logo

కొర్రపాడు గురుకులంలో అక్రమాలు!

బుక్కరాయసముద్రం మండల పరిధిలోని కొర్రపాడులో ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ బాలికల గురుకుల పాఠశాలలో అక్రమాలు జరుగుతున్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

Published : 08 Dec 2023 04:04 IST

సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్‌

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే: బుక్కరాయసముద్రం మండల పరిధిలోని కొర్రపాడులో ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ బాలికల గురుకుల పాఠశాలలో అక్రమాలు జరుగుతున్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇక్కడ 5 నుంచి 10వ తరగతి వరకూ 480 మందికిపైగా విద్యార్థినులు చదువుకుంటున్నారు. కొన్ని నెలల క్రితమే నూతనంగా నిర్మించిన భవనాల్లోకి గురుకుల పాఠశాలను మార్చారు. అప్పటి నుంచి అక్రమాలు జరుగుతున్నాయంటూ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ నాయకులు ఆరోపిస్తూ పలుమార్లు ఆందోళనలు చేశారు. ఈ విషయంపై సోమవారం స్పందనలో విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ జిల్లా నాయకుడు చిన్నఆంజనేయులు, కుమార్తెతో కలిసి కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. తమ పిల్లలను ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్‌ వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థులతో మసాజ్‌ చేయించుకున్నట్లు ఉన్న వీడియోలు, సామగ్రి వాహనాల్లో బయటకు తరలిస్తున్న చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దాంతో విద్యాలయం నిర్వహణపై, విద్యార్థినుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ప్రిన్సిపల్‌ విజయలక్ష్మిని వివరణ కోరగా విద్యాలయంపై వస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ఉపాధ్యాయురాలు విద్యార్థులతో మసాజ్‌ చేయించుకున్నట్లు ఉన్న వీడియోపై ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు. నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాలలో వృథా సామగ్రిని బయట విక్రయించి వచ్చిన డబ్బును పాఠశాల ఖాతాలో జమ చేశామని తెలిపారు. విద్యార్థినులకు మెరుగైన విద్య, వసతి కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని