logo

తెదేపా కార్యక్రమాల్లో పాల్గొంటావా.. ఇంటి పట్టా ఇచ్చేయ్‌..

తెదేపా కార్యకర్త ఒకరు ఆ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండటం వైకాపా నాయకులకు మింగుడు పడలేదు. దాంతో వాలంటీరును సదరు కార్యకర్త ఇంటికి పంపి ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి పట్టాను వెనక్కి ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేశారు.

Published : 08 Dec 2023 04:29 IST

లబ్ధిదారులకు వాలంటీరు హుకుం

యాడికి, న్యూస్‌టుడే: తెదేపా కార్యకర్త ఒకరు ఆ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండటం వైకాపా నాయకులకు మింగుడు పడలేదు. దాంతో వాలంటీరును సదరు కార్యకర్త ఇంటికి పంపి ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి పట్టాను వెనక్కి ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేశారు. ఈ ఘటన యాడికి మండలం రాయలచెరువులో గురువారం చోటుచేసుకుంది. స్థానిక ఉన్నత పాఠశాల సమీపంలో రాజకుళ్లాయప్ప, శ్రీలక్ష్మీ దంపతులు అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరికి ప్రభుత్వం ఇంటి పట్టా మంజూరు చేసింది. కొంత కాలంగా రాజకుళ్లాయప్ప తెదేపా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఇది స్థానిక వైకాపా నాయకులకు నచ్చలేదు. దాంతో ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టా వెనక్కి తీసుకురావాలని వాలంటీరును పంపారు. అతడు లబ్ధిదారుల వద్దకు వెళ్లి పట్టా ఇవ్వాలని అడిగాడు. ఎందుకు ఇవ్వాలని లబ్ధిదారులు ప్రశ్నించడంతో స్పష్టమైన సమాధానం చెప్పలేక వాలంటీరు వెనుదిరిగి వెళ్లాడు. ఈ విషయాన్ని బాధితుడు తెదేపా నాయకులకు తెలిపాడు. కులం చూడం.. మతం చూడం.. పార్టీ చూడం.. అందరికీ సమన్యాయం అంటూ చెబుతున్న సీఎం జగన్‌ ఉపన్యాసాలు ఇవేనా అంటూ తెదేపా నాయకులు విమర్శించారు. దీనిపై రాయలచెరువు గ్రామ కార్యదర్శి అరుణ్‌ వివరణ కోరగా.. తాను సెలవులో ఉన్నానని, తాము ఎవరికీ పట్టా వెనక్కు తీసుకురావాలంటూ చెప్పలేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని