logo

పంటల దిగుబడిపై దిగులు

వర్షాభావంతో హెచ్‌ఎల్‌సీకి తుంగభద్ర జలాల సరఫరా ఆగిపోయింది. అనుబంధంగా సాగే గుంతకల్లు బ్రాంచ్‌ కెనాల్‌ (జీబీసీ)లో నీటి ప్రవాహం నిలిచిపోయింది. ఈ కాలువ కింద 32 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. సింహభాగం మిరప పంటదే.

Published : 08 Dec 2023 05:02 IST

జీబీసీకి కృష్ణాజలాల తరలింపులో కానరాని ప్రత్యామ్నాయ చర్యలు
పట్టించుకోని వైకాపా ప్రభుత్వం
ఆందోళనలో అన్నదాతలు
ఉరవకొండ, విడపనకల్లు, న్యూస్‌టుడే

ప్రత్యామ్నాయ కాలువలో ముళ్లకంపలు ఇలా..

ర్షాభావంతో హెచ్‌ఎల్‌సీకి తుంగభద్ర జలాల సరఫరా ఆగిపోయింది. అనుబంధంగా సాగే గుంతకల్లు బ్రాంచ్‌ కెనాల్‌ (జీబీసీ)లో నీటి ప్రవాహం నిలిచిపోయింది. ఈ కాలువ కింద 32 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. సింహభాగం మిరప పంటదే. ప్రస్తుతం పిందె దశలో ఉండటంతో నీటి తడులు అవసరం. వర్షాలు రాకపోయినా తుంగభద్ర నీటితో ఇన్నాళ్లూ రైతులు పంటను కాపాడుకున్నారు. మరో నెల రోజులు నీరందిస్తే వేల ఎకరాల్లో మిరపతో పాటు ఇతర పంటలు చేతికి అందే అవకాశం ఉంది. జీబీసీకి ప్రత్యామ్నాయంగా కృష్ణా జలాలను తరలించడానికి వీలుంది. హంద్రీనీవా ఉపకాలువ ద్వారా ఉరవకొండ మండలం నింబగల్లు వద్ద జలాలను జీబీసీలో కలపడానికి మార్గం ఉంది. ఏడు కి.మీ కాలువ, మరో ఏడు కి.మీ వంక ద్వారా కృష్ణా జలాలు కలుస్తాయి. ప్రత్యామ్నాయ కాలువలో ముళ్లకంపలు పెరిగాయి. వాటిని తొలగిస్తే నీరు సులభంగా అక్కడికి చేరుతుంది. ప్రస్తుతం హంద్రీనీవాలో ప్రవాహం ఆశాజనకంగా సాగుతోంది. తుంగభద్ర జలాలు ఆగిపోతాయని అధికారులు రెండు నెలలుగా ప్రకటిస్తూనే వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టే దిశగా వైకాపా సర్కారు చొరవ చూపలేదు. దీంతో వేలాది ఎకరాల్లో పంట దిగుబడి ప్రశ్నార్థకంగా మారింది.


పంటలను కాపాడిన తెదేపా ప్రభుత్వం

సాగు చేసిన మిరప పంట

ప్రస్తుత పరిస్థితులే 2016లోనూ ఉండేవి. నవంబరులోనే తుంగభద్ర జలాలు ఆగిపోయాయి. ఆ సమయంలో కృష్ణా జలాలను తరలించడానికి అప్పటి ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ అధికారులను సంప్రదించారు. నీటిని తరలించడానికి సాధ్యం కాదని చెప్పారు. ఈక్రమంలో ప్రైవేటుగా సర్వే చేయించి, నీటిని తరలించవచ్చని నిర్ధారణకు ఇచ్చారు. ఏడు కి.మీ మేర సొంత ఖర్చుతో కాలువ తవ్వించి.. కృష్ణా జలాలను జీబీసీకి సరఫరా చేయించి పంటలు కాపాడారు. ప్రస్తుతం ఆ నీటిని తరలించడానికి ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా పాలకులు పట్టించుకోవడం లేదు.


ఆధునికీకరణకు సిద్ధం
- పయ్యావుల కేశవ్‌, ఎమ్మెల్యే

ప్రత్యామ్నాయంగా జీబీసీకి కృష్ణా జలాలను అందించి పంటలను కాపాడాల్సి ఉంది. ఈమేరకు సొంత ఖర్చులతో ప్రత్యామ్నాయ కాలువ ఆధునికీకరణకు సిద్ధంగా ఉన్నా. ప్రభుత్వం అడ్డుపడకపోతే వెంటనే పనులు చేపట్టడానికి సమాయత్తం అవుతాం. పంటలను కాపాడి రైతులను గట్టెక్కించాలన్నదే మా అభిప్రాయం.


తరలించి ఆదుకోవాలి
- దేవేంద్ర, ఉండబండ, విడపనకల్లు మండలం

జీబీసీ కింద పది ఎకరాల్లో మిరప సాగు చేశా. ఎకరాకు రూ.1.5 లక్షల చొప్పున ఖర్చు పెట్టాను. సాగునీరు సరఫరా ఆగి పోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నాం. కృష్ణా జలాలను జీబీసీకి తరలించే దిశగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి ఆదుకోవాలి.


తీవ్రంగా నష్టపోతాం
- లోకేశ్‌, రాయంపల్లి, ఉరవకొండ మండలం

గతంలో ఇలాంటి పరిస్థితి ఎదురైతే పయ్యావుల కేశవ్‌ స్పందించి నీటి సరఫరా చేయించారు. దీంతో పంటలు కాపాడుకున్నాం. ప్రస్తుతం అలాంటి చర్యలు చేపట్టకపోతే తాము తీవ్రంగా నష్టపోతాం. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని