logo

మూలకు మగ్గాలు..మూగబోతున్న నేతన్నలు

అత్యంత వెనుకబడిన శ్రీసత్యసాయి జిల్లాలో వ్యవసాయం తర్వాత చేనేత రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ రంగంలో గిట్టుబాటు లేకపోవడం.. కుటుంబపోషణ భారం, పిల్లల చదువులు, చేసిన అప్పులు తీర్చలేక, వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక చేనేత కార్మికులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.

Updated : 08 Dec 2023 06:21 IST

అప్పుల బాధతో బలవన్మరణాలు
భారంగా కుటుంబ పోషణ
పుట్టపర్తి, న్యూస్‌టుడే

త్యంత వెనుకబడిన శ్రీసత్యసాయి జిల్లాలో వ్యవసాయం తర్వాత చేనేత రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ రంగంలో గిట్టుబాటు లేకపోవడం.. కుటుంబపోషణ భారం, పిల్లల చదువులు, చేసిన అప్పులు తీర్చలేక, వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక చేనేత కార్మికులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. చేనేత కార్మికుల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబాలను పరామర్శించడం, కొద్దిపాటి పరిహారం అందించి, చేతులు దులుపుకొంటున్నారు. చేనేత పరిశ్రమను ఆదుకోవడానికి వైకాపా నాలుగున్నరేళ్ల పాలనలో చేపట్టిన చర్యలు శూన్యం.

నాడు కూడుపెట్టిన పని.. నేడు బాధ పెడుతోంది

ఆదుకోవాల్సిన ప్రభుత్వం మొండి చెయ్యి చూపిస్తోంది. శ్రీసత్యసాయి జిల్లాలో మొత్తం 26 వేల మంది చేనేతలు ఉన్నారు. సంక్షోభంలో ఉన్న నేతన్నల బాధలు వర్ణనాతీతం, చాలామంది ఈ పని వదిలేసి ఇతర కూలీ పనుల వైపు మళ్లిపోతున్నారు. శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి నాణ్యమైన పట్టుచీరలకు ప్రసిద్ధి చెందింది ధర్మవరం. అలాంటిది ఇక్కడ నేతన్నలు ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకోవడం అందరినీ కలిచివేస్తోంది.

తగ్గిన గిరాకీ..

ఒకప్పుడు పట్టు వస్రాలకు మంచి గిరాకీ ఉండేది. నేతన్న పడిన కష్టానికి మంచి ఆదాయం వచ్చేది. కానీ, నేటి పరిస్థితుల్లో కనీసం ఉపాధి దొరకడం కూడా ప్రశ్నార్ధకమే. రోజుకు 6 గంటలపాటు వారం రోజులు మగ్గంపై కష్టపడితే గానీ ఓ చీర తయారీ కాదు. అలా తయారు చేస్తే తమకు మిగిలేది కేవలం రూ.3,500 లేనని నేతన్నలు చెబుతున్నారు. నేతన్నలకు ఇది తప్పితే మరో పని రాదు. మనసు చంపుకొని వేరే పనులకు వెళ్లినా అనుభవం లేదని కూలి తక్కువగా చెల్లిస్తారు. ఇంటిల్లిపాదీ ఆ మగ్గంపై వచ్చే ఆదాయంతోనే బతుకుతున్నారు. కరెంటు బిల్లులు, అవసరాలకు తీసుకున్న అప్పులు, బ్యాంకు రుణాలను సరైన సమయంలో కట్టేందుకు కూడా డబ్బులు లేక మనోవేదనకు గురౌతున్నారు. వచ్చిన తక్కువ ఆదాయంతో పిల్లల చదువులను, కుటుంబ బాధ్యతను మోయలేకపోతున్నారు, పనిచేసేటప్పుడు కాంతిలో ఎక్కువసేపు దారాన్ని చూస్తూ ఉండాలి. అందువల్ల కంటి చూపు మందగిస్తుంది. చాలామంది ఇలా కంటి చూపును కోల్పోతున్నారు.

ఆత్మహత్యలే శరణ్యమని..:  అప్పుల బాధలు, ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న నేతన్నలు బలవంతంగా తమ ప్రాణాలు తీసుకొంటున్నారు. ప్రాణాలు తీసుకొని భార్యా పిల్లలకు కన్నీళ్లే మిగుల్చుతున్నారు.  

పవర్‌లూమ్‌ చీరలతో నష్టం: చేతి మగ్గంపై తయారు చేసే చీరకు ఎక్కువ ఖర్చు అవుతోంది. అందుకే తక్కువ పెట్టుబడితో తయారయ్యే పవర్‌లూమ్‌ చీరలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు వీవర్లు. దీంతో చేతి మగ్గాలకు డిమాండ్‌ తగ్గిపోయింది.


శిక్షణ క్లస్టర్ల మూసివేత

గతంలో శ్రీసత్యసాయి జిల్లాలో పుట్టపర్తి, ధర్మవరంలోని క్లస్టర్లను 3 ఏళ్ల కాలపరిమితి దాటిందని మూసివేశారు. వాటి ద్వారా ఎంతో మందికి శిక్షణను ఇచ్చి యంత్రాలను కూడా ఇచ్చేవారు. కేంద్ర పరిధిలోని ఈ ప్రాజెక్టులో వీవింగ్‌, డిజైన్‌, డైయింగ్‌పై శిక్షణనిస్తూ, రోజుకు రూ.210 స్టైఫండ్‌ కూడా చెల్లించేవారు. శిక్షణ ముగిశాక 90 శాతం రాయితీతో యంత్రాలు ఇచ్చేవారు. ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు.


కరెంటు బిల్లులతో సతమతం
- మణికంఠ, ధర్మవరం

మగ్గాలపై పనిచేస్తున్నప్పుడు ఫ్యాను, లైటు కచ్చితంగా ఉండాల్సిందే. కాబట్టి కరెంటు బిల్లులు అధికంగా వస్తున్నాయి. కూలీకి పట్టుచీరలు నేస్తున్నాను కొన్నిసార్లు ఉపాధి దొరకదు అప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. నాకొచ్చే ఆదాయంతో ఈ బిల్ల్లులు కట్టలేకపోతున్నాను. కంటి చూపుకూడా రోజురోజుకూ తగ్గిపోతుంది. నా తరవాతి తరం వారికి మాత్రం ఈ పని నేర్పించకూడదని బలంగా నిర్ణయించుకున్నాను.


ఇంటి అద్దె కట్టలేకపోతున్నా..
- రామాంజనేయులు, నేతన్న, ధర్మవరం

తరతరాలుగా మగ్గంపై పట్టుచీరలు నేస్తున్నాను. ఒక చీర తయారీకి వారం పడుతోంది. కనీసం నెలకు రూ.10 వేల ఆదాయం కూడా రావడం లేవు. నాకు ఇద్దరు పిల్లలు. వారి చదువులపై ఆందోళన నెలకొంది. ఇంటి అద్దె కట్టేందుకు కూడా ఇబ్బందిగా ఉంది. గత తెదేపా ప్రభుత్వంలో రాయితీపై యంత్రాలు ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో ఒక్క యంత్రం కూడా పొందలేదు.


పరిహారం అందిస్తాం
- రమేశ్‌, చేనేత జేడీ

వివిధ కారణాలతో ఆత్మహత్య చేసుకున్న వారికి రావాల్సిన సొమ్ము బాధితుడు, అధికారి ఉమ్మడి ఖాతాలోకి జమవుతాయి. ఇప్పటికే కొంతమందికి డబ్బులు జమకాగా మిగిలిన వారికి సొమ్ము అందడంలో జాప్యం జరిగింది. దీనికి సంబంధించి పై అధికారులకు విన్నవించాను. మరికొద్ది రోజుల్లో పడేలా చేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని