logo

ప్రతిబంధకాలు అనేకం.. ప్రగతి శూన్యం

కొండ నాలుకకు మందేస్తే....ఉన్న నాలుక ఊడిందన్నది.. క్రీడారంగానికి అతికినట్లు సరిపోతుంది. నానాటికీ ప్రమాణాలు పడిపోవడానికి కారణం పాలకుల నిర్లక్ష్యమే. గత ప్రభుత్వ హయాంలో రూపొందించిన క్రీడా విధానానికి పాతరేసిన వైకాపా సర్కారు.

Published : 08 Dec 2023 04:42 IST

క్రీడారంగాన్ని విస్మరించిన వైకాపా ప్రభుత్వం

జిల్లా క్రీడాప్రాధికార సంస్థ కార్యాలయం

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: కొండ నాలుకకు మందేస్తే....ఉన్న నాలుక ఊడిందన్నది.. క్రీడారంగానికి అతికినట్లు సరిపోతుంది. నానాటికీ ప్రమాణాలు పడిపోవడానికి కారణం పాలకుల నిర్లక్ష్యమే. గత ప్రభుత్వ హయాంలో రూపొందించిన క్రీడా విధానానికి పాతరేసిన వైకాపా సర్కారు.. కొత్త విధానం పేరిట కాలయాపన చేస్తోంది. నాలుగున్నరేళ్లలో క్రీడల కోసం ఏమి చేసిందో ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏదీ లేదు. మౌలిక సదుపాయాలు కల్పించిన దాఖలాలు మచ్చుకైనా కనిపించవు. దీంతో అనంత క్రీడాకారులు వివిధ పోటీల్లో ప్రతిభ చాటలేకపోతున్నారు. వైకాపా ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయింపుల్లో చిన్నచూపు చూస్తోంది. గతంలో ఏటా కొంతమేర బడ్జెట్‌ జిల్లా క్రీడాప్రాధికార సంస్థలకు కేటాయించేవారు. ఈ నిధులతో మండల, జిల్లాస్థాయి పోటీలు నిర్వహించి గ్రామీణ యువత ప్రతిభను వెలుగులోకి తెచ్చేవారు. ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి బడ్జెట్‌ విడుదల చేయలేదు. శాప్‌ ఆధ్వర్యంలో ఏడాది క్రితం సీఎం కప్‌ పోటీలు నిర్వహించిన వైకాపా సర్కారు.. ప్రస్తుతం ఆడుదాం ఆంధ్రా పేరిట ప్రచార ఆర్భాటం చేస్తోంది. ఇందుకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ గ్రామీణ క్రీడలను పక్కనబెట్టింది.

రొక్కం చెల్లించు.. ఆటలు ఆడు

రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం తెచ్చిన పే అండ్‌ ప్లే పథకంతో క్రీడారంగం నిర్వీర్యమైంది. డీఎస్‌ఏ (డిస్ట్రిక్‌ స్పోర్ట్స్‌ అథారిటీ) శిక్షకుల ద్వారా తర్ఫీదు పొందాలంటే ఆటను బట్టి నెలకు రూ.50 నుంచి 200 వరకు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేశారు. డబ్బు చెల్లించి నేర్చుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో శిక్షకులు కొందరు తమ జీతాల నుంచి చెల్లించారు. క్రీడాకారులతో డబ్బులు వసూలు చేయని శిక్షకులను సస్పెండ్‌ చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రతి నెలా డీఎస్‌ఏ నుంచి రూ.10 వేల నుంచి 20వేల వరకు చెల్లించేవారు. క్రీడాకారుల సంఖ్య తగ్గడం, శాప్‌ ఎండీ మారిపోవడంతో కొన్ని ఆటలకే పరిమితం చేశారు. షటిల్‌, టీటీ, తైక్వాండో నేర్చుకునే వారి నుంచి ఇప్పటికీ వసూలు చేస్తున్నారు.

రవాణా ఖర్చుల చెల్లింపునకు మంగళం

తెదేపా ప్రభుత్వ హయాంలో జిల్లా నుంచి రాష్ట్రస్థాయి పోటీలకు వెళ్లే క్రీడాకారులకు రవాణా ఖర్చులు ప్రభుత్వం చెల్లించేది. గత సర్కారు హయాంలో రూపొందించిన క్రీడా విధాన ముసాయిదా ప్రకారం కొత్త అకాడమీల ఏర్పాటు, పోటీలకు వెళ్లే క్రీడాకారులకు రానుపోను ప్రయాణ ఛార్జీలు చెల్లించేవారు. ప్రస్తుతం ఒక్క పైసా ఇవ్వకపోవడం గమనార్హం. సంఘాలు, పాఠశాల క్రీడల పోటీల్లో పాల్గొనే వారు సొంత ఖర్చులతో వెళ్లివస్తున్నారు. ఇక పేదలు దూర ప్రయాణ ఛార్జీలు భరించలేక పోటీల నుంచి తప్పుకుంటున్నారు. ఏటా రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి అనంత జిల్లా నుంచి వెయ్యి మందికి పైగా పాల్గొంటున్నారు. రాయితీలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


కొన్నింటికే వసూలు చేస్తున్నాం
- నరసింహారెడ్డి, డీఎస్‌డీఓ

డీఎస్‌ఏ ద్వారా శిక్షణ ఇస్తున్న కొన్ని క్రీడలకు సంబంధించి ఫీజు వసూలు చేస్తున్నాం. కబడ్డీ, అథ్లెటిక్స్‌, ఖోఖో, వాలీబాల్‌కు లేదు. ఆరు నెలల నుంచి వసూలు చేయడం లేదు. ప్రస్తుతం సాధనకు వచ్చే క్రీడాకారుల సంఖ్య పెరిగింది.


ప్రభుత్వం శ్రద్ధ పెట్టలేదు
- కేఎం అసదుల్లా, మాజీ అధ్యక్షుడు, జిల్లా ఒలింపిక్‌ సంఘం

ప్రస్తుత ప్రభుత్వం క్రీడలపై పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. పే అండ్‌ ప్లే విధానం అమలుతో ఎంతో మంది క్రీడాకారులు కనుమరుగయ్యారు. గ్రామీణస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించి.. శిక్షకులను నియమించాలి. సర్కారు ఎలాంటి సదుపాయాలు కల్పించలేదు. క్రీడల్లో మన రాష్ట్రం చాలా వెనుకబడి ఉంది. సీఎం కప్‌, ఆడుదాం ఆంధ్రా పోటీలతో పెద్దగా ఫలితం ఉండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని