logo

పూడిక తీయరు.. మరమ్మతులు చేయరు

ఉమ్మడి జిల్లా వరప్రదాయినిగా భావించే తుంగభద్ర-ప్రధాన ఎగువ కాలువ(టీబీ హెచ్చెల్సీ) దయనీయ దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ప్రధాన కాలువతోపాటు ఉప కాలువల నిర్వహణ దారుణంగా ఉంది.

Published : 25 May 2024 04:42 IST

సాగునీటి ప్రవాహానికి అడ్డంకులు
నిర్వహణ లేక రూపు కోల్పోతున్న హెచ్చెల్సీ
అనంతపురం (శ్రీనివాస్‌నగర్‌), న్యూస్‌టుడే

అనంతపురం: ఎస్‌ఎస్‌ ట్యాంకు సమీపంలో రూపు కోల్పోయిన కాలువ

మ్మడి జిల్లా వరప్రదాయినిగా భావించే తుంగభద్ర-ప్రధాన ఎగువ కాలువ(టీబీ హెచ్చెల్సీ) దయనీయ దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ప్రధాన కాలువతోపాటు ఉప కాలువల నిర్వహణ దారుణంగా ఉంది. జూన్‌ ఆరంభంతోనే 2024-25 నీటి సీజన్‌ మొదలు కానుంది. ఉమ్మడి జిల్లాలో పలు ప్రాంతాల గుండా వెళ్లే కాలువల నిర్వహణ అటకెక్కింది. అక్కడక్కడ.. ఉపాధి హామీ పథకం కింద గట్టున ఉండే ముళ్లకంపను తొలగించారు. అత్యధిక శాతం కాలువల్లో పూడిక పేరుకుపోయింది. గట్లన్నీ శిథిలావస్థకు చేరాయి. గతంలో కురిసిన వర్షాలకు ప్రధాన గట్లు కోతకు గురయ్యాయి. చెత్తాచెదారం పేరుకుపోయి డంపింగ్‌ యార్డును తలపిస్తున్నాయి. ఇంతటి దయనీయ దుస్థితిలో నీటి ప్రవాహం సాఫీగా సాగే పరిస్థితి లేదు. తక్కువ జలాలు కేటాయించినా వేగంగా ముందుకు పారే పరిస్థితి ఉండదు. ఇన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నా... రాష్ట్ర ప్రభుత్వం నయాపైసా కేటాయించలేదు.

హెచ్చెల్సీ కార్యాలయం సమీపాన కాలువ గట్టు దుస్థితి

అటకెక్కిన ఆధునికీకరణ

హెచ్‌ఎల్‌సీ ప్రధాన, ఎమ్పీఆర్‌ దక్షిణ, ఉత్తర కాలువల ఆధునికీకరణ పనులకు వైకాపా ప్రభుత్వం పాతరేసింది. గతంలో జరిగిన పనులన్నీ ఆపేసింది. మరమ్మతు, లైనింగ్, గట్లు పటిష్టత, వంతెనల నిర్మాణం.. తదితర పనులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. గడిచిన ఐదేళ్లలో నయాపైసా కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. నీటి సీజన్‌ మొదలు కానుంది. ఈలోపు ఎక్కడైనా చిన్నపాటి మరమ్మతులు, చెత్తాచెదారం, ముళ్లకంప తొలగింపు, పూడికతీత.. వంటి పనులు చేయించలేదని దుస్థితి నెలకొంది. దీంతో నీటి ప్రవాహం సాఫీగా పరిస్థితి లేదు. అనంత నగరం గుండా వెళ్లే ఎమ్పీఆర్‌ దక్షిణ కాలువ రూపు కోల్పోతోంది. దాదాపు పది కి.మీ. ఉండే కాలువ  దారుణంగా మారింది.

1.93 లక్షల ఎకరాలు

హెచ్చెల్సీ కింద 12 రకాల కాలువలు ఉండగా.. ఉమ్మడి అనంత జిల్లా పరిధిలో తొమ్మిది ఉన్నాయి. హెచ్‌ఎల్‌సీ ప్రధాన కాలువ, ఎమ్పీఆర్‌ కింద దక్షిణ, ఉత్తర, తాడిపత్రి ఉప కాలువ (టీబీసీ), గుంతకల్లు ఉప కాలువ (జీబీసీ), గుత్తి ఉప కాలువ (జీఎస్‌బీసీ)తోపాటు... పీఏబీఆర్‌ కుడి కాలువ, ధర్మవరం ఉప కాలువ (డీబీసీ), బి.పప్పూరు కాలువ ఉన్నాయి. వాటి పొడువు మొత్తం 520.49 కి.మీ.కాగా ఆయకట్టు 1,92,749 ఎకరాలు.

ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సి ఉంది

గ్రామీణ ప్రాంతాల్లోని కాలువలకు సంబంధించి నిర్వహణను ఉపాధి హామీ పథకం నిధులతో చేయిస్తున్నాం. కొన్ని చోట్ల పనులు మొదలయ్యాయి. పట్టణ ప్రాంతాల పరిధిలో ఉండే కాలువలకు ప్రభుత్వం నుంచి నిధులు రాలేదు. దీంతో మరమ్మతులు, నిర్వహణ పనులు చేపట్టలేకపోయాం. ప్రభుత్వం నిధులు ఇస్తే తప్ప పనులు చేసే పరిస్థితి లేదు.

 రమణారెడ్డి, ఈఈ, హెచ్చెల్సీ లోకలైజేషన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని