logo

అందని వేతనాలు.. నలుగతున్న జీవితాలు

సైకిల్‌పై ప్రయాణిస్తున్న ఈయన పేరు ఆంజనేయులు. కూడేరు మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో కాంట్రాక్టు ప్రాతిపదిన అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. ఆ మండలంలోని కొర్రకోడు గ్రామం ఆయన సొంతూరు.

Published : 08 Dec 2023 04:39 IST

దయనీయ స్థితిలో సమగ్ర శిక్ష ఉద్యోగులు
ఉపాధ్యాయులు, పింఛనుదారులూ ఎదురుచూపులే

సైకిల్‌పై ప్రయాణిస్తున్న ఈయన పేరు ఆంజనేయులు. కూడేరు మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో కాంట్రాక్టు ప్రాతిపదిన అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. ఆ మండలంలోని కొర్రకోడు గ్రామం ఆయన సొంతూరు. అక్కడి నుంచి కూడేరు ఎంఈవో కార్యాలయానికి సైకిల్‌పై వస్తారు. రోజుకు 18 కి.మీ సైకిల్‌పై ప్రయాణించి విధులు నిర్వహిస్తున్నారు. 3 నెలల నుంచి ప్రభుత్వం వేతనాలు చెల్లించలేదు. నెలకు రూ.23 వేలు వేతనం రావాల్సి ఉంది. కుటుంబ పోషణ భారంగా మారిందని, కాయగూరలు, సరకులకూ కొనడానికి ఇబ్బంది పడుతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు బంగారం తాకట్టు పెట్టి కుటుంబాన్ని లాగుతున్నారని వాపోయారు.


అనంతపురం విద్య, జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ప్రతి నెలా ఇంటి ఖర్చులు అమాంతం పెరుగుతున్నాయి. ఉద్యోగుల రోజువారీ ఖర్చులకు ఇబ్బందులు చుట్టు ముడుతున్నాయి. అప్పులు చేస్తున్నారు. జీతం అందడం గగనం అవుతోంది. ఈ బాధ ఎన్నాళ్లకు తప్పుతుందోనని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సమగ్ర శిక్ష సిబ్బంది ఆవేదన కన్నీటి పర్యంతం అవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల దుస్థితే ఇలా ఉంటే.. పొరుగు, ఒప్పంద ఉద్యోగులు పరిస్థితి మరీ దారుణం. ఎస్‌ఎస్‌ఏ, ఆరోగ్యం, విద్య, ఐసీడీఎస్‌.. వంటి శాఖల్లోని పొరుగు, ఒప్పంద ఉద్యోగులకు నెలలు తరబడి వేతనాలు అందలేదు. స్పందన, జగనన్నకు చెబుదాం వంటి వేదికల్లోనూ వినతులు ఇచ్చినా స్పందించే నాథుడే కరవయ్యారు.  

విద్యాశాఖలో సమగ్ర శిక్ష ప్రాజెక్టు ఎంఐఎస్‌ కోఆర్డినేటర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, మండల స్థాయి అకౌంటెంట్లు, మెసెంజర్లు, ఎమ్మార్సీలు, సీఆర్పీలు, ఐఈఆర్‌టీలు పనిచేస్తున్నారు. కేజీబీవీల్లో ప్రిన్సిపాళ్లు, బోధన సిబ్బందితోపాటు వంట మనుషులు, సహాయకులు, వాచ్‌మెన్లు తదితర 25 కేడర్లలో పనిచేస్తున్నారు. వారిలో ఒప్పంద, పొరుగుసేవలు, పార్ట్‌టైం, అతిథి ఉపాధ్యాయులు, దినసరి వేతన కార్మికులు ఇలా.. ఉమ్మడి జిల్లాలో 2800 మంది పనిచేస్తున్నారు. వారికి 3 నెలలుగా వేతనాలు ప్రభుత్వం అందించలేదు. వారి ఉద్యోగ హోదా ప్రకారం రూ.14 వేల నుంచి రూ.34 వేల వరకూ వేతనాలు చెల్లిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒక నెల వేతనం ఆలస్యమైతే నానా తంటాలు పడతారు. తాత్కాలిక, ఒప్పంద ఉద్యోగులకు అసలే అరకొర వేతనాలు.. పైగా 3 నెలలుగా వేతనాలు రాకపోవడంతో కుటుంబాల పరిస్థితి తలకిందులవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరీ ఇంత వ్యతిరేక భావమా?

నవంబరులో ఏడు రోజులు గడిచినా ఉపాధ్యాయులకు పూర్తి స్థాయిలో జీతాలు జమ కాలేదు. ప్రభుత్వ శాఖలో అత్యధిక సంఖ్యలో ఉన్న ఉపాధ్యాయులు, పెన్షనర్లు, సచివాలయ ఉద్యోగులు... వంటి కేడర్లకు జీతాలు అందని దయనీయ దుస్థితి నెలకుంది. ఈ ప్రభుత్వం మొదటి నుంచి ఉపాధ్యాయుల పట్ల గుర్రుగా ఉంది. హక్కుల సాధన కోసం ఉద్యమించిన కారణంగా గురువులపై వైకాపా ప్రభుత్వం వ్యతిరేకత భావంతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. అందుకే 3 సంవత్సరాలుగా ఒకటి లేదా రెండో తేదీన జీతాలు జమ కాని పరిస్థితి నెలకుంది.  

అనంత, శ్రీసత్యసాయి జిల్లాల పరిధిలో 18 ఉప ఖజానా కార్యాలయాలు ఉన్నాయి. ఇందులో అన్ని శాఖలకు చెందిన ప్రభుత్వ, జేఎన్‌టీయూ, ఎస్కేయూ, పొరుగు, ఒప్పంద, ఏజెన్సీల పరిధిలో 1.39 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 50 శాతం దాకా మాత్రమే వేతనాలు జమ అయినట్లు తెలుస్తోంది. తక్కిన వారికి దశల వారీగా నెలంతా జమ చేస్తూ ఉంటారు.


సమ్మెకు సన్నద్ధమవుతున్నాం
  - విజయ్‌, సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు

ఉద్యోగులందరినీ ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. కొందరికి మినిమం టైం స్కేల్‌ అమలు చేస్తామన్నారు. వేతనాలు పెంచుతామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. ఇచ్చిన జీవోలు కూడా అమలు కాలేదు. 3 నెలల నుంచి వేతనాలు ఇవ్వలేదు. ఈ సమస్యలపై ఛలో విజయవాడ నిర్వహించిన అనంతరం 20 నుంచి సమ్మె చేయాలని నిర్ణయించాం.


త్వరలో జమ చేస్తాం
- వరప్రసాదరావు, ఏపీసీ, సమగ్రశిక్ష

ప్రభుత్వానికి బడ్జెట్‌ ప్రతిపాదనలు పంపించాం. ఒకటి రెండు రోజుల్లో బడ్జెట్‌ విడుదల కానున్నాయి. బిల్లులు సిద్ధంగా ఉన్నాయి. నిధులు రాగానే రెండు రోజుల్లో వేతనాలు జమ చేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని