logo

వైకాపా కార్యకర్తపై అట్రాసిటీ కేసు

చెన్నేకొత్తపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో విధి నిర్వహణలో ఉన్న వీఆర్వో లోకేశ్‌పై దాడి చేసిన సోమశేఖర రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీధర్‌ పేర్కొన్నారు.

Published : 08 Dec 2023 04:06 IST

చెన్నేకొత్తపల్లి, న్యూస్‌టుడే: చెన్నేకొత్తపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో విధి నిర్వహణలో ఉన్న వీఆర్వో లోకేశ్‌పై దాడి చేసిన సోమశేఖర రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీధర్‌ పేర్కొన్నారు.  చెన్నేకొత్తపల్లి గ్రామ సచివాలయం-2 లో విధులు నిర్వహిస్తున్న వీఆర్వో లోకేశ్‌తో భూమి మ్యుటేషన్‌ విషయంలో గొడవపడి దాడి చేశాడన్నారు. జరిగిన సంఘటనపై వీఆర్వో లోకేశ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. నిందితుడిపై అట్రాసిటీ, ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించారనే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వివరించారు.


మహిళలపై అసభ్య పదజాలం.. ముగ్గురి అరెస్టు

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: సోషల్‌ మీడియాలో మహిళలపై అసభ్యంగా మాట్లాడిన పెద్దపప్పూరు మండలం వరదాయపల్లికి చెందిన యువకులు వెంకటేశ్వర్లు, బాలయ్య, రవిలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 5న ముగ్గురు కలిసి నార్పల మండలం మద్దలపల్లి జాతరకు వెళ్లారు. మద్యం తాగి మహిళలపై అసభ్యంగా మాట్లాడారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీనిపై ఎస్పీ అన్బురాజన్‌ స్పందించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపాలని ఆదేశించారు.


కలుషిత నీటితో 15 మందికి అస్వస్థత

పామిడి: పట్టణంలోని బెస్త, దర్గా వీధుల్లో నివాసముంటున్న 15 మంది వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వారిని చికిత్స నిమిత్తం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. విషపూరిత ఆహారం తినడం లేదా కలుషిత నీటిని తాగడంతో అస్వస్థతకు గురై ఉంటారని స్థానికులు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. 5 రోజుల కిందట దోమల నివారణకు ఫాగింగ్‌ పొగ వదిలారు. ఈ పొగ వెంట పిల్లలు ఆడుకునేందుకు వెళ్లారు. అప్పటినుంచి వాంతులు, విరేచనాలు అయ్యాయని కొందరు అనుమానిస్తున్నారు. నీళ్ల ట్యాంకులో కోతులు పడటంతో కలుషితమైన నీటిని తాగి అస్వస్థతకు గురైనట్లు సామాజిక మాధ్యమాల్లో వదంతులు వ్యాపించాయి. ఈ విషయంపై పామిడి పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్‌ను వివరణ కోరగా.. 15 రోజుల కిందట నీళ్ల ట్యాంకును శుభ్రపరిచినట్లు తెలిపారు. ట్యాంకులో కోతులు చనిపోయిన విషయం అవాస్తమని చెప్పారు.


తాడిపత్రి సీఐ హమీద్‌ఖాన్‌పై విచారణ

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే : తాడిపత్రి పట్టణ సీఐ హమీద్‌ఖాన్‌పై సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండటంపై జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ స్పందించారు. యువకుడు రామగుర్రయ్యకు కరెంట్‌ షాక్‌ ఇచ్చిన ఘటనపై విచారించేందుకు అదనపు ఎస్పీ విజయభాస్కర్‌రెడ్డిని, శిక్షణ డీఎస్పీ హేమంత్‌కుమార్‌లను ఎస్పీ నియమించారు. లోతుగా విచారించిన తర్వాత సీఐ హమీద్‌ఖాన్‌ ఏదైనా తప్పు చేసినట్లు వెల్లడైతే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని