logo

కదం తొక్కిన ఆశా కార్యకర్తలు

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ ప్రతిపక్ష నేత హోదాలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ.. గురువారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు అనంత కలెక్టరేట్‌ను ముట్టడించారు.

Published : 08 Dec 2023 04:34 IST

అనంత కలెక్టరేట్‌ ముట్టడి

కలెక్టరేట్‌ ముందు బైఠాయించి నిరసన

అనంతపురం(శ్రీనివాస్‌నగర్‌), న్యూస్‌టుడే: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ ప్రతిపక్ష నేత హోదాలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ.. గురువారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు అనంత కలెక్టరేట్‌ను ముట్టడించారు. తొలుత ప్రధాన రహదారి గుండా నిరసన ర్యాలీతో కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఇక్కడి ప్రధాన గేటు ముందు నడిరోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన నినాదాలతో హోరెత్తించారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రాజేశ్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. ఆశా కార్యకర్తలతో గ్రామాల్లో, పట్టణాల్లో వెట్టిచాకిరి చేయిస్తున్నారని ఆరోపించారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయడంలో వైకాపా ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. కరోనా వంటి విపత్కర సమయాల్లో ప్రాణాలను పణంగా పెట్టి పని చేశారని గుర్తు చేశారు. అప్పట్లో చాలా మంది అదే మహమ్మారి బారిన పడి మృత్యువాత పడ్డారు. నయాపైసా పరిహారం ఇవ్వలేదని ధ్వజమెత్తారు. సత్వరమే వీరి కుటుంబాలకు రూ.50 లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, ఆశా కార్యకర్తల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగవేణి, మున్సిపల్‌ వర్కర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు చిరంజీవి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఆశాలకు రూ.6 వేలు ప్రకారం చెల్లించారు. తమ ప్రభుత్వం వస్తే కనీస వేతనం ఇస్తామంటూ జగన్‌ నమ్మించారని ఆరోపించారు. సంక్షేమ పథకాలు సైతం రద్దు చేసినట్లు విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఆ తర్వాత కలెక్టరేట్‌ లోపలికి వెళ్లడానికి యత్నించారు. పరిస్థితి అదుపులోకి తెచ్చుకోవడానికి ఏఐటీయూసీ నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ కూడా కొద్దిసేపు ఆందోళన చేపట్టారు. ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి రాజు, మున్సిపల్‌ కార్మికుల సంఘం నాయకులు శివకృష్ణ, పార్వతి, హసీనా, ఫాతిమా, చిట్టి, సుగుణ, దుర్గమ్మ, అనంతలక్ష్మి పాల్గొన్నారు.

ఏఐటీయూసీ నాయకుడు రాజేశ్‌ను తరలిస్తున్న పోలీసులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని