logo

వేగానికి కళ్లెమేదీ.. శోకానికి అంతమేదీ?

ఉమ్మడి అనంతపురం జిల్లాలో రహదారి ప్రమాదాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం జిల్లాలో ఎక్కడో ఒకచోట మృత్యువాత పడుతూనే ఉన్నారు.

Updated : 25 May 2024 06:17 IST

 ఐదు నెలల్లోపే రోడ్డు ప్రమాదాల్లో 136 మంది మృత్యువాత
ఈ నెలలోనే 20 మంది దుర్మరణం
అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే

ఉమ్మడి అనంతపురం జిల్లాలో రహదారి ప్రమాదాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం జిల్లాలో ఎక్కడో ఒకచోట మృత్యువాత పడుతూనే ఉన్నారు. మరణాల కంటే రెట్టింపు సంఖ్యలో క్షతగాత్రులవుతున్నారు. వీరిలో చాలా మంది శాశ్వత వికలాంగులుగా మారుతున్నారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అప్పటి వరకూ హాయిగా సాగిన జీవితాలు ఒక్కసారిగా ఛిన్నాభిన్నమవుతున్నాయి. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న బ్లాక్‌స్పాట్లను గుర్తిస్తున్నా, పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో దుర్ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఐదు నెలల్లోపే 136 మంది మృత్యువాత పడగా, 249 మంది క్షతగాత్రులయ్యారు.

నిద్రలేమి, అతివేగం..

వందల కిలోమీటర్లు ప్రయాణించి సరకును కానీ, ప్రయాణికులను గానీ గమ్యస్థానానికి చేర్చే డ్రైవర్లకు నిద్ర చాలా అవసరం. నిద్రలేమి వల్ల మెదడు మొద్దుబారి వెంట వెంటనే నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గుతుంది. దీనివల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఈ నెల 18న గుత్తి మండలం బాటలో సుంకులమ్మ ఆలయం సమీపంలో 44వ రహదారిపై హైదరాబాద్‌ నుంచి అనంతపురం వస్తున్న ఓ కారు డివైడర్‌ను ఢీకొని ఎగిరి అవతల రోడ్డులో పడటంతో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో అనంతపురం నగరానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదానికి అతి వేగం, నిద్రలోకి జారుకోవడమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

వెనుక నుంచి ఢీకొట్టేవీ ఎక్కువే..

జిల్లాలో జాతీయ రహదారులపైనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా 44వ, 42, 67, 344డీ, 344డీడీ, గుత్తి నుంచి తాడిపత్రి, పెనుకొండ నుంచి హిందూపురం, పాలవెంకటాపురం నుంచి పుట్టపర్తి రహదారులపై తరచూ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. హైవే మీద నుంచి సర్వీస్‌ రోడ్లపై మలుపు తిరిగే క్రమంలో వాహనాలు అతివేగంతో ఢీ కొడుతున్నాయి. కొన్నైతే కనీసం ఆగకుండా వెళ్లిపోతున్నాయి. ఇలా వెనుక నుంచి లారీలు, కార్లు, ఇతర వాహనాలు ఢీకొనడం వల్ల ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయిన ద్విచక్ర వాహనదారులు, పాదచారులు చాలామంది ఉన్నారు.

 ఈ నెల 21న అనంతపురం గ్రామీణంలోని 344డీడీ హైవేపై కురుగుంట వద్ద ఓ గుర్తు తెలియని వాహనం వేగంగా, నిర్లక్ష్యంగా వెళ్తూ రెండు వాహనాలను ఢీకొట్టి వెళ్లింది. ఈ ఘటనలో కామారుపల్లికి చెందిన యువకుడు వంశీ దుర్మరణం చెందాడు. ఈ నెల 8న చిలమత్తూరు కోడూరు తోపు వద్ద అనంతపురం నుంచి బెంగళూరు వైపునకు వెళ్తున్న కారు రోడ్డు దాటుతున్న బాటసారిని ఢీకొట్టడంతో మృతి చెందాడు. 4న డి.హీరేహాళ్‌ మండలం ఎం.హనుమాపురం వద్ద బెంగళూరు..బళ్లారి హైవేపై ఓబుళాపురం వద్ద నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా తిప్పేస్వామి దుర్మరణం చెందాడు. 3న పెద్దవడుగూరు మండలం అప్పేచెర్ల వద్ద 67వ హైవేపై బొలెరో వాహనం వేగంగా వెనుక నుంచి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టగా మహమ్మద్‌ షఫీ మృత్యువాత పడ్డాడు.

బ్లాక్‌స్పాట్లు తగ్గినా..

ఉమ్మడి జిల్లాలో గతంలో 81 బ్లాక్‌ స్పాట్లు ఉండేవి. కొన్ని నివారణ చర్యల తర్వాత ఆ సంఖ్య 55కు తగ్గింది. మిగిలిన చోట్ల ప్రమాదాలు జరగడానికి కారణం నిర్లక్ష్యం, అతివేగమే కారణమని తెలుస్తోంది. బ్లాక్‌ స్పాట్లు ఉన్న చోటే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ ఇటీవల ప్రమాదాలు ఎక్కువయ్యాయి. హైవేల మీదే కాకుండా మండల, గ్రామాలను కలిపే రహదారులపై కూడా జరుగుతున్నాయి. వీటిలో తెల్లవారు జామున, రాత్రివేళల్లో ద్విచక్ర వాహనాల్లో వెళ్లేవారే నిర్లక్ష్యంగా నడిపి నిండు ప్రాణాలను కోల్పోతున్నారు.

మలుపులో నిద్రమత్తులో..

ఈ నెల 14న ఆమడగూరు మండలం వెంకటనారాయణ పల్లి వద్ద మలుపులో నిద్రమత్తులో కంటైనర్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యంగా నడపడంతో వాహనం బోల్తా పడి డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ముదిగుబ్బ మండలం రాళ్ల అనంతపురం సమీపంలో  ద్విచక్ర వాహనాన్ని అతి వేగంగా వెళ్తున్న ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో యువకుడు రఫీ మరణించాడు.

స్పీడ్‌ గన్‌లు ఎక్కడ ?

వేగం వల్లే అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులే చెబుతున్నారు. అలా వెళ్లే వాటిని గుర్తించి, వెంటనే చర్యలు తీసుకునేలా స్పీడ్‌గన్‌ల ఏర్పాటులో విఫలమవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 44వ జాతీయ రహదారి వెళ్తోంది. ఇది 150 కిలోమీటర్లు విస్తరించి ఉండగా, కేవలం రెండు స్పీడు గన్నులు ఉన్నాయి. అవి కూడా సక్రమంగా వినియోగంలో లేవు.

 గతంలో రోడ్ల పక్కన వేగాన్ని కొలిచే సాధనాలతో కూడిన వాహనాలుండేవి. ఇప్పుడు వాటి సంఖ్య తగ్గింది. రోడ్లపైనా శాశ్వత స్పీడ్‌గన్‌లు సరిపడా లేవు. ఉద్దేశపూర్వకంగా లేదా మద్యం మత్తులో అతి వేగంగా వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నా.. వారిని ముందస్తుగా గుర్తించలేకపోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని