు గంట సమయం పట్టింది. ఇలాంటి సందర్భంలో ఎవరికైనా అత్యవసన పరిస్థితి తలెత్తితే ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.  

వేల కిలోమీటర్లు తిరిగినా..

సాధారణంగా అత్యవసర వాహనాలు రోగులను తరలించే సమయంలో వారి ఆరోగ్య స్థితిని బట్టి ఒక్కోసారి 100, 120 కి.మీ వేగంతో ప్రయాణించాల్సి ఉంటుంది. అత్యవసర వాహనాలకు మైలేజ్‌తో సంబంధం లేకుండా టైర్లు కొంత అరిగిన వెంటనే మార్చాలి. 108 వాహనాల్లోని టాటా వింగర్‌ వాహనాలు లక్షపై పైగా కి.మీ తిరిగినా టైర్లు మార్చడం లేదని తెలుస్తోంది. ఫోర్స్‌ వాహనాలు 1.30 లక్షల కి.మీ వరకు తిప్పుతున్నట్లు సమాచారం. ఇన్ని కి.మీ తిరుగుతున్నప్పటికీ మరింత మైలేజీ తీసుకురావాలని సిబ్బందిపై సంస్థ అధికారులు ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. టెర్లలోని ఇనుప తీగలు బయటకు వస్తున్నా అలానే వాహనాలను తిప్పుతున్నారు. ఇలాంటి వాహనాలలో రోగుల భద్రత ఎంత? అనే సందేహం కలుగుతోంది. 

టైర్లు వచ్చాయి.. అవసరమైన వాటికి అందిస్తాం..

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 64 అత్యవసర వాహనాలు, రెండు నియోనేటల్‌ వాహనాలు సేవలు అందిస్తున్నాయి. టైర్ల సమస్యలు రాక మునుపే ఇండెంట్‌ పంపుతున్నాం. టైర్లు వచ్చిన వెంటనే వాహనాలకు అందిస్తున్నాం. ప్రస్తుతం 64 టైర్లు వచ్చాయి. సమస్యలున్న వాటన్నింటికీ వేయిస్తాం.

 సంజీవరెడ్డి, అత్యవసర వాహన సేవల ఉమ్మడి జిల్లా మేనేజర్‌
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు