logo

జడ్పీ సర్వసభ్య సమావేశం.. నిర్వహణపై అయోమయం

జిల్లా ప్రజాపరిషత్తు సర్వసభ్య సమావేశం, స్థాయి సంఘ సమావేశాల నిర్వహణపై అయోమయం నెలకొంది.

Published : 25 May 2024 04:32 IST

తపోవనం (అనంత గ్రామీణం), న్యూస్‌టుడే: జిల్లా ప్రజాపరిషత్తు సర్వసభ్య సమావేశం, స్థాయి సంఘ సమావేశాల నిర్వహణపై అయోమయం నెలకొంది. ఈ సమావేశాల నిర్వహణలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. పంచాయతీరాజ్‌ చట్టాన్ని తుంగలో తొక్కి పరిపాలన కొనసాగించడం అనేక విమర్శలకు తావిస్తోంది.

ఒక సర్వసభ్య సమావేశానికి మరో సమావేశానికి 90 రోజుల వ్యవధి దాటకూడదు. అలా దాటినపుడు ఉన్నతాధికారుల అనుమతి తీసుకుని సమావేశం నిర్వహించాలి. అలా చేయకుంటే పాలకవర్గ ఉనికి ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఉంటుంది. సమావేశాల నిర్వహణలో అధికారులు నిబంధనలు పాటించకుంటే క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. రెండున్నరేళ్లలో ఒక్కసారి కూడా నిబంధనల ప్రకారం సమావేశం నిర్వహించని పరిస్థితి చోటుచేసుకుంది.

జడ్పీ పరిపాలనను సంస్కరించాలని సీఈఓలుగా ఐఏఎస్‌లను నియమించినా పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది ఆగస్టు 26న సర్వసభ్య సమావేశం జరిగింది. అప్పటినుంచి ఐదు నెలల తర్వాత అంటే ఈ ఏడాది జనవరి 17న మరో సమావేశం జరిగింది. సమావేశాల అంతరం వ్యవధి ఎక్కువగా ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. జనవరి నుంచి నాలుగు నెలలు గడిచినా ఇంకా సమావేశానికి ముహుర్తం కుదరలేదు. ఫిబ్రవరి చివరిలో స్థాయి సంఘ సమావేశాలను పాలకవర్గ సభ్యులే వాకౌట్‌ చేశారు. స్థాయి సంఘ సమావేశాలు జరిగినట్లుగా జడ్పీటీసీ సభ్యులతో సంతకాలు ప్రస్తుతం సేకరించడం వివాదాస్పదంగా మారింది. సాధారణంగా సర్వసభ్య, స్థాయి సంఘ సమావేశాల నిర్వహణకు సంబంధించి సీఈఓ ఛైర్‌పర్సన్‌తో చర్చించి తేదీలను ఖరారు చేయాలి. సీఈఓ నిదియాదేవి ఐఏఎస్‌ కావడంతో ఛైర్‌పర్సన్‌ బి.గిరిజమ్మతో సమావేశాలపై చర్చించడానికి రావడం లేదని పాలకవర్గ సభ్యులు అంటున్నారు. సమావేశాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్నా జడ్పీ సర్వసభ్య సమావేశాలు నిర్వహించడానికి వెసులుబాటు ఉంది. ఎలాంటి తీర్మానాలు లేకుండా సమావేశాలు నిర్వహించవచ్చు.

కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా..

సమావేశాల నిర్వహణ, నిధుల దుర్వినియోగం, ఇద్దరు ఉప సీఈఓల వ్యవహారంపై ఛైర్‌పర్సన్‌ బి.గిరిజమ్మ ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. నాలుగు నెలలు గడిచినా ఇప్పటివరకు సర్వసభ్య సమావేశం నిర్వహించలేదని ఆమె కలెక్టర్‌కు వివరించారు. జడ్పీ ఉప సీఈఓగా ఉన్న లలితాబాయిపై విచారణ కూడా జరిపించాలని విన్నవించారు.

సర్వసభ్య సమావేశ తేదీలు ఇంకా ఖరారు కాలేదు.  ఖరారు చేయడానికి సీఈఓ నిదియాదేవి తనతో చర్చించలేదని జడ్పీ ఛైర్‌పర్సన్‌ బి.గిరిజమ్మ వివరించారు. సమావేశాల నిర్వహణలో కీలకపాత్ర పోషించాల్సిన సీఈఓ అసలు పట్టించుకోలేదని ఆమె వాపోయారు. పంచాయతీరాజ్‌ ఉన్నతాధికారులు స్పందించి గతంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని